సాక్షి, తాడేపల్లి: భోగాపురం ఎయిర్ పోర్టు ప్రారంభోత్సవంపై వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆసక్తికర పోస్ట్ చేశారు. ‘‘భోగాపురం నుంచి 2026లో విమానాలు ఎగురుతాయి. ఈ విషయం 2023లో నేను శంకుస్థాపన చేసిన రోజే చెప్పాను’’ అంటూ పోస్టు చేశారు. అప్పటి వీడియోను కూడా ఎఫ్బీలో వైఎస్ జగన్ పోస్ట్ చేశారు.
కాగా, శంకుస్థాపన రోజే ప్రారంభ సమయాన్ని కూడా ప్రకటిస్తూ రూపుదిద్దుకున్న భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు నేడు ప్రధాని మోదీ చేతుల మీదుగా సాకారమైంది. వెనుకబడిన ప్రాంతం ఆర్థిక ముఖ చిత్రాన్ని మార్చే కలల విమానాశ్రయానికి అన్ని అనుమతులు సాధించి, న్యాయ వివాదాలను పరిష్కరించి టెంకాయ కొట్టిన రోజే ప్రారంభమయ్యే సమయాన్ని కూడా కచ్చితంగా ప్రకటించడం మాజీ సీఎం వైఎస్ జగన్ దూరదృష్టి, నిబద్ధతకు నిదర్శనంగా నిలుస్తోంది.
2023 మే 3న భోగాపురం ఎయిర్‌పోర్టుకు శంకుస్థాపన చేసిన మాజీ సీఎం వైఎస్ జగన్ 2026 ఏడాది మధ్యలో విమానాశ్రయాన్ని అందుబాటులోకి తెస్తామని ముందే ప్రకటించారు. అదే ప్రకారం భోగాపురం ఎయిర్‌పోర్టు శనివారం ప్రధాని మోదీ చేతుల మీదుగా ప్రారంభమవుతుండటం గమనార్హం. పలు కోర్టు వివాదాలు, భూ సేకరణ చిక్కుముడులు, పునరావాసం కల్పన, కేంద్రం నుంచి కీలక అనుమతులు రాబట్టడం..

..ఇలా వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో అన్నీ సాధించడంతోపాటు పనులు కూడా ప్రారంభించడంతో ముందుగా అనుకున్న సమయానికల్లా అంతర్జాతీయ విమానాశ్రయం అందుబాటులోకి వచ్చింది. దీంతో రాత్రి పూట అంతర్జాతీయ సర్వీసులు నడపడానికి అడ్డంకులు తొలగిపోయి వివిధ దేశాలకు నేరుగా కనెక్టివిటీతో ఉత్తరాంధ్ర శరవేగంగా అభివృద్ధి చెందే అవకాశం లభించింది.


