వాళ్ల ప్రభావానికి లోనయ్యా..
15 ఏళ్ల అమ్మాయి వీడియో వైరల్
న్యూఢిల్లీ: నీట్ ప్రశ్నపత్రాల లీకేజీపై జరిగిన నిరసన ప్రదర్శనల్లో ప్రధాని మోదీని దుర్భాషలాడిన బాలిక ఒకరు క్షమాపణలు చెబుతూ చేసిన వీడియో ఒకటి ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఇతరుల ప్రభావానికి లోనై తాను అలా మాట్లాడానని, పోస్టు చేసింది కూడా తాను కానని, తన వయసు పదిహేనేళ్లు మాత్రమేనని శనివారం విడుదలైన వీడియోలో ఒక బాలిక చెబుతూండటం కనిపించింది.
అయితే ఈ వీడియో అసలుదా? కాదా? అన్నది తాము నిర్ధారించలేదని పీటీఐ స్పష్టం చేయడం గమనార్హం. ప్రధాని మోదీ ఒక ఇన్‌స్టాగ్రామ్ రీల్‌లో మాట్లాడుతూ తప్పుదారి పట్టిన పిల్లలు కొందరు తనను దుర్భాషలాడారని, వారిని క్షమించి సరైన మార్గంలో పెట్టాల్సిన అవసరముందని వ్యాఖ్యానించిన కొంత సమయానికే క్షమాపణలు కోరుతున్న బాలిక వీడియో విడుదల కావడం గమనార్హం.
బాలిక ఆ వీడియోలో మాట్లాడుతూ... ‘‘జూలైలో ఫ్రెండ్స్‌తో కలిసి కన్నాట్‌ప్లేస్‌కు వెళ్లా. అక్కడ కొంతమంది ప్రధానిని తిడుతూ, అభ్యంతరకరమైన భాష వాడుతూ కనిపించారు. వాళ్లు నన్ను ప్రభావితం చేశారు. తమ మాటలను రిపీట్ చేయాల్సిందిగా ప్రోత్సహించారు. దాంతో నేను కూడా వారిలా మాట్లాడాను’’ అని చెప్పింది. ‘‘నేనిప్పుడు తలెత్తుకోలేకపోతున్నాను.
దేశం మొత్తాన్ని, ప్రతి ఒక్కరిని నన్ను క్షమించమని కోరుతున్నా’’ అని కూడా ప్రార్థించినట్లు ఆ వీడియోలో ఉంది. ‘‘ఇదే తన తొలి, చివరి తప్పిదమని, ఇలాంటి పని ఇంకోసారి చేయను’’అని వివరించింది. ప్రధానిని తిడుతూ చేసిన వీడియో ఆధారంగా పోలీసులు ఇప్పటికే ఒక కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. నోయిడాలో ఆ వీడియోపై జీరో ఎఫ్‌ఐఆర్ నమోదు కాగా... అది ఆ తరువాత ఢిల్లీకి బదిలీ అయ్యింది.


