కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) అధినేత్రి మమతా బెనర్జీకి కోలుకోలేని దెబ్బ తగిలింది. పార్టీ సీనియర్ నేత సుఖేందు శేఖర్ రాయ్ రాజీనామా చేసిన కొద్ది రోజుల వ్యవధిలోనే, మరో కీలక మహిళా నేత, రాజ్యసభ ఎంపీ సుస్మితా దేవ్ బుధవారం తన పదవికి రాజీనామా చేశారు. పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత టీఎంసీలో తిరుగుబాటు తీవ్రరూపం దాల్చింది. ఈ పరిణామాల మధ్యే సుస్మితా దేవ్ ఢిల్లీలో అస్సాం బీజేపీ ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మతో భేటీ కావడం రాజకీయ వర్గాల్లో తీవ్ర కలకలం రేపుతోంది.
పతనం దిశగా మమత సామ్రాజ్యం?
ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ చేతిలో ఘోర పరాజయం పాలైన తర్వాత టీఎంసీని కాపాడుకోవడం మమతా బెనర్జీకి కత్తిమీద సాములా మారింది. మూడు పర్యాయాలు అధికారంలో ఉన్న పార్టీ ఇప్పుడు అంతర్గత కుమ్ములాటలతో కొట్టుమిట్టాడుతోంది. ఇప్పటికే ఎమ్మెల్యే రితబ్రత బెనర్జీ 58 మంది శాసనసభ్యుల మద్దతుతో అసెంబ్లీలో ప్రతిపక్ష నేత పదవిని కోరుతుండగా, మరో ఎంపీ కాకోలి ఘోష్ 19 మంది అసమ్మతి ఎంపీలతో కలిసి బీజేపీ నేతృత్వంలోని ఎన్‌డీఏకు మద్దతు ఇచ్చేందుకు సిద్ధమవడం పార్టీ పతనానికి సంకేతంగా మారింది.
అవినీతిపై తిరుగుబాటు బావుటా
ఈ వారంలోనే మరో ప్రముఖ ఎంపీ సుఖేందు శేఖర్ రాయ్ పార్టీకి రాజీనామా చేస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు. టీఎంసీలో అడ్డూఅదుపూ లేని అవినీతి, అరాచకం కొనసాగుతోందని ఆయన ఆరోపించారు. ప్రతిపక్షాల ‘ఇండియా’ కూటమి సమావేశానికి కొన్ని గంటల ముందే ఆయన ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. పార్టీ సంస్థాగత నిర్మాణంలో అవినీతి వేళ్లునుకుపోయిందని, ప్రజల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోందని రాయ్ మండిపడ్డారు.
కాంగ్రెస్ నుండి టీఎంసీ.. ఇప్పుడు బీజేపీ వైపు?
గతంలో అఖిల భారత మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలిగా పనిచేసిన సుస్మితా దేవ్ 2019 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి రాజ్‌దీప్ రాయ్ చేతిలో ఓడిపోయారు. ఆ తర్వాత 2021లో కాంగ్రెస్‌ను వీడి టీఎంసీలో చేరారు. పార్టీ జాతీయ అధికార ప్రతినిధిగా కూడా బాధ్యతలు నిర్వహించిన ఆమె, ఇప్పుడు రాజ్యసభ స్థానానికి రాజీనామా చేయడంతో మమతా బెనర్జీ రాజకీయ వ్యూహాలకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ప్రస్తుతం ఆమె బీజేపీ సీఎం హిమంత బిస్వా శర్మతో భేటీ కావడంతో, ఆమె త్వరలోనే కాషాయ తీర్థం పుచ్చుకోనున్నట్లు ప్రచారం జరుగుతోంది.


