కొచ్చి: కేరళలోని కొచ్చికి చెందిన 80 ఏళ్ల ఎంబీ ప్రకాశన్ తన తండ్రి జ్ఞాపకంగా మిగిలిన 1957 మోడల్ రాలే హంబర్ సైకిల్ చోరీకి గురికావడంతో తీవ్ర వేదనకు గురయ్యారు. కలమస్సేరికి చెందిన ప్రకాశన్‌కు ఈ సైకిల్‌తో విడదీయరాని అనుబంధం ఉంది. సుమారు 70 ఏళ్ల క్రితం కలకత్తా లాటరీలో వచ్చిన బహుమతి మొత్తంతో ఆయన తండ్రి ఎంఆర్ బాలకృష్ణన్ ఎర్నాకులంలో ఈ సైకిల్‌ను కొనుగోలు చేశారు. 2003లో తండ్రి మరణించారు. ఆ సైకిల్‌ను ప్రకాశన్ ఎంతో భద్రంగా కాపాడుకుంటూ వస్తున్నారు.
జూలై 22న ఎడపప్పల్లి టోల్ జంక్షన్ సమీపంలో ఇన్సూరెన్స్ పత్రాలు జారీ చేసే సమయంలో కీని సైకిల్‌కే వదిలివేయడంతో గుర్తుతెలియని వ్యక్తులు సైకిల్‌ను అపహరించారు. తండ్రి 23వ వర్ధంతికి సరిగ్గా ఒక్క రోజు ముందు ఈ ఘటన జరగడంతో ప్రకాశన్ తీవ్రంగా కుంగిపోయారు. ‘ఇది నాకు కేవలం ఒక సైకిల్ కాదు, నా తండ్రి జ్ఞాపకం. దానిని పోగొట్టకుని నేను నా తండ్రిని రెండోసారి కోల్పోయాను’ అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ ఘటనపై కలమస్సేరి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు నమోదు చేయగా, పోలీసులు సీసీటీవీ ఫుటేజీని పరిశీలిస్తున్నారు. ఈ ఉదంతం స్థానికంగా చర్చనీయాంశమైంది. ఈ ఘటన తెలిసిన ప్రముఖ వ్యాపారవేత్త బాబీ చెమ్మనూర్ ఈ సైకిల్‌ను సురక్షితంగా తిరిగి తెచ్చిచ్చిన వారికి ఐదు లక్షల రూపాయల నజరానా ప్రకటించడంతో పాటు, దొంగిలించిన వ్యక్తికి ఉపాధి కల్పిస్తామని ప్రకటించారు. కాగా పాఠశాల విద్యార్థులు, స్థానికులు కూడా ఈ సైకిల్ ఆచూకీ కోసం స్వచ్ఛందంగా గాలిస్తుండటం విశేషం. సైకిల్‌ను తిరిగి ఇచ్చేస్తే తాను ఎలాంటి పోలీసు కేసులు పెట్టబోనని, ఫిర్యాదును ఉపసంహరించుకుంటానని ప్రకాశన్ తెలిపారు.
ఇది కూడా చదవండి: జంక్ ఫుడ్ మాన్పించేందుకు డాడీ ‘అల్ట్రాసౌండ్’ ఐడియా!


