ఫ్యామిలీ స్టార్స్‌ | National Parents Day: Upcoming movie Updates on father sentiment in tollywood | Sakshi
Sakshi News home page

ఫ్యామిలీ స్టార్స్‌

Jul 26 2026 1:33 AM | Updated on Jul 26 2026 1:33 AM

National Parents Day: Upcoming movie Updates on father sentiment in tollywood

సూపర్‌ పవర్స్‌ లేని సూపర్‌ హీరో నాన్న. అయినా కుటుంబం కోసం సూపర్‌ కష్టాలను తట్టుకుని మరీ కుటుంబ సంక్షేమం కోసం తపన పడతాడు... ఒక్కోసారి తన ఇష్టాలను కూడా త్యాగం చేస్తాడు. బాధ్యతలనే ఇష్టంగా చేసుకుంటాడు. కుమారుడు, కుమార్తెల సంతోషమే తన ఆస్తిగా ఫీలవుతాడు. అందుకే ప్రతి కుటుంబానికి నాన్నే ఫ్యామిలీ స్టార్‌. ఇలా తండ్రి ఎమోషన్‌ గురించి ఎంత చెప్పినా తక్కువే. అందుకే... ఫాదర్‌ ఎమోషన్‌ నేపథ్యంలో వచ్చిన చాలా సినిమాలు బ్లాక్‌బస్టర్స్‌గా నిలిచాయి. ప్రస్తుతం ఈ జానర్‌లో మరికొన్ని సినిమాలు ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. నేడు (ఆదివారం) నేషనల్‌ పేరెంట్స్‌ డే. ఈ సందర్భంగా తండ్రి ఎమోషన్‌తో రానున్న కొన్ని సినిమాలపై ఓ లుక్‌ వేయండి.

గ్యాంగ్‌స్టర్‌ నాన్న 
కూతురు సంరక్షణ కోసం ఎంతకైనా తెగించే ఓ తండ్రి కథ వచ్చే సంక్రాంతికి థియేటర్స్‌లోకి వచ్చే అవకాశం ఉంది. ‘వాల్తేరు వీరయ్య’ వంటి హిట్‌ ఫిల్మ్‌ తర్వాత హీరో చిరంజీవి, దర్శకుడు బాబీ కాంబినేషన్‌లో రూపొందుతున్న సినిమా ‘మెగా 158’ (వర్కింగ్‌ టైటిల్‌). ఈ సినిమా ప్రధాన కథాంశం తండ్రీ కూతుళ్ల ఎమోషనే అని తెలిసింది. ఈ చిత్రంలో చిరంజీవి క్యారెక్టరైజేషన్‌లో డిఫరెంట్‌ షేడ్స్‌ ఉంటాయట.

కొన్ని సీన్స్‌లో చిరంజీవి గ్యాంగ్‌స్టర్‌గా కనిపిస్తారని సమాచారం. అలాగే ఈ సినిమాలోని కొంత భాగం గోదావరి నేపథ్యంలో, మరికొంత భాగం కోల్‌కతా నేపథ్యంలో సాగుతుందని తెలిసింది. అలాగే ఈ చిత్రంలో తండ్రీ కూతుళ్ల పాత్రలో చిరంజీవి, మలయాళ నటి అనశ్వర రాజన్‌ నటిస్తున్నారని టాక్‌. నివేతా పేతురాజ్‌ మరో కీ రోల్‌ చేస్తున్నారు. చిరంజీవి భార్యగా నివేతా పేతురాజ్‌ కనిపిస్తారట. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్‌ శరవేగంగా జరుగుతోంది. వచ్చే సంక్రాంతి పండగకు రిలీజ్‌ చేయాలనే టార్గెట్‌తో చిత్రయూనిట్‌ షూటింగ్‌ చేస్తోందని తెలిసింది. కేవీఎన్‌ ప్రోడక్షన్స్‌ పతాకంపై వెంకట్‌ కె.         నారాయణ ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

ఇటు క్లాస్‌... అటు మాస్‌ 
సమాజంలో వారిది ‘ఆదర్శ కుటుంబం’. కానీ తన ఫ్యామిలీ జోలికి వస్తే మాత్రం, ఈ కుటుంబం పెద్ద అయిన తండ్రి గన్‌ పడతాడు? తన కుటుంబ సభ్యుల చేత ఫైట్‌ చేయిస్తాడు. ఈ మాస్‌ ఫాదర్‌ డీటైల్స్‌ ఏంటో తెలుసుకోవాలంటే అక్టోబరు 2 వరకు ఆగాల్సిందే. వెంకటేశ్, శ్రీనిధి శెట్టి హీరో హీరోయిన్లుగా నటిస్తున్న సినిమా ‘ఆదర్శ కుటుంబం హౌస్‌ నెంబరు 47’ (ఏకే 47). ఈ చిత్రంలో నారా రోహిత్‌ కీలక పాత్రలో నటిస్తున్నారు. త్రివిక్రమ్‌ దర్శకత్వం వహిస్తున్న సినిమా ఇది. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ శరవేగంగా జరుగుతోంది. ఈ చిత్రంలో ఫాదర్‌ రోల్‌ చేస్తున్నారు వెంకటేశ్‌. 

అలాగే వెంకటేశ్‌ క్యారెక్టరైజేషన్‌లో డిఫరెంట్‌ షేడ్స్‌ ఉంటాయి. క్లాస్‌గా ఉంటూనే తన కుటుంబం ఆపదలో ఉందంటే మాత్రం ఫైర్‌ అయి పోయే మాస్‌ ఫాదర్‌ రోల్‌ చేస్తున్నారట వెంకటేశ్‌. హారిక అండ్‌ హాసిని క్రియేషన్స్‌ పతాకంపై సూర్యదేవర రాధాకృష్ణ నిర్మిస్తున్న ఈ సినిమా అక్టోబరు 2న విడుదల కానుంది. మరోవైపు వెంకటేశ్‌ హీరోగా నటించిన హిట్‌ ఫిల్మ్స్‌ ‘నువ్వు నాకు నచ్చావ్, మల్లీశ్వరి’ చిత్రాలకు దర్శకుడు త్రివిక్రమ్‌ డైలాగ్స్‌ అందించారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు త్రివిక్రమ్‌ దర్శకత్వంలో వెంకటేశ్‌ హీరోగా రానున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో అంచనాలు ఉండటం సహజం.

కూతురు కోసం... 
రవితేజ హీరోగా నటించిన తాజా సినిమా ‘ఇరుముడి’. ఈ సినిమాలో రవితేజ తండ్రి పాత్రలో నటించగా, ఆయన కుమార్తెగా బేబీ నక్షత్ర నటించారు. రవితేజ భార్యగా ప్రియా భవానీ శంకర్‌ నటించినట్లు తెలుస్తోంది. కాగా, ఈ సినిమా ప్రధాన కథాంశం తండ్రీ కూతుళ్ల ఎమోషన్‌ నేపథ్యంలో సాగుతుందని ఇటీవల విడుదలైన ఈ సినిమా టీజర్‌ స్పష్టం చేస్తోంది. 

ఏదో మానసిక బాధలో ఉన్న తండ్రిని మందు మానేయమని కూతురు రిక్వెస్ట్‌ చేయడం, కుమార్తె కోసం ఆ తండ్రి తనను తాను మార్చుకోవాలనుకోవడం, ఆ కుమార్తె రక్షణ కోసం తన ప్రాణాలనైనా లెక్క చేయని తండ్రి సాహసం... వంటి అంశాల నేపథ్యంలో ఈ ‘ఇరుముడి’ సినిమా కథనం సాగుతుందని టాక్‌. ఈ చిత్రంలో రవితేజ అయ్యప్ప స్వామి     భక్తుడిగా కనిపిస్తారు. మైత్రీ మూవీ మేకర్స్‌ పతాకంపై నవీన్‌ ఎర్నేని, వై. రవిశంకర్‌ నిర్మిస్తున్న ఈ సినిమా ఆగస్టు 21న విడుదల కానుంది.  

తండ్రి ఆదేశం 
తన తండ్రి లక్ష్యం కోసం రుద్ర ఓ సాహసోపేతమైన ప్రయాణం మొదలుపెట్టాడు. కాలానికి అతీతంగా ఖండాల మధ్య ప్రయాణం చేస్తున్నాడు. మరి... రుద్రకు అతని తండ్రి అప్పగించిన మిషన్‌ ఏంటి? తండ్రి కోసం రుద్ర ఏం చేశాడు? అన్న అంశాల నేపథ్యంలోనే ‘వారణాసి’ సినిమా కథనం రూపొందుతోందనే ప్రచారం ఫిల్మ్‌నగర్‌ సర్కిల్స్‌లో వినిపిస్తోంది. మహేశ్‌బాబు హీరోగా రాజమౌళి దర్శకత్వంలో అంతర్జాతీయ స్థాయిలో రూపొందుతున్న సినిమా ‘వారణాసి’. 

ఈ చిత్రంలో రుద్ర, శ్రీరాముడు... ఇలా రెండు విభిన్నమైన పాత్రల్లో నటిస్తున్నారు మహేశ్‌బాబు. మందాకినిగా ప్రియాంక చో్ర పా, కుంభగా పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ నటిస్తున్నారు. మరో కీలక పాత్రలో ప్రకాశ్‌రాజ్‌ నటిస్తున్నారు. ఈ సినిమాలో సైన్స్‌ ఫిక్షన్, మైథలాజికల్, అడ్వెంచరస్‌ అంశాలు ఉన్నప్పటికీ ‘వారణాసి’ ప్రధాన కథాంశం తండ్రీ కొడుకుల అనుబంధమే అని ఇటీవల  పారిస్‌లో జరిగిన కార్యక్రమంలో స్పష్టం చేశారు రాజమౌళి. 

దీంతో ‘వారణాసి’ సినిమా కథపై విభిన్న ప్రచారాలు తెరపైకి వచ్చాయి. పైన పేర్కొన్న కథాంశం కూడా ఫిల్మ్‌నగర్‌ సర్కిల్స్‌లో వినిపిస్తోంది. అంతేకాదు...ఈ చిత్రంలో మహేశ్‌బాబు తండ్రిగా ప్రకాశ్‌రాజ్‌ కనిపిస్తారని భోగట్టా. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ హైదరాబాద్‌లో జరుగుతోంది. మహేశ్‌బాబు పాల్గొంటుండగా  కీలకమైన యాక్షన్‌ సన్నివేశాల చిత్రీకరణ జరుగుతోందని సమాచారం. కేఎల్‌ నారాయణ, ఎస్‌ఎస్‌ కార్తికేయ నిర్మిస్తున్న ‘వారణాసి’ సినిమా ఏప్రిల్‌ 7న రిలీజ్‌ కానుంది.

ఓ తండ్రి... ఇద్దరు కొడుకులు 
ఓ తండ్రి తన ఇద్దరు కొడుకుల కోసం ఎలాంటి త్యాగం చేశాడు? ఈ ఇద్దరు కొడుకులకు, తండ్రికి మధ్య దూరం ఎందుకు ఏర్పడింది? అనే అంశాల ఆధారంగా ‘రాకా’ సినిమా తెరకెక్కుతోందట. అల్లు అర్జున్‌ హీరోగా అట్లీ దర్శకత్వంలో రూపొందుతున్న ఫ్యాంటసీ యాక్షన్‌ డ్రామా     ‘రాకా’. ఈ చిత్రంలో అల్లు అర్జున్‌ త్రి పాత్రాభినయం చేస్తున్నారనే ప్రచారం సాగుతోంది. తండ్రి, ఇద్దరు కొడుకులు... ఇలా మూడు పాత్రల్లోనూ అల్లు అర్జున్‌ కనిపిస్తారని ఫిల్మ్‌నగర్‌ భోగట్టా. 

ఈ తండ్రీ కొడుకుల మధ్య వచ్చే యాక్షన్‌ సన్నివేశాలతో పాటు కొన్ని ఎమోషనల్‌ సీన్స్‌ కూడా ఈ సినిమాలో హైలైట్‌గా ఉంటాయని సమాచారం. అంతే కాదండోయ్‌..‘రాకా’ సినిమాలో అల్లు అర్జున్‌ చేస్తున్న మూడు డిఫరెంట్‌ క్యారెక్టర్స్‌లో ఒక క్యారెక్టర్‌ విలన్‌ అని టాక్‌. ముంబైలో ప్రత్యేకంగా వేసిన సెట్స్‌లో ‘రాకా’ సినిమా చిత్రీకరణ జరుగుతోంది. మేజర్‌గా ఈ సెట్స్‌లోనే ఈ సినిమాను షూట్‌ చేస్తున్నారు అట్లీ అండ్‌ టీమ్‌. కాగా, ప్రస్తుతం ఫ్యామిలీతో కలిసి వెకేషన్‌లో భాగంగా ఆస్ట్రియాలో ఉన్నారు అల్లు అర్జున్‌. ఈ వెకేషన్‌ పూర్తి కాగానే, ముంబై చేరుకుని ‘రాకా’ చిత్రీకరణలో పాల్గొంటారు. 

ఈ సినిమా చిత్రీకరణను ఈ ఏడాదే పూర్తి చేయాలనుకుంటున్నారు. కానీ రిలీజ్‌ మాత్రం వచ్చే ఏడాది ఉంటుందట. ఎందుకంటే... ఈ చిత్రం కోసం ఓ ప్రత్యేకమైన ప్రపంచాన్నే సృష్టించారు దర్శకుడు అట్లీ. అందుకోసం చాలా వీఎఫ్‌ఎక్స్‌ పనులు చేయాల్సి ఉంది. ఈ కారణంగానే ‘రాకా’ సినిమా విడుదల వచ్చే ఏడాది ఉంటుంది. నటీమణులు దీపికా పదుకోన్, ఫెమినా జార్జ్, పంజాబీ నటి నైలా గ్రేవాల్‌ ఈ సినిమాలోని ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇంకా జాన్వీ కపూర్, రష్మిక మందన్నా, మృణాల్‌ ఠాకూర్‌ సైతం ఈ సినిమాలో భాగమయ్యారని బాలీవుడ్‌ సమాచారం. సన్‌ పిక్చర్స్‌ పతాకంపై కళానిధి మారన్‌ భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

తండ్రి హీరో... కొడుకు విలన్‌? 
ఏ తండ్రికైనా తన కొడుకే హీరో. కానీ ఓ తండ్రి పాలిట ఓ కొడుకు విలన్‌ అయ్యాడు. మరి... ఈ తండ్రీ కొడుకుల కహానీ ఏంటి? కొడుకు తనపై పెంచుకున్న ద్వేషాన్ని ప్రేమగా మార్చేందుకు ఓ తండ్రి ఎలాంటి సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకున్నాడు? అన్న అంశాలతో ‘టాక్సిక్‌’ సినిమా రూపొందుతోందని సమాచారం. యశ్‌ ద్వి పాత్రాభినయం చేసిన ద్విభాషా (కన్నడ, ఇంగ్లిష్‌) చిత్రం ‘టాక్సిక్‌: ఏ ఫెయిరీ టెల్‌ ఫర్‌ గ్రోన్‌ అండ్‌ అప్స్‌’. గోవా నేపథ్యంలో సాగే ఈ పీరియాడికల్‌ యాక్షన్‌ డ్రామాలో రాయ, టాక్సిక్‌ అనే రెండు విభిన్నమైన పాత్రల్లో నటించారు యశ్‌.

‘టాక్సిక్‌’ కథనం తండ్రీ కొడుకుల ప్రతీకారం, అనుబంధం నేపథ్యంలో సాగుతుందని, 1940–1970 నేపథ్యంలో ఈ సినిమా కథనం సాగుతుందని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో యశ్‌ పేర్కొన్నారు. ఈ సినిమా ప్రధానాంశం తండ్రిపై కొడుకు ప్రతీకారమే అయినా, క్లైమాక్స్‌లో వీరిద్దరూ కలిసి మెయిన్‌ విలన్‌ను ఓ ఆటాడిస్తారట. మరి... ఈ సినిమా కథనం ఇలానే సాగుతుందా? అనే విషయంపై క్లారిటీ రావాలంటే మాత్రం ఆగస్టు 26 వరకు ఎదురు చూడాల్సిందే. ఎందుకంటే... ఈ సినిమా ఆ రోజే విడుదల కానుంది. ఈ సినిమా ట్రైలర్‌ను ఆగస్టు 8న రిలీజ్‌ చేసేందుకు మేకర్స్‌ సన్నాహాలు చేస్తున్నారనే ప్రచారం సాగుతోంది.

ఇక ఈ చిత్రంలో గంగ పాత్రలో నయనతార, నాడియాగా కియారా అద్వానీ, రెబెక్కా రోల్‌లో తారా సుతారియా, మెలిస్సాగా రుక్మిణి  వసంత్‌ నటించారు. ఈ చిత్ర దర్శకురాలు గీతూ మోహన్‌దాస్‌తో కలిసి ఈ సినిమాకు కథ అందించారు యశ్‌. కేవీఎన్‌ ప్రోడక్షన్స్, మాన్‌స్టర్‌ మైండ్‌ క్రియేషన్స్‌ పతాకాలపై వెంకట్‌ కె. నారాయణ, యశ్‌ ఈ సినిమాను నిర్మించారు. 

సంజయ్‌ విశ్వనాథ్‌ 
సూర్య హీరోగా నటించిన తాజా సినిమా ‘విశ్వనాథ్‌ అండ్‌ సన్స్‌’. టైటిల్‌లోనే ‘విశ్వనాథ్‌ అండ్‌ సన్స్‌’ ఉండటం, ఈ చిత్రంలో సంజయ్‌ విశ్వనాథ్‌ పాత్రలో సూర్య నటించారు. అలాగే ఈ సినిమా నుంచి విడుదలైన ఫస్ట్‌ లుక్స్‌ కూడా ఈ చిత్రంలో సూర్య చేసినది ఫాదర్‌ రోల్‌ అని స్పష్టం చేస్తున్నాయి. మరి... సంజయ్‌ విశ్వనాథ్‌గా తండ్రి పాత్రలో సూర్య ఎలా నటించారు? ఈ పాత్ర చుట్టూ అల్లుకున్న ఎమోషనల్‌ బాండింగ్స్‌ ఏంటి? అన్న అంశాలు తెలియాలంటే ఆగస్టు 15 వరకు ఎదురు చూడాల్సిందే. ఎందుకంటే... ఈ సినిమా ఆ రోజే విడుదల కానుంది. వెంకీ అట్లూరి దర్శకత్వంలో సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించారు. ఈ చిత్రంలో రాధికా శరత్‌ కుమార్, రవీనా టాండన్‌ కీలక పాత్రల్లో నటించగా, హీరోయిన్‌గా మమితా బైజు నటించారు. తాజాగా ఈ సినిమా నుంచి వెడ్డింగ్‌ సాంగ్‌ 
రిలీజ్‌ చేశారు.

కార్తీ కెరీర్‌లోని సూపర్‌ హిట్‌ చిత్రాల్లో ‘ఖైదీ’ ఒకటి. ఈ సినిమాలో ఢిల్లీ పాత్రలో కార్తీ అద్భుతమైన నటన కనబరచారు. పదేళ్ల పాటు జైలు జీవితం గడిపి, తన కుమార్తె అముదను కలసుకునేందుకు ఢిల్లీ తిరిగి వస్తాడు. మరి... ఈ తండ్రీకూతుళ్ల కథ ఏంటి? ఢిల్లీ భార్యకు ఏం జరిగింది? డ్రగ్స్‌ మాఫియా నుంచి అముదకు పొంచి ఉన్న ప్రమాదాన్ని ఢిల్లీ ఏ విధంగా అడ్డుకుంటాడు? అన్న ఆసక్తికరమైన అంశాలను ‘ఖైదీ 2’ చిత్రంలో చూడాలి. డ్రీమ్‌ వారియర్‌ పిక్చర్స్‌ పతాకంపై ఏఆర్‌ ప్రభు, ఎస్‌.ఆర్‌. ప్రకాష్‌  ఈ సినిమాను నిర్మించనున్నారు. లోకేష్‌ కనగరాజ్‌ దర్శకత్వంలోని లోకేష్‌ సినిమాటిక్‌ యూనివర్స్‌లో భాగంగా రూపొందిన ‘ఖైదీ’ సినిమా సీక్వెల్‌ ‘ఖైదీ 2’ కూడా రానుంది. ప్రస్తుతం అల్లు అర్జున్‌తో సినిమా చేసే పనిలో ఉన్నారు లోకేష్‌. ఈ సినిమా పూర్తయిన తర్వాత ‘ఖైదీ 2’ సినిమా చిత్రీకరణను షురూ చేస్తారు కార్తీ, లోకేష్‌.

 మదర్‌ సెంటిమెంట్‌తో ‘బిచ్చగాడు’ సినిమా తీసి, బ్లాక్‌బస్టర్‌ అందుకున్నారు విజయ్‌ ఆంటోనీ. తాజాగా ఆయన ఫాదర్‌ సెంటిమెంట్‌తో చేస్తున్న సినిమా ‘నాన్న కుట్టి’. ప్రీతి అస్రాని, లిథన్య, భగవతి పెరుమాళ్, హరిప్రియ ఇసై, చిత్ర లక్ష్మణన్‌ ఈ సినిమాలోని ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ము. మారన్‌ దర్శకత్వంలో మీరా విజయ్‌ ఆంటోనీ ఈ సినిమాను నిర్మిస్తుండగా, రామాంజనేయులు జవ్వాజీ సహ–నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఇటీవలే ఈ సినిమా ఫస్ట్‌ లుక్‌ను రిలీజ్‌ చేశారు. త్వరలోనే ఈ సినిమా రిలీజ్‌ డేట్‌ను ప్రకటించనున్నారు.  

ఇలా తండ్రి భావోద్వేగాలతో కూడిన సినిమాలు మరికొన్ని ఉన్నాయి. అలాగే తల్లి ఎమోషన్‌తో కూడిన సినిమాలు కూడా ఉన్నాయి. 

– ముసిమి శివాంజనేయులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement