భారతీయ సినీ నృత్యానికి కొత్త శైలిని పరిచయం చేసిన కొరియోగ్రాఫర్, నటుడు ప్రభుదేవా. ముఖ్యంగా 1990, 2000 దశకాల్లో తన వినూత్నమైన కొరియోగ్రఫీతో ఆయన ఓ కొత్త ట్రెండ్‌ను తీసుకొచ్చారు. తన ప్రత్యేకమైన స్టైల్, అద్భుతమైన డ్యాన్స్ మూవ్స్‌తో దశాబ్దాలుగా ప్రేక్షకులను అలరిస్తున్న ఆయన.. తాజాగా ఓ నృత్య ప్రదర్శనతో వివాదంలో చిక్కుకున్నారు.
చెన్నైలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన చేసిన నాట్యప్రదర్శనపై ప్రముఖ నటి, డ్యాన్సర్ ప్రీతి సంజీవ్ అభ్యంతరం వ్యక్తం చేయడంతో సోషల్ మీడియాలో చర్చ మొదలైంది. ప్రభుదేవా లాంటి ప్రముఖ డ్యాన్సర్ నుంచి ఇలాంటి తప్పును ఊహించలేదు అంటూ ఆమె చేసిన కామెంట్లు.. ఆయన అభిమానులను ఒకింత షాక్‌కు గురి చేశాయి. అసలేం జరిగిందంటే..
பிரபு தேவா பரதநாட்டியம் ஆடி இப்போ தான் பாக்குறேன் 🧐 pic.twitter.com/ke3sAkXEzO
— ⚡𝘼𝘽𝙎𝙊𝙇𝙐𝙏𝙀𝙇𝙔 ©️𝙄𝙉𝙀𝙈𝘼 (@Absolutlycinema) July 30, 2026
గురు శ్రీ ఉడిపి లక్ష్మీనారాయణ 100వ జయంతి సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో ప్రభుదేవా భరతనాట్యం ప్రదర్శించారు. తన గురువుకు నివాళిగా ఆయన ప్రకటించగా.. పలువురు దానిని ప్రశంసించారు. అయితే.. ప్రీతి సంజీవ్ మాత్రం ఇలాంటి తప్పు ఊహించలేదు అంటూ అభ్యంతరం వ్యక్తం చేశారు.
ప్రభుదేవా ప్రదర్శనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నటి, డ్యాన్సర్ ప్రీతి సంజీవ్ స్పందించారు. శాస్త్రీయ నృత్యమైన భరతనాట్యాన్ని సరైన పద్ధతిలో ప్రదర్శించడం చాలా ముఖ్యమని ఆమె పేర్కొన్నారు. “క్లాసికల్ డ్యాన్స్‌ను చాలాసార్లు తప్పుగా ప్రదర్శించినా ప్రజలు ప్రశ్నించకుండా ప్రశంసిస్తుంటారు. ప్రభుదేవా లాంటి ప్రముఖ డ్యాన్సర్ నుంచి ఇలాంటి తప్పును ఊహించలేదు” అంటూ ఆమె వ్యాఖ్యానించారు.

అంతేకాకుండా.. ఇలాంటి అవకాశాలను భరతనాట్యంలో ఎన్నో ఏళ్లుగా శిక్షణ పొందుతున్న యువ కళాకారులకు ఇస్తే మరింత ప్రోత్సాహంగా ఉండేదని అభిప్రాయపడ్డారు. ప్రీతి వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో డ్యాన్స్ వర్గాల్లో చర్చ మొదలైంది. ప్రభుదేవాకు మద్దతుగా పలువురు వచ్చారు. ఇది పోటీ కోసం చేసిన భరతనాట్య ప్రదర్శన కాదని.. తన గురువుకు అంకితంగా చేసిన నివాళి మాత్రమేనని పేర్కొన్నారు.
ప్రభుదేవా భారతీయ నృత్య రంగానికి చేసిన సేవలను గుర్తు చేస్తూ.. ఆయన ఉద్దేశాన్ని తప్పుగా అర్థం చేసుకోవద్దని అభిమానులు చెబుతున్నారు. ఒక కళాకారుడి ప్రదర్శనను కేవలం సాంకేతిక అంశాల కోణంలో కాకుండా భావం, సందర్భం ఆధారంగా కూడా చూడాలని అభిప్రాయపడుతున్నారు. అదే సమయంలో ఆమె అడిగిన దాంట్లో తప్పేం లేదని కొందరు అన్నారు.
శాస్త్రీయ నృత్యాలను ఎంతవరకు సంప్రదాయ పద్ధతుల్లోనే ప్రదర్శించాలి? కళాకారులకు ప్రయోగాల స్వేచ్ఛ ఎంత ఉండాలి? అనే అంశాలపై సోషల్ మీడియాలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
కొరియోగ్రాఫర్‌గా మాత్రమే కాకుండా నటుడిగా, దర్శకుడిగా కూడా ప్రభుదేవా గుర్తింపు తెచ్చుకున్నారు. తమిళం, తెలుగు, హిందీ చిత్ర పరిశ్రమల్లో ఆయన ఎన్నో విజయాలు సాధించారు. ఆయన స్పీడ్ స్టెప్పులు, ప్రత్యేకమైన బాడీ లాంగ్వేజ్, స్టెప్పులు ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో అభిమానులు ఆయనను ‘ఇండియన్ మైకేల్ జాక్సన్’గా పిలవడం ప్రారంభించారు.


