కోల్‌కతాకు నా పునరాగమనమే ఇందుకు నిదర్శనం
వివాదాస్పద రచయిత్రి తస్లీమా నస్రిన్ వ్యాఖ్య
కోల్‌కతా: అన్యాయం అనేది అశాశ్వతమని వివాదాస్పద రచయిత్రి తస్లీమా నస్రిన్ వ్యాఖ్యానించారు. 19 సంవత్సరాల క్రితంగా ఆమె రచనలపై పశ్చిమబెంగాల్‌లో మొదలైన నిరసనలతో చివరకు ఆమె కోల్‌కతా నగరాన్ని వీడాల్సి వచ్చింది. ఆ తర్వాత ఇన్నాళ్లకు తొలిసారిగా కోల్‌కతాకు వచ్చిన ఆమె శనివారం ఒక సాహిత్య కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించారు. ‘‘కోల్‌కతాకు వచ్చాక ఇన్నాళ్లూ నేను ఇక్కడ వదిలేసి వెళ్లిన నా జీవితంలోకి మళ్లీ వచ్చినట్లుంది.
ఇన్నాళ్లూ కోల్‌కతాను వీడటంతో నా చిరునామాను కోల్పోయానన్న బాధ అనుక్షణం వేధించింది’’అని ఆమె ఒకింత భావోద్వేగానికి గురయ్యారు. ‘‘ఏ రాజకీయ పార్టీ తరఫున మాట్లాడేందుకు రాలేదు. ఏ పార్టీకీ నేను వ్యతిరేకం కాదు. మహిళల హక్కుల సాధన కోసం గళం విన్పిస్తూనే ఉంటా. అన్ని రకాల మతవాదాలకు నేను వ్యతిరేకం. ముఖ్యంగా ముస్లిం ఛాందసవాదానికి నేను పూర్తి వ్యతిరేకం. ఎందుకంటే చిన్నతనం నుంచి ఆ ఛాందసవాదాన్ని కళ్లారాచూశా.
నేను పుట్టి పెరిగిన బంగ్లాదేశ్‌లో ఇప్పుడు మత అతివాదం ప్రబలుతోంది. దీంతో వాక్ స్వాతంత్య్రం మరింత ప్రమాదంలో పడుతోంది. బంగ్లాలో ఛాందసవాదం పడగ విప్పే కొద్దీ వాక్ స్వాతంత్య్రం గొంతు నొక్కుకుపోతుంది. మహిళలు, మైనార్టీలు ఆ దేశంలో భద్రంగా, గౌరవంగా భవిష్యత్తులోనైనా బతకాలని కోరుకుంటున్నా. ఇన్నాళ్ల తర్వాత నేను కోల్‌కతాలో అడుగుపెట్టే గడియలొచ్చాయి. అన్యాయం శాశ్వతంగా ఉండబోదనడానికి ఈ క్షణాలే సాక్ష్యం. నన్ను అడ్డుకున్న వాళ్లు, ఇప్పుడు స్వాగతం పలికి వాళ్లు ఎవరనేది చరిత్ర గుర్తుంచుకుంటుంది’’అని అన్నారు.
లజ్జ నవల రచించాక స్వదేశంలో బెదిరింపులు ఎక్కువయ్యాక తస్లీమా 1994 ఆగస్ట్‌లో బంగ్లాదేశ్ నుంచి పారిపోయారు. 2004లో కోల్‌కతాలో ఆమె స్థిరపడ్డారు. అయితే ద్విఖండిత అనే ఆత్మకథ రాయడం, అందులోని అంశాలను ముస్లిం సంఘాలు తీవ్రస్థాయిలో వ్యతిరేకించి ఉద్యమించడం, అది హింసాత్మకంగా మారడంతో నాటి బుద్దదేవ్ భట్టాచార్య సారథ్యంలోని బెంగాల్ ప్రభుత్వం ఆమెను రాష్ట్రం నుంచి పంపేసింది. దీంతో ఆమె తర్వాత జైపూర్‌కు చివరకు ఢిల్లీలో అజ్ఞాతవాసంలో ఉండాల్సి వచ్చింది. అయినాసరే ఆమె పై ఒత్తిళ్లు పెరడంతో యూరప్‌కు వెళ్లిపోయారు.
ఎప్పడొచ్చినా భద్రత కల్పిస్తాం: ముఖ్యమంత్రి
ఇదే కార్యక్రమంలో పాల్గొన్న పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి సువేందు అధికారి మాట్లాడారు. ‘‘సీఎంగా, పోలీస్ శాఖ సారథిగా ఇది నా బాధ్యత. మీరు ఎన్నిసార్లు రాష్ట్రానికి వచ్చినా పటిష్టమైన భద్రత కల్పించే బాధ్యత నాది. ఇకపై బెంగాల్‌లో బెదిరింపులు, భయాలు అనేవి ఉండవు. రాజ్యాంగ మూలస్తంభాలన్నీ ఇక్కడ పటిష్టంగా ఉంటాయి. ప్రతి ఒక్కరూ రాష్ట్రానికి రావొచ్చు. వాక్ స్వాతంత్య్రం మేరకు మాట్లాడొచ్చు. నస్రీన్ ఎప్పుడొచ్చానా ఆమెకు భద్రమైన బెంగాల్ స్వాగతం పలుకుతుంది’’ అని సీఎం అన్నారు.


