భోగాపురం ఎయిర్‌పోర్టు ప్రారంభోత్సవంలో ప్రధాని మోదీ
అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం జాతికి అంకితం
ఏపీ యువత భవిష్యత్తుకు కొత్త దిశ.. వారిలో అద్భుతమైన ప్రతిభ ఉంది
సాఫ్ట్‌వేర్ రంగంలో ప్రపంచవ్యాప్తంగా రాణిస్తున్నారు
దాంతోపాటు తయారీ రంగంపైనా దృష్టి పెడుతున్నాం..
విశాఖ నుంచి కృష్ణపట్నం వరకు కోస్టల్ ఎకనమిక్ కారిడార్
రూ.17,900 కోట్ల అభివృద్ధి పనులకు ప్రధాని మోదీ శ్రీకారం
ఉత్తరాంధ్ర ప్రాజెక్టులతో ఇక రివర్స్ మైగ్రేషన్.. చంద్రబాబు
50 ఏళ్ల రాజకీయ జీవితంలో మోదీ వంటి నేతను చూడలేదని వ్యాఖ్య
ప్రధానిని తిడుతుంటే నాకు కన్నీళ్లు వచ్చాయి.. పవన్ కళ్యాణ్
అలాంటి బలమైన నాయకుడి వెంట మనమంతా ఉండాలని పిలుపు
సాక్షి ప్రతినిధి, విజయనగరం: భోగాపురంలోని అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ఉత్తరాంధ్ర, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి రన్‌వేగా, యువత భవిష్యత్తుకు లాంచ్‌ప్యాడ్‌గా నిలుస్తుందని ప్రధాని మోదీ పేర్కొన్నారు. భోగాపురం విమానాశ్రయంతో పాటు రాష్ట్రంలోని పలు ప్రాజెక్టులు, సెమీకండక్టర్ పరిశ్రమలకు శనివారం ప్రధాని శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ ఉత్తరాంధ్ర పవిత్ర భూమిలో ఉండటం తన అదృష్టంగా భావిస్తున్నానని పేర్కొన్నారు, శ్రీ వరాహ లక్ష్మీనర్సింహ స్వామి, శ్రీకూర్మనాథ స్వామి, పైడితల్లి అమ్మవారిని స్మరించారు.
భోగాపురం వేదిక నుంచి సుమారు రూ.17,900 కోట్ల విలువైన పలు అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేసి జాతికి అంకితం చేశారు. ఈ రోజు ప్రారంభమైన విమానయానం, రహదారులు, సెమీకండక్టర్లు, స్వచ్ఛ ఇంధనం, పోర్టులు, రైల్వేలు, కనెక్టివిటీ తదితర రంగాలకు సంబంధించిన ఈ ప్రాజెక్టులు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి కొత్త దిశను చూపుతాయని ప్రధాని పేర్కొన్నారు. సమరయోధుడు అల్లూరి సీతారామరాజు గిరిజనుల సంక్షేమం కోసం జీవితాన్ని అంకితం చేసిన నేలపైనే కొత్త విమానాశ్రయం ఏర్పాటు కావడం గొప్ప విశేషమన్నారు.

ఎయిర్‌పోర్టును ప్రారంభిస్తున్న ప్రధాని మోదీ, గవర్నర్ జస్టిస్ అబ్దుల్‌నజీర్, సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్‌కళ్యాణ్
దేశంలో పౌర విమానయాన రంగం గత 12 ఏళ్లలో విశేషంగా అభివృద్ధి చెందిందని ప్రధాని వివరించారు. 2014లో దేశంలో 74 విమానాశ్రయాలు మాత్రమే ఉండగా, ప్రస్తుతం వాటి సంఖ్య 166కు పెరిగిందన్నారు. ఉడాన్ పథకంతో సామాన్య ప్రజలు కూడా విమాన ప్రయాణం చేసే అవకాశం కల్పించామని చెప్పారు. ఉడాన్ రెండో దశకు రూ.29 వేల కోట్లు కేటాయించినట్లు వెల్లడించారు. కాశీలో ప్రారంభించిన స్పోక్ ఎయిర్‌పోర్ట్ మోడల్ ఇప్పుడు అమృత్‌సర్‌కు విస్తరించి, అక్కడి నుంచి 25కుపైగా అంతర్జాతీయ గమ్యస్థానాలకు అనుసంధానం కల్పించిందని తెలిపారు.
బ్లూ ఎకానమీకి ప్రోత్సాహం
దేశంలో బ్లూ ఎకానమీ బలోపేతానికి కేంద్రం ప్రోత్సాహం అందిస్తుందని చెబుతూ విశాఖపట్నం నుంచి కృష్ణపట్నం వరకు తీర ప్రాంతాన్ని కోస్టల్ ఎకనామిక్ కారిడార్‌గా అభివృద్ధి చేస్తున్నామన్నారు. విశాఖపట్నం, కృష్ణపట్నం పోర్టుల ఆధునికీకరణతో పాటు, మూలపేట, రామాయపట్నంలో కొత్త పోర్టులు నిర్మిస్తున్నట్లు వెల్లడించారు. విశాఖపట్నం–రాయ్‌పూర్ ఎక్స్‌ప్రెస్‌వే సహా రాష్ట్రంలో పలు జాతీయ రహదారులు, ఎక్స్‌ప్రెస్‌వేలు నిర్మాణంలో ఉన్నాయని, రైల్వే రంగంలో సుమారు లక్ష కోట్ల విలువైన ప్రాజెక్టులు అమలవుతున్నాయని చెప్పారు. రైల్వే నెట్‌వర్క్ పూర్తిగా విద్యుదీకరణ కావడంతో పాటు, 70కుపైగా స్టేషన్లు ఆధునికీకరణ జరుగుతోందని వివరించారు.
» పీఎం గతిశక్తి జాతీయ మాస్టర్ ప్లాన్ ద్వారా రైలు, పోర్టులు, విమానాశ్రయాల అనుసంధానంతో సమగ్ర లాజిస్టిక్స్ వ్యవస్థ ఏర్పడుతుందని, దీనివల్ల పరిశ్రమలు, రైతులు, వ్యాపార రంగానికి ప్రయోజనం చేకూరుతుందని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ యువతలో అపారమైన ప్రతిభ ఉందని, ముఖ్యంగా సాఫ్ట్‌వేర్ రంగంలో ప్రపంచవ్యాప్తంగా రాణిస్తున్నారని ప్రధాని కొనియాడారు. ఈ ప్రతిభను దేశ అభివృద్ధికి వినియోగించేందుకు సెమీకండక్టర్ పరిశ్రమలపై ప్రత్యేక దృష్టి సారించామని తెలిపారు. విశాఖపట్నంలో సెమీకండక్టర్ ప్లాంట్‌కు శంకుస్థాపన చేయడం ఈ దిశగా కీలక ముందడుగని చెప్పారు.
» సాఫ్ట్‌వేర్ రంగంతో పాటు తయారీ రంగంలోనూ ఆంధ్రప్రదేశ్‌ను అగ్రగామిగా తీర్చిదిద్దాలని లక్ష్యంగా పెట్టుకున్నామని, దీంతో భవిష్యత్ సాంకేతిక ఉద్యోగాలకు కొత్త అవకాశాలు ఏర్పడతాయని అన్నారు.
» కృత్రిమ మేధ (ఏఐ) డేటా సెంటర్ల రంగంలో ఆంధ్రప్రదేశ్‌కు విస్తృత అవకాశాలు ఉన్నాయని, గూగుల్ ప్రకటించిన 15 బిలియన్ డాలర్ల పెట్టుబడి దీనికి నిదర్శనమని ప్రధాని పేర్కొన్నారు. రాష్ట్ర యువతకు భారీ ఉపాధి అవకాశాలు లభిస్తాయని చెప్పారు. నక్కపల్లిలో భారీ ఫార్మా పార్క్ ఏర్పాటుకు కేంద్రం పూర్తి మద్దతు అందిస్తోందని, దీనివల్ల దేశంలో ప్రముఖ ఔషధ తయారీ కేంద్రంగా ఆంధ్రప్రదేశ్ అవతరిస్తుందని తెలిపారు.
» ఈ సందర్భంగా 13 వేల మందికి పైగా గిరిజన మహిళలు, యువతులు ప్రదర్శించిన థింసా నృత్యం ప్రపంచ రికార్డు సృష్టించడం గర్వకారణమని కొనియాడారు. భారత గిరిజన సంస్కృతి, సంప్రదాయాలకు ఇది అద్భుత నిదర్శనమని పేర్కొన్నారు.
ఇక ఉత్తరాంధ్ర వైపు వలసలు : చంద్రబాబు
అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించడం, ఉత్తరాంధ్రలో పలు అభివృద్ధి ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టడం ద్వారా ఈ ప్రాంతంలో రివర్స్ మైగ్రేషన్‌కు నాంది పలికిందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. విమానాశ్రయ ప్రారంభోత్సవ సభలో ఆయన మాట్లాడుతూ ఈ విమానాశ్రయం ఉత్తరాంధ్రను దేశంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందే ప్రాంతాల్లో ఒకటిగా నిలబెడుతుందని చెప్పారు.
గత రెండేళ్లలో ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఉత్తరాంధ్రలో 189 ప్రాజెక్టుల ద్వారా రూ.6.13 లక్షల కోట్ల పెట్టుబడులు ఆకర్షించగలిగామని, వీటి ద్వారా 5.57 లక్షల ఉద్యోగాలు లభించే అవకాశముందని వెల్లడించారు. రూ.2,784 కోట్ల వ్యయంతో ఎనిమిది ప్రాధాన్య సాగునీటి ప్రాజెక్టులను మూడు సంవత్సరాల్లో పూర్తి చేస్తామని చెప్పారు. ఎన్నో ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న నేరడి బ్యారేజ్‌కు అనుమతులు, నిధులు లభించాయని చెప్పారు. ఆగస్టు 14న గోదావరి జలాలు అనకాపల్లికి చేరనున్నాయని, అలాగే వంశధార–గోదావరి నదుల అనుసంధాన ప్రాజెక్టును కూడా చేపడతామని వెల్లడించారు.
పర్యాటకం, ఔషధ పరిశ్రమలు, అరుదైన ఖనిజాలు, జాతీయ రహదారులు, ఆధ్యాత్మిక పర్యాటకం వంటి రంగాల అభివృద్ధితో ఉత్తరాంధ్ర దేశంలో ప్రముఖ ఆర్థిక కేంద్రంగా అవతరిస్తుందని ముఖ్యమంత్రి తెలిపారు. విశాఖ ఉక్కు కర్మాగారం, విశాఖ రైల్వే జోన్, అమరావతి రాజధాని, పోలవరం ప్రాజెక్టు వంటి కీలక కార్యక్రమాలకు కేంద్ర ప్రభుత్వం అందించిన సహకారానికి ప్రధాని నరేంద్ర మోదీకి కృతజ్ఞతలు తెలిపారు. తన 50 ఏళ్ల రాజకీయ జీవితంలో మోదీ వంటి నాయకుడిని చూడలేదని చంద్రబాబు కొనియాడారు. 2027 నాటికి పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసి ప్రధాని చేతుల మీదుగా జాతికి అంకితం చేస్తామని, అలాగే 2028 నాటికి అమరావతి తొలిదశ నిర్మాణాన్ని పూర్తి చేసి ప్రధాని మోదీ చేతుల మీదుగా ప్రారంభిస్తామని ప్రకటించారు.
» విమానాశ్రయ టెర్మినల్‌ను ప్రారంభించిన అనంతరం ప్రధాని నరేంద్ర మోదీ ప్రయాణికుల సౌకర్యాలు, చెక్–ఇన్ హాల్, ఆధునిక సాంకేతిక వ్యవస్థలను పరిశీలించారు. విమానాశ్రయం మాస్టర్ ప్లాన్, భవిష్యత్ ఏవియేషన్ హబ్, ఏరోసిటీ అభివృద్ధి ప్రణాళికలను అధికారులు ప్రధానికి వివరించారు.
థింసా నృత్యంతో స్వాగతం
ఎయిర్‌పోర్టు ప్రారంభోత్సవం సందర్భంగా ఏర్పాటుచేసిన ఉత్తరాంధ్ర సాంస్కృతిక వారసత్వం, ప్రముఖ పుణ్యక్షేత్రాలను ప్రతిబింబించే ప్రదర్శనలను ప్రధాని సందర్శించారు. సంప్రదాయ థింసా నృత్యాలను తిలకించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రధానికి పొందూరు ఖాదీ శాలువాతో సత్కారం చేయగా, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేశ్ కలిసి ఉత్తరాంధ్ర కళా వైభవానికి ప్రతీక అయిన బొబ్బిలి వీణను బహూకరించారు.
ప్రధానిని తిడుతుంటే కన్నీళ్లొచ్చాయి.. పవన్ కల్యాణ్
‘భారతదేశాన్ని ప్రగతి పథంలో నడిపిస్తున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కొందరు ఇష్టానుసారం తూలనాడుతుంటే గుండె కదిలిపోయింది. కన్నీళ్లు వచ్చాయి. బాధ పడ్డాను. దేశం కోసం నిస్వార్థంగా కష్టపడే వారికి ఇవా బహుమతులు అనిపించింది’అని డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్ పేర్కొన్నారు. ఏపీలో రూ.17,900 కోట్ల అభివృద్ధి పనులు మోదీ చేతుల మీదుగా ప్రారంభం కావడం గొప్ప విషయంగా పేర్కొన్నారు. పదవీ బాధ్యతలు తీసుకున్న తర్వాత ఒక్కరోజు కూడా సెలవు తీసుకోకుండా భారతదేశాన్ని ముందుకు నడిపిన వ్యక్తి మోదీ. ఆయన వెనుక మనం ఉండాలన్నారు.
ఏపీకి గ్రోత్ ఇంజన్ ఉత్తరాంధ్ర : లోకేశ్
కొందరు ఎర్రబస్సు రాదు అన్న చోటకి ఎయిర్ పోర్ట్ వచ్చిందని లోకేశ్ పేర్కొన్నారు. ఈ రోజు కేవలం ఒక ఎయిర్ పోర్ట్ ప్రారంభం మాత్రమే కాదు. మన మోదీ వికసిత్ భారత్, మన సీబీఎన్ విజన్ కలిసిన రోజు. ఉత్తరాంధ్ర భవిష్యత్తు మారే రోజు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి దూసుకెళ్లే రోజు అని అన్నారు.
అభివృద్ధికిది సింహద్వారం.. రామ్మోహన్‌నాయుడు
ఒకప్పుడు అవకాశాల కోసం ప్రపంచం వైపు ఉత్తరాంధ్ర చూసేదని.. ఇప్పుడు ప్రపంచం మనవైపు చూసేలా భోగాపురం విమానాశ్రయం చేసిందని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు అన్నారు. ఉత్తరాంధ్ర అభివృద్ధికి సింహద్వారం భోగాపురం అని పేర్కొన్నారు. ప్రధాని మోదీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి అత్యంత ప్రాధాన్యమిస్తోందని కేంద్ర భారీ పరిశ్రమలు, ఉక్కుశాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ అన్నారు.
పలు అభివృద్ధి పనులు ప్రారంభించిన ప్రధాని
» ఎయిర్‌పోర్టు ప్రారంభంతో పాటు ప్రధాని మోదీ రాష్ట్రంలోని పలు రోడ్లు, పారిశ్రామిక సంస్థలను రిమోట్‌తో ప్రారంభించారు.
» విశాఖపట్నం తర్లువాడలో ఏఎస్‌ఐపీ టెక్నాలజీస్ సెమీకండక్టర్ ప్యాకేజింగ్–టెస్టింగ్ యూనిట్‌కు శంకుస్థాపన చేశారు.
» కర్నూలులోని విండ్, సోలార్ ఎనర్జీ జోన్ ట్రాన్స్‌మిషన్ వ్యవస్థను ప్రారంభించారు.
» అనంతపురంలో 2500 మెగావాట్లు, కర్నూలులో 1000 మెగావాట్లు సోలార్ ఎనర్జీ జోన్ ట్రాన్స్‌మిషన్ పథకాలు ప్రారంభం
» కర్నూలు–ఐవీరెన్యూవబుల్ ఎనర్జీ జోన్ ట్రాన్స్‌మిషన్ ప్రాజెక్టు, పెంచలకొన–యరపాడు మధ్యనున్న బ్రిడ్జికి శంకుస్థాపన.
» ఖమ్మం–దేవరపల్లి గ్రీన్ ఫీల్డ్ నాలుగు లైన్ల ఎక్స్‌ప్రెస్‌వే, ఖమ్మం–దేవరపల్లి ప్యాకేజీ, తాడిపత్రి నాలుగు లైన్ల బైపాస్ రోడ్లు ప్రారంభించారు.


