ఆవేళ​ ఆమె నడక నేర్పితే..ఈ రోజు ఆకాశంలోకి..! | Pilot Flies Mother For The First Time Goes Viral | Sakshi
Sakshi News home page

ఆవేళ​ ఆమె నడక నేర్పితే..ఈ రోజు ఆకాశంలోకి..! వైరల్‌గా కుమారుడి భావోద్వేగ వీడియో

Aug 1 2026 2:15 PM | Updated on Aug 1 2026 3:02 PM

Pilot Flies Mother For The First Time Goes Viral

తల్లినే విమానంలో ప్రయాణికురాలిగా తీసుకువెళ్లితే ఆ పైలట్‌కి కలిగే ఆనందం మాటలకందనిది. ఆ సంతోషాన్ని సోషల్‌ మీడియా వేదికగా షేర్‌ చేసుకోవడంతో నెట్టింట వైరల్‌గా మారింది. పైలట్‌ తనిష్‌ అరోరా ఈ వీడియోని పోస్ట్‌ చేశారు. కొడుకు కాక్‌పిట్‌లో కూర్చొని ఉండగా తల్లి విమానం ఎక్కుతున్న భావోద్వేగ కణాన్ని రికార్డు చేశారు. ఆ రోజుని తన కెరీర్‌లోని అత్యంత స్పెషల్‌డేగా పేర్కొన్నాడు. విమానాశ్రయానికి బయలుదేరే ముందు, అతను తన తల్లిని ఈ ప్రయాణం గురించి ఎలా అనిపిస్తుందని అడగడం వీడియోలో స్పష్టంగా కనిపిస్తుంది. 

అందుకు ఆమె తన కొడుకు నడుపుతున్న విమానంలో మొదటిసారిగా ప్రయాణిస్తున్నందుకు చాలా ఎగ్జైటింగ్‌ ఉందని నవ్వుతూ చెబుతుంది. విమానాశ్రయానికి చేరుకుని, ఆమె చెక్-ఇన్ పూర్తి చేసిన తర్వాత, అరోరా విమానంలో తన తల్లిని మళ్లీ కలిశాడు. టేకాఫ్‌కు ముందు, తనకు ఏమైనా సలహాలు ఉన్నాయా? అని ప్రశ్నించగా..సురక్షితంగా నడపమని చెబుతుండటం స్పష్టంగా వీడియోలో కనిపిస్తుంది. కానీ అరోరా చిన్నప్పుడు నడక నేర్పిన అమ్మను ఇవాళ ఆకాశంలోకి స్వయంగా తీసుకువెళ్లడం తనకు లభించిన గొప్ప అవకాశంగా పేర్కొన్నాడు. 

ఫ్లైట్‌ జర్నీ తర్వాత ఎలా అనిపించింది అని మళ్లీ అమ్మని అడగగా, నా కొడుకు నడిపే విమానంలో ప్రయాణించడం చాలా గర్వంగా ఉందని బదులిస్తుందామె. చివరగా తన కెరీర్‌లో వేలాది మంది ప్రయాణికులను విమానంలో తీసుకువెళ్లినప్పటికీ, తన తల్లి ఎప్పటికీ తనకిష్టమైన ప్రయాణికురాలిగానే ఉంటుందంటూ తన వీడియో సంభాషణను ముగించాడు. 

ఈ వీడియోకి క్యాప్షన్‌ కూడా ఆమె మొదటి అడుగులు ఎలా వేయాలో నేర్పితే..ఈరోజు ఆమెను ఆకాశంలోకి తీసుకువెళ్లే అవకాశం నాకు లభించింది. ఎప్పటికీ ఆమె నాకిష్టమైన ప్రయాణికురాలు అనే క్యాప్షన్‌ జోడించి మరీ పోస్ట్‌ చేశాడు. ఈ భావోద్వేగభరితమైన వీడియో నెటిజన్లను అమితంగా ఆకర్షించింది. 

 

(చదవండి: అందాల పోటీల్లో తళుక్కుమన్న స్వగతికా పాణిగ్రాహి)
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement