breaking news
Parents Day
-
థ్యాంక్యూ అమ్మా..నాన్నా!
అమ్మా నాన్నలది సెలవు లేని ఉద్యోగం... జీతం లేని షిఫ్ట్ప్రపంచంలో అన్ని ఉద్యోగాలకు జీతం ఉంటుంది. ఆఫీసు ఉంటుంది. వీకెండ్ ఉంటుంది. రిటైర్మెంట్ ఉంటుంది. కానీ అమ్మా నాన్నల ఉద్యోగానికి జీతం లేదు. సెలవు లేదు. రిటైర్మెంట్ అసలే లేదు. అయినా దాన్ని వదిలేయడానికి వీలు లేదు.నేడు ‘నేషనల్ పేరెంట్స్ డే’.అమ్మానాన్నలకు గిఫ్ట్‌లు, ఫోటోలు, సోషల్ మీడియా పోస్ట్‌లు.... మంచిదే. కానీ ఒక్క పది నిమిషాలు ఆపి, వాళ్ల ఉద్యోగపు ఫైల్ తిరగేద్దామా? ప్రతి పేజీలో ఒక త్యాగం, ఒక నిద్రలేని రాత్రి, ఒక దాచిపెట్టిన కన్నీరు ఉంటుంది.ఆ వేల పేజీల ఫైల్‌కి మనం ఇచ్చే రివార్డ్ ఏంటి?ఒకే ఒక్క మాట... ‘థ్యాంక్యూ అమ్మా, థ్యాంక్యూ నాన్నా’ఈ రోజు ఆ మాట చెప్పే రోజు.పిల్లలు చదువుకుంటారు. ఉద్యోగాల్లో చేరుతారు. పెళ్లిళ్లు చేసుకొని తమ పిల్లల పాలన, పోషణలో పడతారు. కాని తమ కోసం అప్పుడూ ఇప్పుడూ ఎడతెగని ఉద్యోగం చేస్తూనే ఉన్న అమ్మా నాన్నాల గురించి కొద్దిగా మరుపున పడతారు. బిజీలో కాస్త ఎడం జరుగుతారు. ప్రేమ ఉన్నా, ఎంతో గౌరవం ఉన్నా వీలు కాని స్థితిలో భుక్తి కోసం దూరం జరుగుతారు. అలాంటప్పుడు అమ్మా నాన్నలు ఏం చేసి మనల్ని ఇంత వరకూ తీసుకొచ్చారో గుర్తు చేసుకోవడానికి ఇలాంటి సందర్భాలు వీలు కల్పిస్తాయి.అమ్మ ఆఫీస్: ఇల్లు అనే ఫ్యాక్టరీగుర్తుందా... మన ఇంట్లో అమ్మ ఉద్యోగం ఉదయం అయిదు గంటలకే మొదలవుతుంది. అలారం మోగక ముందే ఆమె కళ్లు తెరుచుకుంటాయి. ఆమె ఒకేసారి వంటమనిషి, టీచర్, డాక్టర్, కౌన్సెలర్, న్యాయమూర్తి, అకౌంటెంట్. చిన్నప్పుడు మనకు జ్వరం వస్తే రాత్రంతా తల దగ్గరే కూర్చునే ‘నైట్ డ్యూటీ’ అమ్మదే! పరీక్షల భయంలో ‘భయపడకు, నేనున్నా’ అని వెన్ను తట్టే మోటివేషనల్ స్పీకర్ అమ్మే. మనం ఆఫీస్ నుండి అలసిపోయాక ‘కూర్చో, వేడిగా అన్నం పెడతా’ అనే స్టార్ హోటల్ షెఫ్ అమ్మే! ఇంత చేసినా నెలాఖరున ఆమె అకౌంట్లో ఒక్క రూపాయి కూడా జీతం పడదు. ‘అమ్మా, కూర సూపర్‌గా ఉంది’ అని మనం ఒక ముద్ద ఎక్కువ తింటే... అదే ఆమెకు వచ్చే అతిపెద్ద బోనస్! పండగకు కొత్త చీర కొనిపెడదామంటే, ‘నాకెందుకులే... ముందు నీకు కొత్త బూట్లు కొందాం’ అని వాయిదా వేసే త్యాగం ఆమెది. ఒంట్లో ఎంత బాగోలేకపోయినా ‘పిల్లలు ఆకలితో ఉంటారు’ అని కిచెన్ లోకి వెళ్లి ‘పంచ్’ కొట్టిన రోజులెన్నో! 58 ఏళ్లయినా, 70 ఏళ్లయినా ఆమెకు ‘అమ్మ’ ఉద్యోగం నుండి రిటైర్మెంట్ ఉండదు. ఈ రోజు ఆమె పక్కన కూర్చుని ‘అమ్మా, థ్యాంక్యూ! నువ్వు లేకుండా నేను లేను’ అని ఒక్క మాట చెబితే... అది ఆమెకు పదహారు పెండింగ్ డీఏల పెట్టు. నాన్న పని: అన్ని డిపార్ట్మెంట్ల ఇన్ ఛార్జ్!నాన్న చేసే ఉద్యోగం ఇంట్లో పైకి కనిపించదు. అది ఆయన మనసులో, జేబులో, కళ్ల వెనుక నిశ్శబ్దంగా సాగుతుంటుంది. ఉదయం ఆఫీసుకు వెళ్లే ముందే ఆయన తలలో లెక్కలు ఆన్. ఈ నెల ఈఎంఐ, స్కూల్ ఫీజు, కరెంట్ బిల్లు, ఇంటి అద్దె... ఎప్పుడూ మన చదువులు, మన భవిష్యత్తు అనే ‘టెన్షన్ షిఫ్ట్’లోనే ఉంటాడు. తన చెప్పులు అరిగిపోయినా పట్టించుకోడు కానీ మనం అడిగిన బైకో, లాప్టాపో కొనివ్వడానికి లోన్ల కోసం ఆఫీసుల చుట్టూ తిరుగుతాడు. మనం పరీక్షలో ఫెయిలైనప్పుడు క్లాస్ టీచర్ కంటే ముందు బాధపడేది ఆయన గుండె. అయినా బయటికి గాంభీర్యం నటిస్తూ ‘పర్వాలేదురా, నెక్స్›్టటైమ్ చూసుకుందాం’ అని కొండంత భరోసానిస్తాడు. మనం సక్సెస్ అయితే సమాజంలో అందరికంటే ముందు గర్వంగా చెప్పుకునేది ఆయనే! మన ముందు మాత్రం ‘ఇంకా పైకి రావాలి’ అని హెచ్చరిస్తాడు. ఆఫీసులో బాస్ తిట్టినా, ప్రమోషన్ మిస్ అయినా ఆ బాధను ఇంట్లోకి రానివ్వడు. మరి ఆయనకు మనం ఇచ్చే శాలరీ ఏంటి? మనకు మంచి జాబ్ వచ్చిందని ఫోన్ చేసి చెప్పినప్పుడు ఆయన గొంతులో కనిపించే గర్వం. ‘నాన్నా, నువ్వు చేసిన కష్టం వృథాకాలేదు’ అనే ఒక్క మాటే ఆయనకు కావాల్సిన లైఫ్‌టైమ్ అచీవ్మెంట్ అవార్డు.రెండు షిఫ్ట్‌లు కలిసే చోటు: ‘మనం’అమ్మా నాన్న ఇద్దరివీ వేరువేరు డిపార్ట్‌మెంట్లే కావచ్చు... కానీ ఇద్దరి గోల్ ఒక్కటే, ‘మన పిల్లలు బాగుండాలి’. అమ్మ మనకు అన్నం తినిపిస్తే, నాన్న ఆ అన్నం కొనడానికి కష్టపడతాడు. అమ్మ మన కన్నీళ్లు తుడిస్తే, నాన్న ఆ కన్నీళ్లకు కారణమైన సమస్యలను తుడిచేస్తాడు. వాళ్ల మధ్య చిన్న చిన్న గొడవలు వచ్చినా, పిల్లల భవిష్యత్తు విషయానికి వచ్చేసరికి ఎప్పుడూ ‘టీమ్ అమ్మా నాన్న’గానే నిలబడతారు.మనం పెద్దవాళ్లమయ్యాం. మనకు ఇప్పుడు జీతాలు, వీకెండ్స్, లీవ్ లెటర్లు అన్నీ వచ్చాయి. కానీ వాళ్లకు? ఇప్పటికీ అదే 24 బై 7 షిఫ్ట్. మనం ఫోన్ ఎత్తకపోతే టెన్షన్. సరిగా తినకపోతే టెన్షన్. ప్రపంచంలో ఏ ఉద్యోగానికైనా రిజైన్ చేయొచ్చు కానీ అమ్మానాన్నల ఉద్యోగానికి రిజిగ్నేషన్ లెటర్ ఉండదు. మనం పుట్టగానే మొదలయ్యే ఈ డ్యూటీ వారి చివరి శ్వాస వరకు కొనసాగుతుంది. ఒకరకంగా వారి చివరి శ్వాసే వారి రిజిగ్నేషన్ లెటర్! ఆ తర్వాత కూడా ఆకాశం నుండి మన కోసం వేయి కళ్లతో ప్రార్థించే డ్యూటీని వాళ్లు మానరు.అమ్మానాన్నలు పక్కన ఉన్నంత కాలం వారి విలువ తెలీదు. వృద్ధాశ్రమాల్లో కిటికీ పక్కన కూర్చుని గేటువైపు చూసే ఆ శూన్యమైన కళ్లను చూస్తే ఆ బాధ ఏంటో అర్థమవుతుంది. ఈ రోజు మన అమ్మానాన్నలను గట్టిగా హగ్ చేసుకుని ఏడ్చినా పర్లేదు. ఎందుకంటే ఆ కన్నీళ్లలోనే వారి జీవిత కాలపు అలసటంతా కరిగిపోతుంది. ఈ రోజు... ఆ సెలవు లేని నిజమైన ఉద్యోగులకు మనసారా ఒక సెల్యూట్చేద్దాం!అన్నీ ఇవ్వక్కర్లేదు.. అవసరమైన వి ఇస్తే చాలు..!తీరిక లేకుండా కష్టపడుతున్నాం.. ఎన్నో త్యాగాలు చేసి బాధ్యతలను మోస్తున్నాం..మంచి భవిష్యత్ ఇవ్వడానికి ఇంతకు మించి ఏం చేయాలి? అని ప్రతి తల్లిదండ్రులు భావిస్తారు. పిల్లల భవిష్యత్ బాగుండాలని తపన పడడంలో తప్పు లేదు..అయితే వారికి మంచి స్కూల్, గాడ్జెట్లు, ఆహారం ఇస్తే చాలు కదా అని అనుకోవడమే తల్లిదండ్రులు చేస్తున్న పెద్ద పొరపాటని ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న పరిశోధనలు వెల్లడిస్తున్నాయి. పిల్లల జీవితాన్ని మార్చేది డబ్బు కాదు.. వారితో తల్లిదండ్రులు గడిపే నాణ్యమైన సమయం మాత్రమేనని ఐక్యరాజ్యసమితి, ప్రపంచ ఆరోగ్య సంస్థ, హార్వర్డ్ సెంటర్ ఆన్ ది డెవలపింగ్ చైల్డ్ వంటి సంస్థలు స్పష్టం చేస్తున్నాయి.స్ఫూర్తి తేజాలు‘మా నాన్నగారు ఎంతో నిరాడంబరమైన వ్యక్తి. మంచితనం ఆయన రూపంలో వెల్లివిరుస్తుంటుంది. నాన్న వ్యక్తిత్వంలోనే ఆయన తేజస్సు ప్రతిబింబిస్తుంది. ఆయన నాకు నాన్న మాత్రమే కాదు స్ఫూర్తినిచ్చే రోల్ మోడల్. నేను డిప్రెషన్‌తో బాధపడుతున్నప్పుడు నాలోని డిప్రెషన్ లక్షణాలను మా అమ్మ గుర్తించి, ఆ సమస్య నుంచి బయటపడేలా చేసింది.– దీపికా పదుకొణె – కెఅన్నీ ఇవ్వక్కర్లేదు.. అవసరమైన వి ఇస్తే చాలు..!తీరిక లేకుండా కష్టపడుతున్నాం.. ఎన్నో త్యాగాలు చేసి బాధ్యతలను మోస్తున్నాం..మంచి భవిష్యత్ ఇవ్వడానికి ఇంతకు మించి ఏం చేయాలి? అని ప్రతి తల్లిదండ్రులు భావిస్తారు. పిల్లల భవిష్యత్ బాగుండాలని తపన పడడంలో తప్పు లేదు..అయితే వారికి మంచి స్కూల్, గాడ్జెట్లు, ఆహారం ఇస్తే చాలు కదా అని అనుకోవడమే తల్లిదండ్రులు చేస్తున్న పెద్ద పొరపాటని ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న పరిశోధనలు వెల్లడిస్తున్నాయి. పిల్లల జీవితాన్ని మార్చేది డబ్బు కాదు.. వారితో తల్లిదండ్రులు గడిపే నాణ్యమైన సమయం మాత్రమేనని ఐక్యరాజ్యసమితి, ప్రపంచ ఆరోగ్య సంస్థ, హార్వర్డ్ సెంటర్ ఆన్ ది డెవలపింగ్ చైల్డ్ వంటి సంస్థలు స్పష్టం చేస్తున్నాయి.పిల్లలు... తల్లిదండ్రుల కలల రూపాలుస్టార్ క్రికెటర్ స్మృతి మంధాన తండ్రి శ్రీనివాస్ మంధాన ఒకప్పుడు జిల్లా స్థాయి క్రికెట్ ప్లేయర్. జాతీయస్థాయిలో రాణించాలనే ఆయన కల నెరవేరలేదు. అయితే తన పిల్లల్లో ఒకరు క్రికెట్లో దేశానికి ప్రాతినిధ్యం వహిస్తారని గట్టిగా నమ్మారు. క్రికెట్ ఆడడంలో స్మృతిని ఆమె సోదరుడిని బాగా ప్రోత్సహించారు. తన కలను స్మృతి సాకారం చేయడంతో ఆయన గర్వపడే తండ్రి అయ్యారు. క్రికెటర్‌గా స్మృతి రాణించంలో తల్లి స్మిత పాత్ర ఎంతో ఉంది. ‘చదువు కావచ్చు, ఆటలు కావచ్చు... ఏ రంగం అయినా తల్లుల ప్రోత్సాహం, ఆశీర్వాదం ఉంటే పిల్లలు తప్పకుండా సాధించగలరు. అమ్మ ఆశీర్వాదం, ప్రోత్సాహం నా బలం’ అంటుంది స్మతి మంధాన.ఎంతో కష్టపడ్డారు‘నేర్చుకోవాలి. జ్ఞానాన్ని పెంచుకోవాలి’ అనే ధోరణిలో ఉండేవారు నా తల్లిదండ్రులు. వారు చెప్పింది నా మనసుపై గాఢమైన ప్రభావాన్ని చూపింది. ‘నిరంతరం నేర్చుకుంటూ ఉండాలి’ అని తల్లిదండ్రుల నుంచి నేను విన్నది మా సంస్థ లక్ష్యాలలో ప్రధానమైనది. బాగా చదివించాలని, నన్ను ఉన్నతస్థానంలో చూసుకోవాలని నా కోసం అమ్మానాన్న ఎంతో కష్టపడ్డారు. ఎన్నో త్యాగాలు చేశారు. – సుందర్ పిచాయ్వెలకట్టలేని ప్రేమ– పారా అథ్లెటర్ దీప్తి జీవాంజీఅథ్లెట్ దీప్తి జీవాంజీది తెలంగాణలోని వరంగల్ జిల్లా కల్లెడ గ్రామం. పారా అథ్లెటిక్‌గా ప్రపంచ స్థాయి గుర్తింపు సాధించింది. తల్లిదండ్రులు తమ కోసం పడుతున్న కష్టాలను చూస్తూ పెరిగింది. తల్లిదండ్రుల కష్టంలో పాలుపంచుకుంటూ క్రీడలో శిక్షణ తీసుకుంటూ తనను తాను మలుచుకుంటోంది. తమ ఎదుగుదలలో తల్లిదండ్రులు ఎంత మద్దతుగా నిలుస్తున్నారో వివరించింది.‘‘మా అమ్మానాన్నలకు నేను, చెల్లి సంతానం. మా అమ్మ ధనలక్ష్మి కూలి పనులకు వెళుతుంది. నాన్న యాదగిరి పైపుల కంపెనీలో పనిచేస్తాడు. చెల్లెలు కాలేజీకి వెళుతుంది. చిన్నప్పుడు స్కూల్లో స్పోర్ట్స్‌లో పాల్గొంటే చిన్న ప్రైజ్ వచ్చింది. మా అమ్మకు తీసుకొచ్చి చూపిస్తే నన్ను ముద్దుపెట్టుకొని తెగ సంతోషపడింది. నాన్న ‘కష్టపడితే ఏదీ వృథాగా పోదు’ అనేవాడు. నేను ఏదైనా అప్పటి నుంచి స్కూల్లో ఆటల మీద ఎక్కువ ఇష్టం చూపేదాన్ని. మా చుట్టుపక్కల వాళ్లు ఆడపిల్లలకు ఈ ఆటలు అవసరమా అన్నట్టు మాట్లాడేవారు. కానీ, మా అమ్మా నాన్న మాత్రం ‘అవన్నీ పట్టించుకోవద్దు. సాధించి నిలబడాలి’ అనేవారు. వాళ్ల మాటల వల్లే స్పోర్ట్స్ అన్ని బలహీనతలను దూరం చేస్తుందని.. గెలిచినా, ఓడినా.. ఎప్పడూ పాఠాలు నేర్చుకుంటూనే ఉంటామని ఇన్నేళ్లలో చాలాసార్లు రుజువు అయ్యింది. ఇప్పటివరకు నాలుగు వరల్డ్ ఛాంపియన్షిప్ పోటీల్లో పాల్గొన్నాను. నాకు ఆరోగ్యం బాగలేక, ఇంటి సమస్యలు అధికమయ్యి ఉన్న రెండెకరాల భూమిని అమ్మారు అమ్మనాన్న. ఎంతో బాధపడేవారు. కానీ, మాకంట పడనిచ్చేవారు కాదు. వాళ్లకంటూ సొంతంగా ఇష్టాలు, అభిరుచులు ఉంటాయనే ద్యాసే లేదు. తమకంటూ మంచిబట్టలు కొనుక్కోవడానికి కూడా ఆసక్తి లేనట్టుగా చెబుతారు. అదే మా విషయంలో అయితే ‘మీకేం కావాలో తీసుకోండి’ అంటారు. అమ్మానాన్నల ప్రేమ అంతులేనిది. దానికి వెలకట్టలేం. మాకోసం భూమికి దూరమయ్యారని ఎప్పుడూ అనుకునేదాన్ని. క్రీడల ద్వారా వచ్చిన డబ్బుతో వాళ్లు అమ్మిన భూమిని తిరిగి కొనుగోలు చేశాం. ఆ రోజు అమ్మానాన్నల ఆనందం మాటల్లో చెప్పలేను. కళ్లనీళ్లు పెట్టుకున్నారు. ఊళ్లోనూ గొప్పగా చెప్పుకున్నారు. మరింతగా కృషి చేసి, వారిని బాగా చూసుకోవాలన్నదే నా ఆలోచన’ అని తెలిపారు దీíప్తి.– నిర్మలారెడ్డినా ప్రతిపాటలోనూ అమ్మానాన్నల త్యాగమే!– గాయని శ్రీలలితకర్ణాటక సంగీత గాయనిగా చిన్ననాటి నుంచే పేరు తెచ్చుకుంది భమిడిపాటి శ్రీలలిత. విజయవాడ వాసి అయిన శ్రీలలిత ‘పిల్లల కోసం తల్లిదండ్రులు పడే కష్టాలు, వారు చేసే త్యాగాల రుణం ఏ రూపంలోనూ తీర్చుకోలేం’ అని తెలిపింది.‘‘మా నాన్న బ్యాంకులో జాబ్ చేసేవారు. నేను గాయనిగా పేరు తెచ్చుకోవాలని మా నాన్న నా కోసం ఉద్యోగంలో వచ్చే ప్రమోషన్స్ వదులుకున్నారు. ప్రమోషన్స్ తీసుకుంటే ఎక్కువ గంటల ఉద్యోగంలోనే గడిచిపోతాయి, నాకు టైమ్ కేటాయించలేనని అనేవారు. కాస్త టైమ్ ఉన్నా, వెహికిల్ మీద తీసుకెళుతున్నా దారంతటా పాటలు పాడుతూ నా చేత పాడిస్తూ ప్రోత్సహించేవారు. అమ్మ నా ఎనిమిది నెలల వయసు నుంచే నన్ను వేదికల మీద చూడాలని తపన పడేది. నాన్న ఉద్యోగరీత్యా చెన్నైలో ఉంటే ఎవరూ తెలియని ఆ ప్రాంతంలో, రాని భాషతో ఇబ్బందులు పడినా నన్ను గాయనిగా నిలబెట్టాలని చూసేది. మా పేరెంట్స్ నా కోసం చేసిన త్యాగాలు అన్నీ ఇన్నీ కావు. గాయనిగా ఎదగాలంటే సమయం సరిపోదని, స్కూల్‌కి పంపకుండా ఇంట్లోనే చదివిస్తూ ఎగ్జామ్స్ రాయించేవారు. షూటింగ్స్ సమయంలో అసలు టైమ్ ఉండేది కాది. అర్ధరాత్రి అని కూడా చూడకుండా, గంటలు గంటలు ఓపికగా నా గురించి అలాగే ఉండేవారు. నాకు ఒక మంచి దారి వేయడానికి మా అమ్మనాన్నలు ఎంత చేశారో ఒక్క మాటలో చెప్పలేను. నా ప్రతి అడుగులో వాళ్లే ఉన్నారు. వాళ్లలో ఒక్క శాతం అయినా రేపు నా పిల్లలకు చేస్తే అదే గొప్ప అనిపిస్తుంటుంది’’ అని వివరించారు శ్రీ లలిత.మందలింపు కాదు.. మంచి మాట కావాలిపిల్లల తప్పులను మాత్రమే ఎత్తి చూపడం వల్ల వారు క్రమంగా ఆత్మవిశ్వాసాన్ని కోల్పోతారని పరిశోధనలు చెబుతున్నాయి. అందుకే నిపుణులు సూచించే ‘5:1 రూల్’ ప్రకారం, ఒక్కసారి మందలిస్తే దాని తర్వాత కనీసం ఐదుసార్లు వారికి సానుకూలంగా స్పందిస్తూ వారిని ప్రోత్సహించాలి. హార్వర్డ్ పరిశోధనల్లో చెప్పిన ‘సర్వ్ అండ్ రిటర్న్’ రూల్ ప్రకారం పిల్లలు మాట్లాడినప్పుడు వెంటనే స్పందించడం, కళ్లలోకి చూసి మాట్లాడడం, నవ్వడం, అ΄్యాయంగా వినడం వంటి చిన్న పనులే వారి మానసిన పరివర్తనకి, మెదడు ఎదుగుదలకి ఎంతో కీలకమని వెల్లడైంది. పర్ఫెక్ట్ పేరెంట్ కావాలనే ఒత్తిడిలో చాలామంది తల్లిదండ్రులు జీవిస్తున్నారు. కానీ పిల్లలకు అవసరమైంది తప్పులు చేయని తల్లిదండ్రులు కాదు, అవసరమైనప్పుడు తమతో మాట్లాడే, వినే, అండగా నిలిచే తల్లిదండ్రులు మాత్రమే.అమ్మానాన్నల్లా కాదు.. ఫ్రెండ్స్‌లా! ‘ఈ రోజుల్లో అమ్మానాన్నలతో ఒక తరం గ్యాప్ అన్నట్టుగా కాకుండా మంచి స్నేహపూర్వకమైన బంధంలా ఉండాలి. మిస్టేక్స్ చేసినా అంగీకరించాలి. అర్థం చేసుకోవాలి. ఇది మా ఇంటి వాతావరణం. మా అమ్మనాన్నలు మమ్మల్ని అలాగే పెంచారు’ అని తెలిపారు ప్రకృతి, సంస్కృతి. ఈ ఇద్దరు ఐపీఎస్ అధికారి బి.సుమతి కూతుళ్లు. చదువుకుంటూనే సమాజంలో తమదైన ముద్రవేస్తున్న వీరు ఈ తరం ఆలోచనలను మన ముందుంచారు. ‘‘స్టూడెంట్‌గా చదువులో రాణించడానికి, ఎంట్రప్రెన్యూర్‌గా ఎదగడానికి, నా ఆలోచనలను ముందుకు తీసుకెళ్లడానికి మా నాన్న శ్రీనాథ్‌రాజు చాలా సపోర్ట్ చేస్తారు. క్రియేట్ ఎడ్యుటెక్ ద్వారా యూత్ వెల్నెస్, డిజిటల్ సేఫ్టీ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చేస్తున్నాను. హ్యాండ్ మేడ్ జ్యువెలరీ పరిశ్రమలో గ్రామాల్లో ఉన్న స్వర్ణకారులకు చేయూతనిచ్చే ప్రోగ్రామ్స్ చేశాం. అమ్మ ఎంత బిజీగా ఉన్నా, మా చదువు, ప్రోగ్రామ్స్ గురించి గైడ్ చేస్తూనే ఉంటుంది. – ప్రకృతి‘‘అమ్మ మల్టిపుల్ రోల్స్ ప్లే చేస్తుంది. చాలా అద్భుతం అనిపిస్తుంది తనని చూస్తుంటే. తన నుంచి నేర్చుకోవలసింది ఎంతో ఉంది. అమ్మ మా ప్రపంచంలో గ్రేట్ కన్నా ఇంకా ఎక్కువే. ధైర్యంగా ఉండటం, ఎంత బిజీగా ఉన్నా అవతలి వ్యక్తులతో ఎలా ఉండాలి... ఇంకా చాలా విషయాలు తనని చూసే నేర్చుకుంటాం. అమ్మను చూసే మేమూ పబ్లిక్ సెక్టార్లో వర్క్ చేస్తున్నాం. నేను సైకాలజీ చేస్తున్నాను. పేరెంట్ అంటే స్ట్రిక్ట్‌గా ఉండాలని అనుకుంటారు. కానీ, మా పేరెంట్స్ మాతో చాలా ఫ్రెండ్లీగా ఉంటారు. వారి స్ఫూర్తితోనే మల్టిపుల్ గవర్నమెంట్ సెక్టార్స్‌లో గర్ల్ చైల్డ్ ఎంపవర్మెంట్, డిజటల్ సేఫ్టీ.. మొదలైన విభాగాలలో వర్క్ చేయగలుగుతున్నాం.’’ – సంస్కృతినా గెలుపు తమదే అనేంతగా ఆనందిస్తారు– చిత్రకారిణి ప్రియాంక ఏలెకన్న కలలకు కాన్వాస్‌పై రూపం ఇస్తూ తండ్రి కుంచెను స్ఫూర్తిగా తీసుకొని ఎదిగిన చిత్రకారిణి ప్రియాంక ఏలె. ప్రముఖ చిత్రకారుడు లక్ష్మణ్ ఏలె కుమార్తె. ‘మా నాన్నే గురువుగా కళను సాధన చేశాను’ అని వివరించింది ప్రియాంక. ‘‘అమ్మాయిలను ఇలాగే పెంచాలి అని మా అమ్మానాన్నలు ఎప్పుడూ అనుకోలేదు. మేం ఇద్దరం ఆడపిల్లలమని ఎక్కడా ఆంక్షలు పెట్టలేదు. కావాల్సినంత స్వేచ్ఛనిచ్చారు. దాని వల్ల భవిష్యత్తును మాకు నచ్చినట్టుగా మలుచుకోగలిగాం. ‘మనం ఎలా ఉంటే ఎదుటివారు అలాగే స్పందిస్తారు’ అంటుంటారు నాన్న. క్రియేటివ్ రంగంలో ఉన్నందువల్ల మా జీవన విధానం చాలా భిన్నంగా ఉంటుంది. రోజువారీ జీవనంలో చాలా ప్రాక్టికల్‌గా ఉంటాం అనుకుంటాం. కానీ, చాలాసార్లు ప్రకృతితో ఎక్కువ కనెక్ట్ అవుతుంటాం. దీంతో మాదైన ప్రపంచంలో ఎక్కువ సమయం గడుపుతుంటాం. ఇలాంటప్పుడు జీవన విధానంలో మానవసంబంధాలు ఎంత ముఖ్యమైనవో అమ్మానాన్న ప్రతీసారి చెబుతుంటారు. చిన్నప్పటి నుంచి నాన్న పెయింటింగ్స్ చూసి, స్ఫూర్తిపొంది నేనూ ఆర్టిస్ట్‌ను అయ్యాను. దీంతో నాన్న ఆఫీస్ స్పేస్‌ను కూడా పంచుకుంటున్నాను. ఆ విధంగా అమ్మానాన్నలతో ఎక్కువ సమయం గడిపే అవకాశం నాకు లభించింది. మా ఆలోచనలు ఎప్పుడూ ఒక మంచి చర్చతో ఉదయాన్నే ప్రారంభమవుతాయి. తిరిగి పడుకునే ముందు ముగుస్తాయి. ఇప్పటికీ అమ్మానాన్నలను విడవకుండా ఉండేంతగా ఆర్ట్ మా మధ్యన ఉండిపోయింది. ఇదంతా నాన్న చూపిన ప్రేమ. నేను ఏదైనా సాధిస్తే మొదట ఆనందించేది మా అమ్మనాన్నలే. నా చిత్ర ప్రదర్శన ఉందంటే నాకన్నా ముందు నాన్ననే ఆ గ్యాలరీలో ఉంటారు. అమ్మ లలిత ప్రతి చిన్న పనిలో ఇప్పటికీ నాకు సహకరిస్తుంటారు. ఇంట్లో ఇద్దరు ఆర్టిస్టులను అమ్మ భరిస్తున్నారంటే సామాన్యమైన విషయం కాదని చెబుతుంటాను. మా అవసరాలన్నీ తనే చూసుకుంటుంది. ఎంతో ఓపికగా తమ జీవితంలో పిల్లలకే అగ్రభాగాన్ని ఇచ్చే దేవుళ్లు అమ్మానాన్నలు. మనమేమీ అమ్మనాన్నల కోసం పెద్ద పెద్ద త్యాగాలు చేయనక్కర్లేదు. ఏదైనా కొత్త వర్క్ చేసినప్పుడు ఇలాంటిది అమ్మానాన్నలకు నచ్చదు అని వదిలేయకుండా, మన అభి ప్రాయాన్ని కూడా వాళ్లు అర్థం చేసుకునేలా చెప్పగలగాలి. మనల్ని మొదట అర్థం చేసుకునే అత్యంత ప్రాణస్నేహితులూ అమ్మానాన్నలే’ అంటూ వివరించారు ఈ చిత్రకారిణి. -
ఫ్యామిలీ స్టార్స్
సూపర్ పవర్స్ లేని సూపర్ హీరో నాన్న. అయినా కుటుంబం కోసం సూపర్ కష్టాలను తట్టుకుని మరీ కుటుంబ సంక్షేమం కోసం తపన పడతాడు... ఒక్కోసారి తన ఇష్టాలను కూడా త్యాగం చేస్తాడు. బాధ్యతలనే ఇష్టంగా చేసుకుంటాడు. కుమారుడు, కుమార్తెల సంతోషమే తన ఆస్తిగా ఫీలవుతాడు. అందుకే ప్రతి కుటుంబానికి నాన్నే ఫ్యామిలీ స్టార్. ఇలా తండ్రి ఎమోషన్ గురించి ఎంత చెప్పినా తక్కువే. అందుకే... ఫాదర్ ఎమోషన్ నేపథ్యంలో వచ్చిన చాలా సినిమాలు బ్లాక్‌బస్టర్స్‌గా నిలిచాయి. ప్రస్తుతం ఈ జానర్లో మరికొన్ని సినిమాలు ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. నేడు (ఆదివారం) నేషనల్ పేరెంట్స్ డే. ఈ సందర్భంగా తండ్రి ఎమోషన్‌తో రానున్న కొన్ని సినిమాలపై ఓ లుక్ వేయండి.గ్యాంగ్‌స్టర్ నాన్న కూతురు సంరక్షణ కోసం ఎంతకైనా తెగించే ఓ తండ్రి కథ వచ్చే సంక్రాంతికి థియేటర్స్‌లోకి వచ్చే అవకాశం ఉంది. ‘వాల్తేరు వీరయ్య’ వంటి హిట్ ఫిల్మ్ తర్వాత హీరో చిరంజీవి, దర్శకుడు బాబీ కాంబినేషన్లో రూపొందుతున్న సినిమా ‘మెగా 158’ (వర్కింగ్ టైటిల్). ఈ సినిమా ప్రధాన కథాంశం తండ్రీ కూతుళ్ల ఎమోషనే అని తెలిసింది. ఈ చిత్రంలో చిరంజీవి క్యారెక్టరైజేషన్లో డిఫరెంట్ షేడ్స్ ఉంటాయట.కొన్ని సీన్స్‌లో చిరంజీవి గ్యాంగ్‌స్టర్‌గా కనిపిస్తారని సమాచారం. అలాగే ఈ సినిమాలోని కొంత భాగం గోదావరి నేపథ్యంలో, మరికొంత భాగం కోల్‌కతా నేపథ్యంలో సాగుతుందని తెలిసింది. అలాగే ఈ చిత్రంలో తండ్రీ కూతుళ్ల పాత్రలో చిరంజీవి, మలయాళ నటి అనశ్వర రాజన్ నటిస్తున్నారని టాక్. నివేతా పేతురాజ్ మరో కీ రోల్ చేస్తున్నారు. చిరంజీవి భార్యగా నివేతా పేతురాజ్ కనిపిస్తారట. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. వచ్చే సంక్రాంతి పండగకు రిలీజ్ చేయాలనే టార్గెట్‌తో చిత్రయూనిట్ షూటింగ్ చేస్తోందని తెలిసింది. కేవీఎన్ ప్రోడక్షన్స్ పతాకంపై వెంకట్ కె. నారాయణ ఈ సినిమాను నిర్మిస్తున్నారు.ఇటు క్లాస్... అటు మాస్ సమాజంలో వారిది ‘ఆదర్శ కుటుంబం’. కానీ తన ఫ్యామిలీ జోలికి వస్తే మాత్రం, ఈ కుటుంబం పెద్ద అయిన తండ్రి గన్ పడతాడు? తన కుటుంబ సభ్యుల చేత ఫైట్ చేయిస్తాడు. ఈ మాస్ ఫాదర్ డీటైల్స్ ఏంటో తెలుసుకోవాలంటే అక్టోబరు 2 వరకు ఆగాల్సిందే. వెంకటేశ్, శ్రీనిధి శెట్టి హీరో హీరోయిన్లుగా నటిస్తున్న సినిమా ‘ఆదర్శ కుటుంబం హౌస్ నెంబరు 47’ (ఏకే 47). ఈ చిత్రంలో నారా రోహిత్ కీలక పాత్రలో నటిస్తున్నారు. త్రివిక్రమ్ దర్శకత్వం వహిస్తున్న సినిమా ఇది. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ శరవేగంగా జరుగుతోంది. ఈ చిత్రంలో ఫాదర్ రోల్ చేస్తున్నారు వెంకటేశ్. అలాగే వెంకటేశ్ క్యారెక్టరైజేషన్లో డిఫరెంట్ షేడ్స్ ఉంటాయి. క్లాస్‌గా ఉంటూనే తన కుటుంబం ఆపదలో ఉందంటే మాత్రం ఫైర్ అయి పోయే మాస్ ఫాదర్ రోల్ చేస్తున్నారట వెంకటేశ్. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ పతాకంపై సూర్యదేవర రాధాకృష్ణ నిర్మిస్తున్న ఈ సినిమా అక్టోబరు 2న విడుదల కానుంది. మరోవైపు వెంకటేశ్ హీరోగా నటించిన హిట్ ఫిల్మ్స్ ‘నువ్వు నాకు నచ్చావ్, మల్లీశ్వరి’ చిత్రాలకు దర్శకుడు త్రివిక్రమ్ డైలాగ్స్ అందించారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో వెంకటేశ్ హీరోగా రానున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో అంచనాలు ఉండటం సహజం.కూతురు కోసం... రవితేజ హీరోగా నటించిన తాజా సినిమా ‘ఇరుముడి’. ఈ సినిమాలో రవితేజ తండ్రి పాత్రలో నటించగా, ఆయన కుమార్తెగా బేబీ నక్షత్ర నటించారు. రవితేజ భార్యగా ప్రియా భవానీ శంకర్ నటించినట్లు తెలుస్తోంది. కాగా, ఈ సినిమా ప్రధాన కథాంశం తండ్రీ కూతుళ్ల ఎమోషన్ నేపథ్యంలో సాగుతుందని ఇటీవల విడుదలైన ఈ సినిమా టీజర్ స్పష్టం చేస్తోంది. ఏదో మానసిక బాధలో ఉన్న తండ్రిని మందు మానేయమని కూతురు రిక్వెస్ట్ చేయడం, కుమార్తె కోసం ఆ తండ్రి తనను తాను మార్చుకోవాలనుకోవడం, ఆ కుమార్తె రక్షణ కోసం తన ప్రాణాలనైనా లెక్క చేయని తండ్రి సాహసం... వంటి అంశాల నేపథ్యంలో ఈ ‘ఇరుముడి’ సినిమా కథనం సాగుతుందని టాక్. ఈ చిత్రంలో రవితేజ అయ్యప్ప స్వామి భక్తుడిగా కనిపిస్తారు. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ నిర్మిస్తున్న ఈ సినిమా ఆగస్టు 21న విడుదల కానుంది. తండ్రి ఆదేశం తన తండ్రి లక్ష్యం కోసం రుద్ర ఓ సాహసోపేతమైన ప్రయాణం మొదలుపెట్టాడు. కాలానికి అతీతంగా ఖండాల మధ్య ప్రయాణం చేస్తున్నాడు. మరి... రుద్రకు అతని తండ్రి అప్పగించిన మిషన్ ఏంటి? తండ్రి కోసం రుద్ర ఏం చేశాడు? అన్న అంశాల నేపథ్యంలోనే ‘వారణాసి’ సినిమా కథనం రూపొందుతోందనే ప్రచారం ఫిల్మ్‌నగర్ సర్కిల్స్‌లో వినిపిస్తోంది. మహేశ్‌బాబు హీరోగా రాజమౌళి దర్శకత్వంలో అంతర్జాతీయ స్థాయిలో రూపొందుతున్న సినిమా ‘వారణాసి’. ఈ చిత్రంలో రుద్ర, శ్రీరాముడు... ఇలా రెండు విభిన్నమైన పాత్రల్లో నటిస్తున్నారు మహేశ్‌బాబు. మందాకినిగా ప్రియాంక చో్ర పా, కుంభగా పృథ్వీరాజ్ సుకుమారన్ నటిస్తున్నారు. మరో కీలక పాత్రలో ప్రకాశ్‌రాజ్ నటిస్తున్నారు. ఈ సినిమాలో సైన్స్ ఫిక్షన్, మైథలాజికల్, అడ్వెంచరస్ అంశాలు ఉన్నప్పటికీ ‘వారణాసి’ ప్రధాన కథాంశం తండ్రీ కొడుకుల అనుబంధమే అని ఇటీవల పారిస్‌లో జరిగిన కార్యక్రమంలో స్పష్టం చేశారు రాజమౌళి. దీంతో ‘వారణాసి’ సినిమా కథపై విభిన్న ప్రచారాలు తెరపైకి వచ్చాయి. పైన పేర్కొన్న కథాంశం కూడా ఫిల్మ్‌నగర్ సర్కిల్స్‌లో వినిపిస్తోంది. అంతేకాదు...ఈ చిత్రంలో మహేశ్‌బాబు తండ్రిగా ప్రకాశ్‌రాజ్ కనిపిస్తారని భోగట్టా. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ హైదరాబాద్‌లో జరుగుతోంది. మహేశ్‌బాబు పాల్గొంటుండగా కీలకమైన యాక్షన్ సన్నివేశాల చిత్రీకరణ జరుగుతోందని సమాచారం. కేఎల్ నారాయణ, ఎస్ఎస్ కార్తికేయ నిర్మిస్తున్న ‘వారణాసి’ సినిమా ఏప్రిల్ 7న రిలీజ్ కానుంది.ఓ తండ్రి... ఇద్దరు కొడుకులు ఓ తండ్రి తన ఇద్దరు కొడుకుల కోసం ఎలాంటి త్యాగం చేశాడు? ఈ ఇద్దరు కొడుకులకు, తండ్రికి మధ్య దూరం ఎందుకు ఏర్పడింది? అనే అంశాల ఆధారంగా ‘రాకా’ సినిమా తెరకెక్కుతోందట. అల్లు అర్జున్ హీరోగా అట్లీ దర్శకత్వంలో రూపొందుతున్న ఫ్యాంటసీ యాక్షన్ డ్రామా ‘రాకా’. ఈ చిత్రంలో అల్లు అర్జున్ త్రి పాత్రాభినయం చేస్తున్నారనే ప్రచారం సాగుతోంది. తండ్రి, ఇద్దరు కొడుకులు... ఇలా మూడు పాత్రల్లోనూ అల్లు అర్జున్ కనిపిస్తారని ఫిల్మ్‌నగర్ భోగట్టా. ఈ తండ్రీ కొడుకుల మధ్య వచ్చే యాక్షన్ సన్నివేశాలతో పాటు కొన్ని ఎమోషనల్ సీన్స్ కూడా ఈ సినిమాలో హైలైట్‌గా ఉంటాయని సమాచారం. అంతే కాదండోయ్..‘రాకా’ సినిమాలో అల్లు అర్జున్ చేస్తున్న మూడు డిఫరెంట్ క్యారెక్టర్స్‌లో ఒక క్యారెక్టర్ విలన్ అని టాక్. ముంబైలో ప్రత్యేకంగా వేసిన సెట్స్‌లో ‘రాకా’ సినిమా చిత్రీకరణ జరుగుతోంది. మేజర్‌గా ఈ సెట్స్‌లోనే ఈ సినిమాను షూట్ చేస్తున్నారు అట్లీ అండ్ టీమ్. కాగా, ప్రస్తుతం ఫ్యామిలీతో కలిసి వెకేషన్లో భాగంగా ఆస్ట్రియాలో ఉన్నారు అల్లు అర్జున్. ఈ వెకేషన్ పూర్తి కాగానే, ముంబై చేరుకుని ‘రాకా’ చిత్రీకరణలో పాల్గొంటారు. ఈ సినిమా చిత్రీకరణను ఈ ఏడాదే పూర్తి చేయాలనుకుంటున్నారు. కానీ రిలీజ్ మాత్రం వచ్చే ఏడాది ఉంటుందట. ఎందుకంటే... ఈ చిత్రం కోసం ఓ ప్రత్యేకమైన ప్రపంచాన్నే సృష్టించారు దర్శకుడు అట్లీ. అందుకోసం చాలా వీఎఫ్ఎక్స్ పనులు చేయాల్సి ఉంది. ఈ కారణంగానే ‘రాకా’ సినిమా విడుదల వచ్చే ఏడాది ఉంటుంది. నటీమణులు దీపికా పదుకోన్, ఫెమినా జార్జ్, పంజాబీ నటి నైలా గ్రేవాల్ ఈ సినిమాలోని ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇంకా జాన్వీ కపూర్, రష్మిక మందన్నా, మృణాల్ ఠాకూర్ సైతం ఈ సినిమాలో భాగమయ్యారని బాలీవుడ్ సమాచారం. సన్ పిక్చర్స్ పతాకంపై కళానిధి మారన్ భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను నిర్మిస్తున్నారు.తండ్రి హీరో... కొడుకు విలన్? ఏ తండ్రికైనా తన కొడుకే హీరో. కానీ ఓ తండ్రి పాలిట ఓ కొడుకు విలన్ అయ్యాడు. మరి... ఈ తండ్రీ కొడుకుల కహానీ ఏంటి? కొడుకు తనపై పెంచుకున్న ద్వేషాన్ని ప్రేమగా మార్చేందుకు ఓ తండ్రి ఎలాంటి సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకున్నాడు? అన్న అంశాలతో ‘టాక్సిక్’ సినిమా రూపొందుతోందని సమాచారం. యశ్ ద్వి పాత్రాభినయం చేసిన ద్విభాషా (కన్నడ, ఇంగ్లిష్) చిత్రం ‘టాక్సిక్: ఏ ఫెయిరీ టెల్ ఫర్ గ్రోన్ అండ్ అప్స్’. గోవా నేపథ్యంలో సాగే ఈ పీరియాడికల్ యాక్షన్ డ్రామాలో రాయ, టాక్సిక్ అనే రెండు విభిన్నమైన పాత్రల్లో నటించారు యశ్.‘టాక్సిక్’ కథనం తండ్రీ కొడుకుల ప్రతీకారం, అనుబంధం నేపథ్యంలో సాగుతుందని, 1940–1970 నేపథ్యంలో ఈ సినిమా కథనం సాగుతుందని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో యశ్ పేర్కొన్నారు. ఈ సినిమా ప్రధానాంశం తండ్రిపై కొడుకు ప్రతీకారమే అయినా, క్లైమాక్స్‌లో వీరిద్దరూ కలిసి మెయిన్ విలన్‌ను ఓ ఆటాడిస్తారట. మరి... ఈ సినిమా కథనం ఇలానే సాగుతుందా? అనే విషయంపై క్లారిటీ రావాలంటే మాత్రం ఆగస్టు 26 వరకు ఎదురు చూడాల్సిందే. ఎందుకంటే... ఈ సినిమా ఆ రోజే విడుదల కానుంది. ఈ సినిమా ట్రైలర్‌ను ఆగస్టు 8న రిలీజ్ చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారనే ప్రచారం సాగుతోంది.ఇక ఈ చిత్రంలో గంగ పాత్రలో నయనతార, నాడియాగా కియారా అద్వానీ, రెబెక్కా రోల్లో తారా సుతారియా, మెలిస్సాగా రుక్మిణి వసంత్ నటించారు. ఈ చిత్ర దర్శకురాలు గీతూ మోహన్‌దాస్‌తో కలిసి ఈ సినిమాకు కథ అందించారు యశ్. కేవీఎన్ ప్రోడక్షన్స్, మాన్స్టర్ మైండ్ క్రియేషన్స్ పతాకాలపై వెంకట్ కె. నారాయణ, యశ్ ఈ సినిమాను నిర్మించారు. సంజయ్ విశ్వనాథ్ సూర్య హీరోగా నటించిన తాజా సినిమా ‘విశ్వనాథ్ అండ్ సన్స్’. టైటిల్లోనే ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ ఉండటం, ఈ చిత్రంలో సంజయ్ విశ్వనాథ్ పాత్రలో సూర్య నటించారు. అలాగే ఈ సినిమా నుంచి విడుదలైన ఫస్ట్ లుక్స్ కూడా ఈ చిత్రంలో సూర్య చేసినది ఫాదర్ రోల్ అని స్పష్టం చేస్తున్నాయి. మరి... సంజయ్ విశ్వనాథ్‌గా తండ్రి పాత్రలో సూర్య ఎలా నటించారు? ఈ పాత్ర చుట్టూ అల్లుకున్న ఎమోషనల్ బాండింగ్స్ ఏంటి? అన్న అంశాలు తెలియాలంటే ఆగస్టు 15 వరకు ఎదురు చూడాల్సిందే. ఎందుకంటే... ఈ సినిమా ఆ రోజే విడుదల కానుంది. వెంకీ అట్లూరి దర్శకత్వంలో సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించారు. ఈ చిత్రంలో రాధికా శరత్ కుమార్, రవీనా టాండన్ కీలక పాత్రల్లో నటించగా, హీరోయిన్గా మమితా బైజు నటించారు. తాజాగా ఈ సినిమా నుంచి వెడ్డింగ్ సాంగ్ రిలీజ్ చేశారు.⇒ కార్తీ కెరీర్‌లోని సూపర్ హిట్ చిత్రాల్లో ‘ఖైదీ’ ఒకటి. ఈ సినిమాలో ఢిల్లీ పాత్రలో కార్తీ అద్భుతమైన నటన కనబరచారు. పదేళ్ల పాటు జైలు జీవితం గడిపి, తన కుమార్తె అముదను కలసుకునేందుకు ఢిల్లీ తిరిగి వస్తాడు. మరి... ఈ తండ్రీకూతుళ్ల కథ ఏంటి? ఢిల్లీ భార్యకు ఏం జరిగింది? డ్రగ్స్ మాఫియా నుంచి అముదకు పొంచి ఉన్న ప్రమాదాన్ని ఢిల్లీ ఏ విధంగా అడ్డుకుంటాడు? అన్న ఆసక్తికరమైన అంశాలను ‘ఖైదీ 2’ చిత్రంలో చూడాలి. డ్రీమ్ వారియర్ పిక్చర్స్ పతాకంపై ఏఆర్ ప్రభు, ఎస్.ఆర్. ప్రకాష్ ఈ సినిమాను నిర్మించనున్నారు. లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలోని లోకేష్ సినిమాటిక్ యూనివర్స్‌లో భాగంగా రూపొందిన ‘ఖైదీ’ సినిమా సీక్వెల్ ‘ఖైదీ 2’ కూడా రానుంది. ప్రస్తుతం అల్లు అర్జున్‌తో సినిమా చేసే పనిలో ఉన్నారు లోకేష్. ఈ సినిమా పూర్తయిన తర్వాత ‘ఖైదీ 2’ సినిమా చిత్రీకరణను షురూ చేస్తారు కార్తీ, లోకేష్.⇒ మదర్ సెంటిమెంట్‌తో ‘బిచ్చగాడు’ సినిమా తీసి, బ్లాక్‌బస్టర్ అందుకున్నారు విజయ్ ఆంటోనీ. తాజాగా ఆయన ఫాదర్ సెంటిమెంట్‌తో చేస్తున్న సినిమా ‘నాన్న కుట్టి’. ప్రీతి అస్రాని, లిథన్య, భగవతి పెరుమాళ్, హరిప్రియ ఇసై, చిత్ర లక్ష్మణన్ ఈ సినిమాలోని ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ము. మారన్ దర్శకత్వంలో మీరా విజయ్ ఆంటోనీ ఈ సినిమాను నిర్మిస్తుండగా, రామాంజనేయులు జవ్వాజీ సహ–నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఇటీవలే ఈ సినిమా ఫస్ట్ లుక్‌ను రిలీజ్ చేశారు. త్వరలోనే ఈ సినిమా రిలీజ్ డేట్‌ను ప్రకటించనున్నారు. ఇలా తండ్రి భావోద్వేగాలతో కూడిన సినిమాలు మరికొన్ని ఉన్నాయి. అలాగే తల్లి ఎమోషన్‌తో కూడిన సినిమాలు కూడా ఉన్నాయి. – ముసిమి శివాంజనేయులు -
ప్లీజ్ మమ్మీ ఆపండి.. అమెరికా స్కూల్లో వింత ప్రవర్తన..
వాషింగ్టన్: అమెరికాలోకి ఎలిమెంటరీ పాఠశాలలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. చిన్నారుల గ్రాడ్యుయేషన్ డే సందర్భంగా అక్కడికి వచ్చిన పేరెంట్స్ మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో, ఇది కాస్తా కొట్లాటకు దారి తీసింది. పేరెంట్స్ ఫైటింగ్ కారణంగా చిన్నారులు భయంతో ఏడుస్తూ.. వారిని ఆపే ప్రయత్నం చేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.వివరాల ప్రకారం.. అమెరికాలో ఆర్కాన్సాస్ రాష్ట్రంలోని వెస్ట్ మెంఫిస్ నగరంలో ఉన్న ఫాల్కీ ఎలిమెంటరీ స్కూల్లో.. ఈనెల 28వ తేదీన గ్రాడ్యుయేషన్ డే వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సదరు స్కూల్ యాజమాన్యం చిన్నారులు సహా వారి తల్లిదండ్రులకు ఆహ్వానం కల్పించారు. ఈ క్రమంలో పిల్లలతో పాటుగా వారి పేరెంట్స్ పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. అనంతరం, కార్యక్రమం జరుగుతుండగా.. కొందరు మహిళల మధ్య ఏదో విషయంలో వాగ్వాదం మొదలైంది.దీంతో, మాటాలమాటా పెరిగి.. గొడవ పెద్దదిగా మారింది. ఆగ్రహంతో రగిలిపోయిన పేరెంట్స్.. ఒకరిపై ఒకరు దాడులు చేసుకున్నారు. వారిని నిలువరించేందుకు ప్రయత్నించిన ఇద్దరు పురుషులు కూడా కొట్టుకునే స్థాయికి చేరుకుంది. ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాలేదు. ఈవెంట్లో పేరెంట్స్ గొడవపడటంతో చిన్నారులు భయాందోళనకు గురయ్యారు. కన్నీరుపెట్టుకుంటూ వారిని ఆపివేసే ప్రయత్నం చేసినప్పటికీ ఫలించలేదు.Brawl breaks out after a Kindergarten Graduation at West Memphis’ Faulk Elementary. Children can be heard screaming “Stop” to the adults. <- Read that again. The news reported that the “Police are investigating the situation further.” 🙄 pic.twitter.com/PL43g2zZdx— The Facts Dude (@The_Facts_Dude) May 30, 2025మరోవైపు.. ఈ ఘటనను సదరు పాఠశాల యాజమాన్యం ఖండించింది. ఇటువంటి ప్రవర్తన కరెక్ట్ కాదని ఆగ్రహం వ్యక్తం చేసింది. బాధ్యులపై చర్యలు తప్పవని స్పష్టం చేసింది. విద్యార్థులు, సిబ్బంది రక్షణ, పాఠశాల ప్రాంగణం భద్రత మొదటి ప్రాధాన్యం అని.. ఈ వ్యవహారంలో పోలీసుల దర్యాప్తునకు పూర్తిగా సహకరిస్తామని పేర్కొంటూ ఓ ప్రకటన విడుదల చేసింది. దీంతో, ఈ ఘటన స్థానికంగా హాట్ టాపిక్‌గా మారింది. వీరికి గొడవకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. -
ప్లేఫుల్ పేరెంట్స్
డ్రెస్సింగ్ స్టైల్స్‌లో గానీ.. అదిరిపోయే స్టెప్స్‌లో గానీ మాకు మేమే సాటి అన్నట్టుగా కనిపిస్తున్నారు.. డ్యాన్స్ ఫ్లోర్ మీద వారిద్దరినీ చూస్తే కళ్లు తిప్పుకోలేకపోయారు..‘హేయ్, నీకు తెలుసా? వాళ్లిద్దరూ మామ్ అండ్ సన్ అట’... అంటూ వింతగా చెప్పుకుంటున్నారు. నగరంలో ఇలాంటి నృత్యాలు నిత్య కృత్యాలుగా మారుతున్నాయి. అహాలను వదిలేస్తున్న తల్లిదండ్రులు, పిల్లలకు నమ్మలేనంత స్నేహాల్ని పంచుతున్నారు. నేను తండ్రిని కాబట్టి నా మాట వినాలి.. నేను తల్లిని కాబట్టి నాకు విలువ ఇవ్వాలి.. అంటూ పిల్లల మీద అజమాయిషీ చేస్తే.. చెల్లుబాటయ్యే కాలం కాదిది. పిల్లలపై పెత్తనం చెలాయించాలని కాకుండా వాళ్లలో తమ పట్ల స్నేహమనే విత్తనం మొలకెత్తాలని తల్లిదండ్రులు తపిస్తున్నారు. దానికి పలు కారణాలు కనిపిస్తున్నాయి. స్నేహసిరి.. ఉభయకుశలోపరి..‘మా అబ్బాయితో స్నేహం వల్ల నాకు వయసు రోజు రోజుకూ తగ్గిపోతున్నట్టు అనిపిస్తోంది’ అని చెప్పారు లోయర్ ట్యాంక్ బండ్ నివాసి అలీసాగర్. ఆరుపదుల వయసుకు చేరువలో అలీ సాగర్ (58).. తన వయసులో సగం కూడా లేని కుమారుడు అమ్మార్ (28)తో కలిసి దాదాపు అన్ని సరదాలూ పంచుకుంటారు. ‘పబ్స్‌కి వెళతాం, షటిల్ ఆడతాం, మూవీస్, వెబ్‌సిరీస్ చూస్తూ వాటి గురించి బోల్డ్‌గా చర్చించుకుంటాం..’ అంటూ చెప్పుకుంటూ పోయే అలీసాగర్ మాటల్ని ఆపొచ్చేమో గానీ.. ఆయన తన కుమారుడితో కలిసి చేసే బైక్ టూర్స్‌ను మాత్రం ఆపలేం. నగరం నుంచి బెంగుళూర్, ముంబయి.. తదితర నగరాలకు ఇద్దరూ కలిసి బైక్స్‌పై ఝామ్మని దూసుకుపోతుంటారు. హిందుస్తాన్ రాయల్ బుల్లెటీర్స్ క్లబ్ సభ్యులు కూడా. తరాలకు అతీతంగా వరి్థల్లుతున్న ఈ స్నేహం.. పెద్దవాళ్లకు వృద్ధాప్యాన్ని దూరం చేస్తుంటే.. యువతకు అవసరమైన పరిణితిని అందిస్తోంది. సన్నిహితమైతేనే..హితం.. ‘మా అబ్బాయి విధాన్కి నన్ను మించిన ఫ్రెండ్ ఎవరూ లేరు’ అంటూ సగర్వంగా చెబుతారు ఈస్ట్ మారేడ్‌పల్లి నివాసి సుశీలా బొకాడియా. పబ్స్‌లో కావచ్చు, పేజ్ త్రీ పారీ్టస్లో కావచ్చు.. ఈ తల్లీ కొడుకులు ఇద్దరూ సెంటరాఫ్ అట్రాక్షన్‌గా నిలుస్తుంటారు. పిల్లల పట్ల స్నేహ హస్తం చాస్తున్న ఆధునిక తల్లిదండ్రుల వైఖరికి సుశీల అచ్చమైన నిదర్శనంగా నిలుస్తారు. ‘తన వ్యక్తిగత విషయాలు నాతో పంచుకునేటప్పుడు నన్ను క్లోజ్ ఫ్రెండ్‌లా భావిస్తాడు’ అని చెబుతారామె. ఖచి్చతంగా ఇలాంటి భావన తమ పిల్లల్లో స్థిరపడడానికే పేరెంట్స్ ఇలా తమను తాము మలచుకుంటున్నారని చెప్పొచ్చు.నేర్పుగా..నేస్తంగా.. ‘పిల్లలతో గ్యాప్ ఉండకూడదంటే స్నేహం చేయాలి. వీలైనంత వరకూ వారితో ఆటలు, పాటలతో సరదాగా గడుపుతా’ అంటున్నారు బంజారాహిల్స్‌లో నివసించే ప్రముఖ రియల్ ఎస్టేట్ కంపెనీ సుచిర్ ఇండియా అధినేత లయన్ డా.వై.కిరణ్. వ్యాపార వ్యవహారాలతో బిజీగా గడిపే ఆయన తన కుమార్తెలు రూపాలీ, దీప్శిఖలతో గడిపే సమయం మాత్రం అమూల్యం అంటారు. ‘పిల్లలకు ఏ రకమైన మంచి నేర్పాలన్నా నేస్తంగా మారడం ఒక్కటే మార్గం’ అని స్పష్టం చేస్తున్నారు. ఆయనలాగే చాలా మంది తల్లిదండ్రులు తమ పిల్లలకు తాము ఏదైనా నేర్పడానికి నేస్తాలుగా మారడాన్నే ఏకైక మార్గంగా ఎంచుకుంటున్నారు. -
కలెక్టర్‌నైనా అమ్మానాన్నకు బిడ్డనే..
అమృతాన్ని పంచేది అమ్మ.. అనురాగాన్ని అందించేది నాన్న.. బాల్యంలో చందమామ రావే అంటూ ఆకాశమే హద్దుగా అమ్మ చేసే ఉపదేశం, నాన్న గుండెలపై ఆడుకున్న క్షణాలు మనిషి జీవితంలో చెరగని జ్ఞాపకాలు. బిడ్డల ఆనందమే తమ ఆనందంగా భావిస్తారు తల్లిదండ్రులు.. వారి ప్రేమ, ఆప్యాయత, అనురాగం వెల కట్టలేనివి. ఈ లోకంలో మంచివాళ్లు.. చెడ్డవాళ్లు ఉంటారేమో గానీ.. ఎంత వెతికినా.. ప్రేమ లేని అమ్మ.. బాధ్యత లేని నాన్న ఉండరు. అందుకే పిల్లలపై వారి ప్రేమ అపూర్వమైనది.. అసాధారణమైనది. తల్లి జన్మనిస్తే.. ఆ జన్మకు సార్థకత చేకూర్చేందుకు నిత్యం శ్రమించే వ్యక్తి తండ్రి. పిల్లల ప్రతి మలుపులో.. ప్రతి బాధలో.. గెలుపులో తోడుగా నిలిచేది వారే. అందుకే తల్లిదండ్రులు ప్రత్యక్ష దైవాలు.. నేడు నేషనల్ పేరెంట్స్ డే సందర్భంగా సాక్షి ప్రత్యేక కథనం.. –సాక్షి ప్రతినిధి, కడప తల్లిదండ్రులందరికీ పేరెంట్స్‌డే శుభాకాంక్షలు. ఈ సందర్భంగా మా తండ్రి డాక్టర్ విజయ్‌కుమార్ (గైనకాలజిస్ట్ కమ్ ఎండోస్కోపిక్ సర్జన్), ప్రభుత్వ వైద్యునిగా రిటైర్డ్, తల్లి పద్మజలను గుర్తు చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది. చిన్నప్పటి నుంచి చదువుకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చారు. లైఫ్‌లో ఎప్పుడూ ఒత్తిడి లేకుండా చూశారు. ‘నీ ఇష్టమైనదే చదువు. అందుకోసమే సన్నద్ధమై లక్ష్యం సాధించాలి’ అని చెప్పేవారు.కష్టపడితేనే సుఖం ఉంటుందని మార్గనిర్దేశం చేసేవారు. విమానంలో వెళ్లే స్థోమత ఉన్నా రైళ్లోనే ప్రయాణించమని చెప్పేవారు. ఏసీ కోచ్‌లో వెళ్లే అవకాశం ఉన్నా స్లీపర్‌లోనే పంపేవారు. కార్లున్నా ఆటోలోనే వెళ్లమనేవారు. ఏ పనైనా మనం చేసి చూపించిన తర్వాతనే అవతలి వాళ్లకు చెప్పి చేయించుకోవాలనేవారు. నా ఉద్యోగంలో నేను ఇప్పటికీ అదే పాటిస్తాను. నాన్న స్ట్రిట్...అమ్మ గారాబం. పరిస్థితి బ్యాలెన్స్‌గా ఉండేది. నేను ఒక జిల్లాకు కలెక్టర్ అయినా అమ్మానాన్నల బిడ్డనే. రోజూ ఫోన్లో మాట్లాడతారు...టైంకు భోం చేశావా అని అడుగుతారు. ఆరోగ్యం జాగ్రత్త అంటారు... ప్రతి ఒక్కరూ తల్లిదండ్రులను గౌరవించుకోవాలి. వారు లేకపోతే పెద్దవారు లేరన్న భరోసా పోతుంది. వారికి ఏమి కావాలో చూసుకోవాలి. మేము మీకు ఉన్నామన్న భరోసా కల్పించాలి. అప్పుడే వారు ఎక్కువ కాలం మనతో ఉంటారు. తల్లిదండ్రులు బిడ్డల కోసం పరితపిస్తుంటారు.. పిల్లలు పుట్టగానే ఉజ్వల భవిష్యత్తు కళ్లముందే సాక్షాత్కరిస్తున్నట్లు కలగంటారు. జీవితంలో క్షణం తీరిక లేకుండా బిడ్డల అభివృద్ధి కోసం రెక్కలు ముక్కలు చేసుకుంటారు. గొప్పవాళ్లుగా తీర్చే ప్రయత్నంలో పుస్తెలు తాకట్టు పెట్టి, ఫీజులు కట్టిన తల్లులు ఉన్నారు. రక్తాన్ని స్వేదంగా మార్చి వారిని ఉన్నతంగా తీర్చిదిద్దిన నాన్నలెందరో ఉన్నారు. మనకు జన్మనిచ్చి.. నిలబడటానికి ఆసరా ఇచ్చి.. తలెత్తుకు తిరగడానికి ఇంత మంచి జీవితాన్నిచ్చిన తల్లిదండ్రుల రుణం ఏమిచ్చి తీర్చుకోగలం! వృద్ధాప్యంలో ఒంటరిగా ఉన్నామనే భావన వారిలో కలగకుండా చూసుకుంటే చాలు కదా! అదే పిల్లల నుంచి తల్లిదండ్రులు కోరుకునేది. ఉద్యోగ రీత్యా మనం ఎంత బిజీగా ఉన్నా.. రోజుకు ఒక్కసారి, ఒక్క నిమిషం పలకరించినా కన్నవారు సంతోషిస్తారు. మన భవిష్యత్తుకు బంగారు బాటలు వేసిన అమ్మా నాన్నలు.. నిజంగా అమృత మూర్తులే. అందుకే మన పురాణాలు ‘మాతృ దేవోభవ... పితృదేవోభవ’అంటూ ఉపనిషత్తులు దేవతల స్థాయినిచ్చి గౌరవించాయి. ఆదివారం నేషనల్ పేరెంట్స్‌డే సందర్భంగా ప్రముఖుల తల్లిదండ్రుల గురించి వారి మాటల్లోనే... –సాక్షి నెట్వర్క్, కడప తల్లిదండ్రులతో ఎస్పీ అన్బురాజన్(ఫైల్) తోడు–నీడలా అమ్మానాన్న మాది తమిళనాడు రాష్ట్రంలోని కోయంబత్తూరు. నేను నాల్గవ తరగతి చదివేప్పుడు ఇతరుల పొలంలోని టెంకాయ చెట్టు ఎక్కి కాయ కోసుకుని తిన్నదీ గుర్తే....అప్పుడు తోట వాచ్మెన్ వచ్చి అరవడంతోపాటు మా నాన్న(కు) నాగేంద్రకుమార్‌కు ఫిర్యాదు చేశాడు. ఇంటికి తెచ్చి థర్డ్ డిగ్రీ చూపించారు. అప్పటి నుంచి తప్పు చేయకూడదని నిర్ణయించుకున్నాను. తొమ్మిదో తరగతిలో కోయంబత్తూరులో ఐఏఎస్, ఐపీఎస్ (సివిల్స్)కు ప్రిపరేషన్ గురించి అవగాహన సదస్సు జరిగింది. దానికి కలెక్టర్, కమిషనర్లతో పెద్ద స్థాయి అధికారులు హాజరయ్యారు. మా నాన్న హెడ్మాస్టర్ కావడంతో నన్ను ఒక మంచి స్థాయిలో నిలుపాలన్న ఆశయంతో అక్కడికి తీసుకెళ్లి నాలో స్ఫూర్తి రగిలించారు. సివిల్స్‌లో మూడుసార్లు దగ్గరగా వచ్చి మిస్ అయిన సందర్భంలో అమ్మ షణ్ముగవల్లీ (టీచర్) చూపిన ఆదరణ ఎప్పటికీ మరిచిపోలేను. బాధలో ఉన్న నాకు ఆమె వెన్నంటే ఉండడంతోపాటు ఓదారుస్తూ మళ్లీ సివిల్స్‌లో నిలబడేలా చేసింది. ఆమె చూపిన ప్రోత్సాహం.... నాన్న స్ఫూర్తి నన్ను ఈ స్థాయిలో నిలబెట్టాయి. తల్లిదండ్రులు ఇద్దరినీ మరిచిపోలేను. పేరెంట్స్‌డే సందర్భంగా తల్లిదండ్రులందరికీ శుభాకాంక్షలు. – కేకేఎన్ అన్బురాజన్, ఎస్పీ, కడప మా కోసం నాన్న దూరంగా గడిపేవారు... మాది రాజస్తాన్‌లోని జయపూర్.. నాన్న జశ్రాం మర్మట్ సీజీఎస్టీలో సూపరింటెండెంట్..అమ్మ విమల గృహిణి..కుటుంబాన్ని నడపడానికి నాన్న చాలా కష్టపడేవారు. పెద్ద కుటుంబం మాది. కష్టపడి పనిచేయడం ద్వారా ముందుకు వెళ్లాలనేది నాన్న మనస్తత్వం. జీవన గమనంలో ఆయన ఎన్నో ఎత్తుపల్లాలు చూశారు. ఎనిమిదేళ్లపాటు ఒంటరిగా వేరే రాష్ట్రంలో ఉన్నారు. ఎందుకంటే నేను సివిల్స్...చెల్లి ఐఐటీ కోచింగ్ కోసం ప్రిపేరవుతుంటే అమ్మ మాతో ఉండేది. మాకు ఎలాంటి ఇబ్బందులూ రాకుండా చూసుకునేది. తరచూ మా ఇద్దరికీ మానసిక స్థైర్యాన్ని నూరిపోస్తూ ఉండేది. పెద్ద కుటుంబంలో నాన్న ఒక్కరిదే సంపాదన. మా అవసరాలకు ఎప్పుడూ ఇబ్బంది కలగకుండా చూసుకునేవారు. మా చదువుల సమయంలో వారెన్నో సమస్యలు ఎదుర్కొన్నారు. నాన్న, అమ్మ తోడ్పాటుతో ఐఎఎస్(2019 బ్యాచ్)కు ఎంపికయ్యాను. తొలిసారి అసిస్టెంట్ కలెక్టర్‌గా కడపకు వచ్చాను. తల్లిదండ్రులు ఎప్పుడూ పిల్లలతో సన్నిహితంగా ఉండాలి.. స్నేహితుల మాదిరిగా కలిసిపోతే ఇబ్బందులు ఎదురుకావు. పిల్లలతో మాట్లాడుతుండాలి. వారి అభిరుచులు..ఆకాంక్షలను గుర్తించగలిగాలి.. అలా చేస్తే పిల్లలకు మానసిక ఒత్తిడి ఉండదని నా అభిప్రాయం. మా తల్లిదండ్రులు ఇలానే చేశారు. జీవితం ఒక్కసారే వస్తుంది..దాన్ని ఆనందమయంగా మలుచుకోవాలని మా అమ్మ చెప్పే మాటలు నాకు ఎప్పుడూ గుర్తొస్తాయి. -వికాస్ మర్మట్, అసిస్టెంట్ కలెక్టర్, కడప అమ్మ ఆదర్శం.. నాన్న లక్ష్యం మాది రేణిగుంట మండలంలోని ఓ గ్రామం. నాన్న ఎం.సూర్యప్రకాశ్‌రెడ్డి పారిశ్రామికవేత్త. కుటుంబంలో ఒకరిని అయినా ఉన్నత స్థానంలో నిలపాలని కలలు గన్నారు. అందుకు అనుగుణంగా నాన్న సోదరుడిని ఐఏఎస్‌లో పెద్ద స్థానంలో నిలబెట్టారు. అయితే మా కుటుంబంలోనూ ఒకరైనా ఉండాలన్న తలంపు నాన్నలో బలంగా ఉండింది. నన్ను సివిల్స్ వైపు నడిపించారు. ఆ రోజుల్లో సివిల్స్ త్రుటిలో మిస్సయినా తర్వాత గ్రూప్–1లో స్థానం సాధించాను. నాన్న లక్ష్యమంతా కూడా ప్రభుత్వ సంస్థలో ఉన్నతాధికారిగా ఉండి పేద వర్గాలకు సేవ చేసే అవకాశం లభిస్తుందని సివిల్స్ వైపు ప్రోత్సహించారు. అమ్మ సావిత్రి కూడా ఆడపిల్లలు ఆర్థికంగా బాగుండాలని చెబుతూ ఉండేది. అందుకు చదువే ముఖ్యం అని చెప్పేవారు. ఐఏఎస్ క్యాడర్ వచ్చిన తర్వాత బాధ్యతలు పెరిగాయి. భర్త రోహిత్ కూడా అండగా నిలిచారు. మా బాగు కోసం పరితపించిన కుటుంబ పెద్దలను ఎప్పటికీ మరిచిపోలేను. ఇప్పటికీ తల్లిదండ్రులు చూపిన దారిలోనే పయనిస్తున్నాను. – ఎం.గౌతమి, జాయింట్ కలెక్టర్, కడప పేరెంట్స్‌ను బాగా చూసుకోవాలి మా తండ్రి చంద్రకాంత్‌వర్మ (మద్రాసు ఫర్టిలైజర్స్ లిమిటెడ్ మార్కెటింగ్ విభాగంలో పనిచేసేవారు). తల్లి జ్ఞానేశ్వరి (రిటైర్డ్ స్కూలు టీచర్). ఇద్దరూ నన్నెంతగానో ప్రోత్సహించారు. నేను అనుకున్న లక్ష్యాన్ని సాధించే క్రమంలో మా తల్లి గారు మరింత మద్దతు పలికారు. ఇంజనీరింగ్ ఐఐటీలో చేశాను. సాఫ్ట్వేర్ ఉద్యోగానికి రాజీనామా చేసి ఇంటిలో ఉంటూ సివిల్స్‌కు ప్రిపేర్ అయ్యాను. ఆ సమయంలో మా తండ్రి నాకు అవసరమైన పుస్తకాలు, ఇతరత్రా సామగ్రిని అందించేవారు. అమ్మ నన్ను అనుక్షణం జాగ్రత్తగా చూసుకుని మరింతగా ప్రోత్సహించారు. తల్లిదండ్రుల ప్రోత్సహంతోనే నేను ఈ స్థాయికి వచ్చాను. ప్రతి ఒక్కరూ తల్లిదండ్రులను గౌరవించాలి. వారిని బాగా చూసుకోవడం మన బాధ్యత. అది చేయలేనపుడు ఏం సాధించినా ఉపయోగం లేదు. తల్లిదండ్రులను చూసుకోలేని వాడు దేనికీ పనికి రాడు. –సాయికాంత్‌వర్మ, జేసీ (అభివృద్ధి), కడప వారి కష్టం మాకు రాకూడదని... మాది వేంపల్లె మండలం రామిరెడ్డిగారిపల్లె. దిగువ మధ్యతరగతికి చెందిన సన్నకారు రైతుకుటుంబం. మా తల్లిదండ్రులు ఓబుల్‌రెడ్డి, గంగమ్మలకు మేము ముగ్గురు సంతానం. నేను పెద్దవాడిని, నాతరువాత తమ్ముడు, చెల్లెలు. అప్పట్లో మా పరిస్థితులు ఎలా ఉండేవంటే స్టోరు బియ్యం ఎప్పుడు ఇస్తారా ? అని ఎదురు చూసేవాళ్లం. మాకోసం అమ్మా, నాన్నలు చాలా కష్టపడేవారు. నేను ఇంటర్లో ఉండగా నాన్న చనిపోయారు. అప్పుడు మా చదువు బాధ్యతలను అమ్మ తన భుజస్కంధాలపైన వేసుకుంది. వ్యవసాయం చేసే అమ్మ అతికష్టం మీద చదివించింది. మా పెద్దనాన్న కూడా మాకు సహకరించారు. పిల్లలు సుఖంగా బతకడం కోసం తల్లిదండ్రులు పడే కష్టాన్ని స్వయంగా చూశాను. పీజీ చివరి సంవత్సరంలో అమ్మ కూడా చనిపోయింది. ఎంఏ ఎకనామిక్స్ పూర్తయ్యాక ఉద్యోగం ఇప్పించమని దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్‌రెడ్డి వద్దకు వెళ్లాను. ఆయన గ్రూప్స్ రాయమని సలహా ఇచ్చారు. ఆ సమయంలో నా ఆర్థిక పరిస్థితి గురించి చెప్పాను. గ్రూప్స్ ప్రిపరేషన్‌కు అయ్యే ఖర్చుల విషయాలన్ని వైఎస్సార్ చూసుకున్నారు. ఫలితంగా ఇప్పుడు నేను ఆర్డీఓగా పనిచేస్తున్నాను. చిన్న ఉద్యోగం వస్తే చాలనుకున్న తల్లిదండ్రులు నేను ఈస్థాయికి చేరుకోక ముందే కాలం చేయడం నన్ను ఎప్పటికీ బాధిస్తుంటుంది. ఎప్పుడూ తల్లిదండ్రుల మనస్సు నొప్పించకండి. –ధర్మచంద్రారెడ్డి, ఆర్డీఓ, రాజంపేట విలువలే పునాదిగా పెంచారు.. మా తల్లిదండ్రులు లక్ష్మిదేవి, గోవిందరెడ్డి (విశ్రాంత ఎల్ఐసీ మేనేజర్) విలువలే పునాదిగా పెంచారు. మనకు ఉన్న దాంట్లో పదిమందికి సాయం చేయడం నేర్పారు. ప్రాథమిక, మాధ్యమిక, ఇంటర్ విద్య అంతా ప్రభుత్వ విద్యాసంస్థల్లోనే పూర్తిచేశాను. మా ఇంట్లో నాతో పాటు మా బంధువులు, తెలిసిన వారు కూడా కలిసిమెలిసి చదుకునేవాళ్లం. అందరినీ అమ్మ బాగా చూసుకునేది. 1984లో ఇంజినీరింగ్‌లో మహిళలు చదవడం తక్కువగా ఉండేది. నాకు ఎంతో ఇష్టమైన ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ చదవాలనుకున్న సమయంలో తల్లిదండ్రులు బాగా ప్రోత్సహించారు. 1984–88 విద్యాసంవత్సరంలో ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్‌లో ఏకైక మహిళా విద్యార్థిని. తల్లిదండ్రుల ప్రోత్సాహంతోనే 27 సంవత్సరాలకు పైగా బోధనా రంగంలో రాణించగలిగాను. ప్రస్తుతం వైవీయూకు వైస్ చాన్సలర్‌గా ఉన్నతస్థానంలో ఉన్నామంటే మా తల్లిదండ్రులు నేర్పిన జీవితపాఠాలే మార్గదర్శకం. వారు నేర్పిన విలువలనే మా పిల్లలకు కూడా నేర్పుతున్నాం. ఇప్పటికీ తల్లిదండ్రులతో కలిసి ఉంటున్నాం. – ఆచార్య మునగాల సూర్యకళావతి, వైస్ చాన్సలర్, వైవీయూ తల్లిదండ్రుల రుణం తీర్చుకోలేనిది మా సొంతూరు పుల్లంపేట మండలం వత్తలూరు. అమ్మ కృష్ణవేణి, నాన్న రామ్మోహన్‌రాజు. అమ్మ, నాన్న ఇద్దరు ప్రభుత్వ టీచర్లు. చిన్నప్పటి నుంచి మమ్మల్ని క్రమశిక్షణగా పెంచారు. మా తల్లిదండ్రులకు మేము ముగ్గురు సంతానం. నేను చివరి వాడిని. మా ముగ్గురినీ ప్రయోజకుల్ని చేయాలని అమ్మా, నాన్న బాగా తపన పడ్డారు. చిన్నప్పుడు బడిలో అమ్మ, నాన్న వద్దనే మేము చదువుకున్నా, అందరి పిల్లల్లానే మమ్మల్ని చూసేవారు. చదవకుంటే కొట్టేవారు. అప్పట్లో అమ్మ, నాన్నకు తక్కువ జీతాలు అయినా మాలో ఎవరికీ చిన్నలోటు కూడా చేయలేదు. పెద్దన్నయ్య చక్రధర్‌రాజు ప్రభుత్వ ఉపాధ్యాయుడు, రెండో అన్నయ్య శశిధర్‌రాజు విద్యుత్‌శాఖలో సబ్ఇంజనీర్, నేను రాష్ట్ర వ్యాయామ విద్య తనిఖీ అధికారిగా పనిచేస్తున్నాను. ఇప్పుడు ముగ్గురం అన్నదమ్ములం రాజంపేటలో ఒకేచోట నివాసముంటున్నాం. నాన్న కొన్నేళ్ల క్రితం చనిపోయారు. మా ఉన్నతిని చేసిన ఆయన ఎంతో సంతోషించారు. అమ్మకు ఏలోటు రానివ్వకుండా కంటికి రెప్పాలా చూసుకుంటున్నాం. -ఈ.భానుమూర్తిరాజు, రాష్ట్ర వ్యాయామ విద్య తనిఖీ అధికారి ప్రతి అడుగులోనూ వారి శ్రమే.. నాపేరు రాచకుంట నాగరాజు. నేను కోడూరులోని అనంతరాజుపేట వైఎస్సార్ ఉద్యాన పరిశోధనస్థానంలో హెడ్‌గా విధులు నిర్వస్తిన్నా. సొంతూరు పులివెందుల. నాన్న ఇడుపులపాయ ఎస్టేట్‌లో మేనేజర్‌గా పనిచేసేవారు. మాది చిన్న వ్యవసాయ కుటుంబం. నా ప్రతి అడుగులోనూ తల్లిదండ్రులు రాచకుంట నారాయణ, లక్ష్మీదేవి శ్రమనే కనపడుతుంది. మూడునెలలక్రితం అమ్మ కాలం చేశారు. ఇప్పటికీ వారు పడిన కష్టం, త్యాగం గుర్తుచేసుకుంటూ ఉంటాను. మార్గదర్శకులు మా అమ్మానాన్నలే నా జీవిత ఔన్నత్యానికి మార్గదర్శకులు. నాన్న చిత్తూరు జిల్లాలోని మా గ్రామానికి సర్పంచ్‌గా ప్రజల ఆదరాభిమానాలు పొందారు. అమ్మ గృహిణిగానేగాక నాన్నకు రాజకీయాల్లో స్నేహితురాలిగా ఉంటూ ప్రోత్సహించారు. బిడ్డల బాగోగుల కోసం ఎంత శ్రద్ధ చూపారో గ్రామం అభివృద్దికి కూడా అదే స్థాయిలో కృషి చేశారు. మా గ్రామంలో పాఠశాల ఏర్పాటు చేయించి నన్ను అందులోనే చదివించారు. చదువుకు మించిన ఆస్తి లేదని బోధించారు. కష్టాలు వచ్చినపుడు సవాలుగా స్వీకరించి విజయం సాధించేవారు పట్టువదలవద్దని నూరిపోశారు. చదువు వరకు పాఠశాల గురువులు మార్గదర్శకులైతే నా జీవితానికి ఉపయుక్తమైన మార్గదర్శనం చేసింది అమ్మా నాన్నలే! నాన్న ముగ్గురు ముఖ్యమంత్రుల నుంచి ఉత్తమ సర్పంచ్‌గా అవార్డును స్వీకరించారు. మా దంపతులం కూడా అమ్మనాన్నను ఆదర్శంగా తీసుకున్నాం. – శంకర్ బాలాజీ, అసిస్టెంట్‌కమిషనర్, జిల్లా దేవదాయశాఖ తల్లిదండ్రుల ప్రోత్సాహం వల్లే... తమ పిల్లలు ఉన్నత స్థితిలో ఉండాలని తల్లిదండ్రులు ఎన్నో కలలు కంటారు. వారి కలలను సాకారం చేసినప్పుడే మన జన్మకు సార్థకత లభిస్తుంది. మానాన్న ఎస్ఐగా పనిచేసి రిటైర్డ్ అయ్యారు. నన్ను పోలీస్ డిపార్ట్మెంట్లో అధికారిగా చూడాలన్నది వారి ఆశ. ఈక్రమంలో చదివించేందుకు ప్రోత్సహించారు. నేను కూడా చిన్నప్పటి నుంచి బాగా చదువుకున్నా. మాసొంతూరు నందలూరు. విద్యాభ్యాసం రాజంపేటలోనే సాగింది. ఎంబీఏ హైదరాబాద్‌లో చేశా. ఆ తరువాత గ్రూప్స్ రాసి డీఎస్పీ అయ్యాను. ఇప్పుడు గుంటూరు డీఎస్పీగా పనిచేస్తున్నా. అమ్మా, నాన్నల కోరిక వల్లే నేను ఉజ్వల భవిష్యత్తుకు బాటలు వేసుకున్నా. యూత్‌కి నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నా.. ‘‘ఫస్ట్ తల్లిదండ్రులను ప్రేమించండి, వారిని గౌరవించండి. వారు ఇచ్చే సలహాలు, సూచనలను పెడచెవిన పెట్టవద్దు’’. నిజమైన శ్రేయోభిలాషులు, ఆత్మీయులు తల్లిదండ్రులే. – సుప్రజ, డీఎస్పీ, గుంటూరు –(రాజంపేట టౌన్) -
మాతృదేవోభవ.. పితృదేవోభవ
జన్మనిచ్చిన తల్లీ తండ్రీ, చదువు చెప్పిన గురువూ, ఇంటికొచ్చిన అతిథీ కూడా దైవంతో సమానమే అంది శాస్త్రం. కంటికి కనిపించే ప్రత్యక్ష దైవాలైన తల్లిదండ్రులను బాగా చూసుకుంటే, కంటికి కనిపించని దైవం తప్పకుండా హర్షిస్తాడు. వారి పేరు చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయేట్లు చేస్తాడు. రామాయణంలో కనిపించే శ్రవణకుమారుడి కథే ఇందుకు నిదర్శనం. తల్లిదండ్రుల పట్ల ఎంతటి అంకితభావాన్ని కలిగి ఉండాలో వాల్మీకి మహర్షి శ్రవణ కుమారుని పాత్ర ద్వారా లోకానికి చాటాడు. వయసు మళ్లిన వృద్ధ దంపతులకు జన్మించినవాడే శ్రవణకుమారుడు. వారిద్దరినీ పోషించడం కోసం బాల్యం నుంచే శ్రవణకుమారుడు ఎంతో శ్రమించేవాడు. వారిని ఒకచోటినుంచి మరొకచోటికి తిప్పడం కోసం వారిద్దరినీ కావడిలో కూర్చోబెట్టుకుని భుజంపైన మోసుకుంటూ తీసుకు వెళ్లేవాడు. ఒకసారి వారొక అడవిలో ప్రయాణిస్తుండగా శ్రవణుని తల్లిదండ్రులకు బాగా దాహం వేసింది. వారి దప్పిక తీర్చడం కోసం శ్రవణుడు తనవద్దనున్న ముంత తీసుకుని నీళ్లు తీసుకురావడానికి బయల్దేరాడు. సమీపంలోనే ఒక కొలను కనిపించడంతో నీళ్లకోసమని ఆ ముంతను కొలనునీటిలో ముంచాడు. అదే సమయానికి అడవికి వేటకు వచ్చిన దశరథుడు ఆ శబ్దం విని, అది జింక లేదా ఏనుగు వంటి జంతువు చేసిన శబ్దంగా భ్రమించాడు. తనకు తెలిసిన శబ్దభేది విద్యద్వారా ఆ శబ్దం వచ్చిన దిక్కుగా బాణం వేశాడు. ఆ బాణం కాస్తా శ్రవణ కుమారునికి తగిలి హా అని అరుస్తూ కుప్పకూలిపోయాడు. మనిషి గొంతు విని దశరథుడు పరుగున అక్కడికి వెళ్లాడు. ప్రాణాలు పోయేటప్పుడు కూడా శ్రవణకుమారుడు తన కర్తవ్యాన్ని మరువలేదు. దాహంతో అల్లాడిపోతున్న తన తల్లిదండ్రులకు నీళ్లిచ్చి వారి ప్రాణం నిలపమని దశరథుడికి చెప్పి కన్నుమూశాడు. ఆ తర్వాత జరిగిన కథ అందరికీ తెలిసిందే. తల్లిదండ్రులు ఉండగా వారికి పిడికెడు మెతుకులు పెట్టని ప్రబుద్ధులు కొందరు వారు పోయిన తర్వాత వారి కర్మకాండలు ఘనంగా జరిపించి, లోకానికి తమ ఘనతను చాటుకుంటారు. అలాంటి వారిని దేవుడు మెచ్చడు. తాను ఎంత కష్టపడైనా సరే, చివరి వరకు తల్లిదండ్రులను ప్రేమగా చూసినవారే అసలైన బిడ్డలు. (నేడు పేరెంట్స్ డే )


