సాక్షి, విజయవాడ: భద్రాచలం వద్ద గోదావరి స్వల్పంగా తగ్గుముఖం పట్టిందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. ధవళేశ్వరం బ్యారేజి వద్ద రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. దాదాపు 15 లక్షల క్యూసెక్కులకు చేరే అవకాశం ఉంది. రేపు రాత్రి నుంచి ధవళేశ్వరం వద్ద వరద క్రమంగా తగ్గే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ పేర్కొంది. ప్రస్తుతం భద్రాచలం వద్ద 54.3 అడుగుల నీటి మట్టం ఉంది.
కూనవరం 21.40 మీటర్లు, పోలవరం 13.19 మీటర్ల కాగా, ధవళేశ్వరం బ్యారేజి ఇన్ ఫ్లో, ఔట్ ఫ్లో 13.16 లక్షల క్యూసెక్కుల ప్రవాహం వస్తోంది. పొంగిపొర్లుతున్న వాగులు, కాజ్‌వేలు దాటే ప్రయత్నం చేయవద్దని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ హెచ్చరించారు.
నంద్యాల జిల్లా: శ్రీశైలం జలాశయానికి వరద నీరు కొనసాగుతోంది. జూరాల నుండి 1,80,000 క్యూసెక్కుల నీరు శ్రీశైలం జలాశయానికి వస్తోంది. ఇన్ ఫ్లో 1,80,000 క్యూసెక్కులు, ఔట్ ఫ్లో.. నిల్. పూర్తి స్దాయి నీటిమట్టం 885 అడుగులు కాగా, ప్రస్తుతం 842.30 అడుగులుగా కొనసాగుతోంది. పూర్తిస్థాయి నీటి నిల్వ 215.8070 టీఎంసీలు. ప్రస్తుతం 65.3203 టీఎంసీలు. కుడి, ఎడమ జల విద్యుత్ కేంద్రాలలో విద్యుత్ ఉత్పత్తి ప్రారంభం కాలేదు.


