అమృతామూర్తులు... తల్లిదండ్రులు

Sakshi Special Article On Occasion Of National Parents Day

అమృతాన్ని పంచేది అమ్మ.. అనురాగాన్ని అందించేది నాన్న.. బాల్యంలో చందమామ రావే అంటూ ఆకాశమే హద్దుగా అమ్మ చేసే ఉపదేశం, నాన్న గుండెలపై ఆడుకున్న క్షణాలు మనిషి జీవితంలో చెరగని జ్ఞాపకాలు. బిడ్డల ఆనందమే తమ ఆనందంగా భావిస్తారు తల్లిదండ్రులు.. వారి ప్రేమ, ఆప్యాయత, అనురాగం వెల కట్టలేనివి. ఈ లోకంలో మంచివాళ్లు.. చెడ్డవాళ్లు ఉంటారేమో గానీ.. ఎంత వెతికినా.. ప్రేమ లేని అమ్మ.. బాధ్యత లేని నాన్న ఉండరు. అందుకే పిల్లలపై వారి ప్రేమ అపూర్వమైనది.. అసాధారణమైనది. తల్లి జన్మనిస్తే.. ఆ జన్మకు సార్థకత చేకూర్చేందుకు నిత్యం శ్రమించే వ్యక్తి తండ్రి. పిల్లల ప్రతి మలుపులో.. ప్రతి బాధలో.. గెలుపులో తోడుగా నిలిచేది వారే. అందుకే తల్లిదండ్రులు ప్రత్యక్ష దైవాలు.. నేడు నేషనల్‌ పేరెంట్స్‌ డే సందర్భంగా సాక్షి ప్రత్యేక కథనం..  
–సాక్షి ప్రతినిధి, కడప

తల్లిదండ్రులందరికీ పేరెంట్స్‌డే శుభాకాంక్షలు. ఈ సందర్భంగా మా తండ్రి డాక్టర్‌ విజయ్‌కుమార్‌ (గైనకాలజిస్ట్‌ కమ్‌ ఎండోస్కోపిక్‌ సర్జన్‌), ప్రభుత్వ వైద్యునిగా రిటైర్డ్, తల్లి పద్మజలను గుర్తు చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది. చిన్నప్పటి నుంచి  చదువుకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చారు. లైఫ్‌లో ఎప్పుడూ ఒత్తిడి లేకుండా చూశారు. ‘నీ ఇష్టమైనదే చదువు. అందుకోసమే సన్నద్ధమై లక్ష్యం సాధించాలి’  అని చెప్పేవారు.కష్టపడితేనే సుఖం ఉంటుందని మార్గనిర్దేశం చేసేవారు. విమానంలో వెళ్లే స్థోమత ఉన్నా రైళ్లోనే ప్రయాణించమని చెప్పేవారు. ఏసీ కోచ్‌లో వెళ్లే అవకాశం ఉన్నా స్లీపర్‌లోనే పంపేవారు. కార్లున్నా ఆటోలోనే వెళ్లమనేవారు. ఏ  పనైనా మనం చేసి చూపించిన తర్వాతనే అవతలి వాళ్లకు చెప్పి చేయించుకోవాలనేవారు. నా ఉద్యోగంలో నేను ఇప్పటికీ అదే పాటిస్తాను. నాన్న స్ట్రిట్‌...అమ్మ గారాబం. పరిస్థితి బ్యాలెన్స్‌గా ఉండేది. నేను ఒక జిల్లాకు కలెక్టర్‌ అయినా అమ్మానాన్నల బిడ్డనే. రోజూ ఫోన్‌లో మాట్లాడతారు...టైంకు భోం చేశావా అని అడుగుతారు. ఆరోగ్యం జాగ్రత్త అంటారు... ప్రతి ఒక్కరూ తల్లిదండ్రులను గౌరవించుకోవాలి.  వారు లేకపోతే పెద్దవారు లేరన్న భరోసా పోతుంది. వారికి ఏమి కావాలో చూసుకోవాలి. మేము మీకు ఉన్నామన్న భరోసా కల్పించాలి. అప్పుడే వారు ఎక్కువ కాలం మనతో ఉంటారు.

తల్లిదండ్రులు బిడ్డల కోసం పరితపిస్తుంటారు.. పిల్లలు పుట్టగానే ఉజ్వల భవిష్యత్తు కళ్లముందే సాక్షాత్కరిస్తున్నట్లు కలగంటారు. జీవితంలో క్షణం తీరిక లేకుండా బిడ్డల అభివృద్ధి కోసం రెక్కలు ముక్కలు చేసుకుంటారు. గొప్పవాళ్లుగా తీర్చే ప్రయత్నంలో పుస్తెలు తాకట్టు పెట్టి, ఫీజులు కట్టిన తల్లులు ఉన్నారు. రక్తాన్ని స్వేదంగా మార్చి వారిని ఉన్నతంగా తీర్చిదిద్దిన నాన్నలెందరో ఉన్నారు. మనకు జన్మనిచ్చి.. నిలబడటానికి ఆసరా ఇచ్చి.. తలెత్తుకు తిరగడానికి ఇంత మంచి జీవితాన్నిచ్చిన తల్లిదండ్రుల రుణం ఏమిచ్చి తీర్చుకోగలం! వృద్ధాప్యంలో ఒంటరిగా ఉన్నామనే భావన వారిలో కలగకుండా చూసుకుంటే చాలు కదా! అదే పిల్లల నుంచి తల్లిదండ్రులు కోరుకునేది. ఉద్యోగ రీత్యా మనం ఎంత బిజీగా ఉన్నా.. రోజుకు ఒక్కసారి, ఒక్క నిమిషం పలకరించినా కన్నవారు సంతోషిస్తారు. మన భవిష్యత్తుకు బంగారు బాటలు వేసిన అమ్మా నాన్నలు.. నిజంగా అమృత మూర్తులే. అందుకే మన పురాణాలు ‘మాతృ దేవోభవ... పితృదేవోభవ’అంటూ ఉపనిషత్తులు దేవతల స్థాయినిచ్చి గౌరవించాయి. ఆదివారం నేషనల్‌ పేరెంట్స్‌డే సందర్భంగా ప్రముఖుల తల్లిదండ్రుల గురించి వారి మాటల్లోనే...  –సాక్షి నెట్‌వర్క్, కడప

తల్లిదండ్రులతో ఎస్పీ అన్బురాజన్‌(ఫైల్‌)

తోడు–నీడలా అమ్మానాన్న 
మాది తమిళనాడు రాష్ట్రంలోని కోయంబత్తూరు. నేను నాల్గవ తరగతి చదివేప్పుడు ఇతరుల పొలంలోని టెంకాయ చెట్టు ఎక్కి కాయ కోసుకుని తిన్నదీ గుర్తే....అప్పుడు తోట వాచ్‌మెన్‌ వచ్చి అరవడంతోపాటు మా నాన్న(కు) నాగేంద్రకుమార్‌కు ఫిర్యాదు చేశాడు. ఇంటికి తెచ్చి థర్డ్‌ డిగ్రీ చూపించారు. అప్పటి నుంచి తప్పు చేయకూడదని నిర్ణయించుకున్నాను. తొమ్మిదో తరగతిలో కోయంబత్తూరులో ఐఏఎస్, ఐపీఎస్‌ (సివిల్స్‌)కు ప్రిపరేషన్‌ గురించి అవగాహన సదస్సు జరిగింది. దానికి కలెక్టర్, కమిషనర్లతో పెద్ద స్థాయి అధికారులు హాజరయ్యారు. మా నాన్న హెడ్మాస్టర్‌ కావడంతో నన్ను ఒక మంచి స్థాయిలో నిలుపాలన్న ఆశయంతో అక్కడికి తీసుకెళ్లి నాలో స్ఫూర్తి రగిలించారు. సివిల్స్‌లో మూడుసార్లు దగ్గరగా వచ్చి మిస్‌ అయిన సందర్భంలో అమ్మ షణ్ముగవల్లీ (టీచర్‌) చూపిన ఆదరణ ఎప్పటికీ మరిచిపోలేను. బాధలో ఉన్న నాకు ఆమె వెన్నంటే ఉండడంతోపాటు ఓదారుస్తూ మళ్లీ సివిల్స్‌లో నిలబడేలా చేసింది. ఆమె చూపిన ప్రోత్సాహం.... నాన్న స్ఫూర్తి నన్ను ఈ స్థాయిలో నిలబెట్టాయి. తల్లిదండ్రులు ఇద్దరినీ మరిచిపోలేను. పేరెంట్స్‌డే సందర్భంగా తల్లిదండ్రులందరికీ శుభాకాంక్షలు. 
– కేకేఎన్‌ అన్బురాజన్,  ఎస్పీ, కడప

మా కోసం నాన్న దూరంగా గడిపేవారు... 
మాది రాజస్తాన్‌లోని జయపూర్‌.. నాన్న జశ్రాం మర్మట్‌ సీజీఎస్‌టీలో సూపరింటెండెంట్‌..అమ్మ విమల గృహిణి..కుటుంబాన్ని నడపడానికి నాన్న చాలా కష్టపడేవారు. పెద్ద కుటుంబం మాది. కష్టపడి పనిచేయడం ద్వారా ముందుకు వెళ్లాలనేది నాన్న మనస్తత్వం. జీవన గమనంలో ఆయన ఎన్నో ఎత్తుపల్లాలు చూశారు. ఎనిమిదేళ్లపాటు ఒంటరిగా వేరే రాష్ట్రంలో ఉన్నారు. ఎందుకంటే నేను సివిల్స్‌...చెల్లి ఐఐటీ కోచింగ్‌ కోసం ప్రిపేరవుతుంటే అమ్మ మాతో ఉండేది. మాకు ఎలాంటి ఇబ్బందులూ రాకుండా చూసుకునేది. తరచూ మా ఇద్దరికీ మానసిక స్థైర్యాన్ని నూరిపోస్తూ ఉండేది. పెద్ద కుటుంబంలో నాన్న ఒక్కరిదే సంపాదన. మా అవసరాలకు ఎప్పుడూ ఇబ్బంది కలగకుండా చూసుకునేవారు. మా చదువుల సమయంలో వారెన్నో సమస్యలు ఎదుర్కొన్నారు. నాన్న, అమ్మ తోడ్పాటుతో ఐఎఎస్‌(2019 బ్యాచ్‌)కు ఎంపికయ్యాను. తొలిసారి అసిస్టెంట్‌ కలెక్టర్‌గా కడపకు వచ్చాను. తల్లిదండ్రులు ఎప్పుడూ పిల్లలతో సన్నిహితంగా ఉండాలి.. స్నేహితుల మాదిరిగా కలిసిపోతే ఇబ్బందులు ఎదురుకావు. పిల్లలతో మాట్లాడుతుండాలి. వారి అభిరుచులు..ఆకాంక్షలను గుర్తించగలిగాలి.. అలా చేస్తే పిల్లలకు మానసిక ఒత్తిడి ఉండదని నా అభిప్రాయం. మా తల్లిదండ్రులు ఇలానే చేశారు. జీవితం ఒక్కసారే వస్తుంది..దాన్ని ఆనందమయంగా మలుచుకోవాలని మా అమ్మ చెప్పే మాటలు నాకు ఎప్పుడూ గుర్తొస్తాయి.  -వికాస్‌ మర్మట్, అసిస్టెంట్‌ కలెక్టర్, కడప

అమ్మ ఆదర్శం.. నాన్న లక్ష్యం
మాది రేణిగుంట మండలంలోని ఓ గ్రామం. నాన్న ఎం.సూర్యప్రకాశ్‌రెడ్డి పారిశ్రామికవేత్త. కుటుంబంలో ఒకరిని అయినా ఉన్నత స్థానంలో నిలపాలని కలలు గన్నారు. అందుకు అనుగుణంగా నాన్న సోదరుడిని ఐఏఎస్‌లో పెద్ద స్థానంలో నిలబెట్టారు. అయితే మా కుటుంబంలోనూ ఒకరైనా ఉండాలన్న తలంపు నాన్నలో బలంగా ఉండింది. నన్ను సివిల్స్‌ వైపు నడిపించారు. ఆ రోజుల్లో సివిల్స్‌ త్రుటిలో మిస్సయినా తర్వాత గ్రూప్‌–1లో స్థానం సాధించాను. నాన్న లక్ష్యమంతా కూడా ప్రభుత్వ సంస్థలో ఉన్నతాధికారిగా ఉండి పేద వర్గాలకు సేవ చేసే అవకాశం లభిస్తుందని సివిల్స్‌ వైపు ప్రోత్సహించారు. అమ్మ సావిత్రి కూడా ఆడపిల్లలు ఆర్థికంగా బాగుండాలని చెబుతూ ఉండేది. అందుకు చదువే ముఖ్యం అని చెప్పేవారు. ఐఏఎస్‌ క్యాడర్‌ వచ్చిన తర్వాత బాధ్యతలు పెరిగాయి. భర్త రోహిత్‌ కూడా అండగా నిలిచారు. మా బాగు కోసం పరితపించిన కుటుంబ పెద్దలను ఎప్పటికీ మరిచిపోలేను. ఇప్పటికీ తల్లిదండ్రులు చూపిన దారిలోనే పయనిస్తున్నాను.    – ఎం.గౌతమి, జాయింట్‌ కలెక్టర్,  కడప

పేరెంట్స్‌ను బాగా చూసుకోవాలి
మా తండ్రి చంద్రకాంత్‌వర్మ (మద్రాసు ఫర్టిలైజర్స్‌ లిమిటెడ్‌ మార్కెటింగ్‌ విభాగంలో పనిచేసేవారు). తల్లి జ్ఞానేశ్వరి (రిటైర్డ్‌ స్కూలు టీచర్‌). ఇద్దరూ నన్నెంతగానో ప్రోత్సహించారు. నేను అనుకున్న లక్ష్యాన్ని సాధించే క్రమంలో మా తల్లి గారు మరింత మద్దతు పలికారు. ఇంజనీరింగ్‌ ఐఐటీలో చేశాను. సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగానికి రాజీనామా చేసి ఇంటిలో ఉంటూ సివిల్స్‌కు ప్రిపేర్‌ అయ్యాను. ఆ సమయంలో మా తండ్రి నాకు అవసరమైన పుస్తకాలు, ఇతరత్రా సామగ్రిని అందించేవారు. అమ్మ నన్ను అనుక్షణం జాగ్రత్తగా చూసుకుని మరింతగా ప్రోత్సహించారు. తల్లిదండ్రుల ప్రోత్సహంతోనే నేను ఈ స్థాయికి వచ్చాను. ప్రతి ఒక్కరూ తల్లిదండ్రులను గౌరవించాలి. వారిని బాగా చూసుకోవడం మన బాధ్యత. అది చేయలేనపుడు ఏం సాధించినా ఉపయోగం లేదు. తల్లిదండ్రులను చూసుకోలేని వాడు దేనికీ పనికి రాడు.     –సాయికాంత్‌వర్మ, జేసీ (అభివృద్ధి), కడప

వారి కష్టం మాకు రాకూడదని...
మాది వేంపల్లె మండలం రామిరెడ్డిగారిపల్లె. దిగువ మధ్యతరగతికి చెందిన సన్నకారు రైతుకుటుంబం. మా తల్లిదండ్రులు ఓబుల్‌రెడ్డి, గంగమ్మలకు మేము ముగ్గురు సంతానం. నేను పెద్దవాడిని, నాతరువాత తమ్ముడు, చెల్లెలు. అప్పట్లో మా పరిస్థితులు ఎలా ఉండేవంటే స్టోరు బియ్యం ఎప్పుడు ఇస్తారా ? అని ఎదురు చూసేవాళ్లం. మాకోసం అమ్మా, నాన్నలు చాలా కష్టపడేవారు. నేను ఇంటర్‌లో ఉండగా నాన్న చనిపోయారు. అప్పుడు మా చదువు బాధ్యతలను అమ్మ తన భుజస్కంధాలపైన వేసుకుంది. వ్యవసాయం చేసే అమ్మ అతికష్టం మీద చదివించింది. మా పెద్దనాన్న కూడా మాకు సహకరించారు. పిల్లలు సుఖంగా బతకడం కోసం తల్లిదండ్రులు పడే కష్టాన్ని స్వయంగా చూశాను. పీజీ చివరి సంవత్సరంలో అమ్మ కూడా చనిపోయింది. ఎంఏ ఎకనామిక్స్‌ పూర్తయ్యాక ఉద్యోగం ఇప్పించమని దివంగత సీఎం వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి వద్దకు వెళ్లాను. ఆయన గ్రూప్స్‌ రాయమని సలహా ఇచ్చారు. ఆ సమయంలో నా ఆర్థిక పరిస్థితి గురించి చెప్పాను. గ్రూప్స్‌ ప్రిపరేషన్‌కు అయ్యే ఖర్చుల విషయాలన్ని వైఎస్సార్‌ చూసుకున్నారు. ఫలితంగా ఇప్పుడు నేను ఆర్డీఓగా పనిచేస్తున్నాను. చిన్న ఉద్యోగం వస్తే చాలనుకున్న తల్లిదండ్రులు నేను ఈస్థాయికి చేరుకోక ముందే కాలం చేయడం నన్ను ఎప్పటికీ బాధిస్తుంటుంది. ఎప్పుడూ తల్లిదండ్రుల మనస్సు నొప్పించకండి.     –ధర్మచంద్రారెడ్డి, ఆర్డీఓ, రాజంపేట

విలువలే పునాదిగా పెంచారు..
మా తల్లిదండ్రులు లక్ష్మిదేవి, గోవిందరెడ్డి (విశ్రాంత ఎల్‌ఐసీ మేనేజర్‌) విలువలే పునాదిగా పెంచారు. మనకు ఉన్న దాంట్లో పదిమందికి సాయం చేయడం నేర్పారు. ప్రాథమిక, మాధ్యమిక, ఇంటర్‌ విద్య అంతా ప్రభుత్వ విద్యాసంస్థల్లోనే పూర్తిచేశాను. మా ఇంట్లో నాతో పాటు మా బంధువులు, తెలిసిన వారు కూడా కలిసిమెలిసి చదుకునేవాళ్లం. అందరినీ అమ్మ బాగా చూసుకునేది. 1984లో ఇంజినీరింగ్‌లో మహిళలు చదవడం తక్కువగా ఉండేది. నాకు ఎంతో ఇష్టమైన ఎలక్ట్రికల్‌ ఇంజినీరింగ్‌ చదవాలనుకున్న సమయంలో తల్లిదండ్రులు బాగా ప్రోత్సహించారు. 1984–88 విద్యాసంవత్సరంలో ఎలక్ట్రికల్‌ ఇంజినీరింగ్‌లో ఏకైక మహిళా విద్యార్థిని. తల్లిదండ్రుల ప్రోత్సాహంతోనే 27 సంవత్సరాలకు పైగా బోధనా రంగంలో రాణించగలిగాను. ప్రస్తుతం వైవీయూకు వైస్‌ చాన్సలర్‌గా ఉన్నతస్థానంలో ఉన్నామంటే మా తల్లిదండ్రులు నేర్పిన జీవితపాఠాలే మార్గదర్శకం. వారు నేర్పిన విలువలనే మా పిల్లలకు కూడా నేర్పుతున్నాం. ఇప్పటికీ తల్లిదండ్రులతో కలిసి ఉంటున్నాం.   – ఆచార్య మునగాల సూర్యకళావతి, వైస్‌ చాన్సలర్, వైవీయూ

తల్లిదండ్రుల రుణం తీర్చుకోలేనిది
మా సొంతూరు పుల్లంపేట మండలం వత్తలూరు. అమ్మ కృష్ణవేణి, నాన్న రామ్మోహన్‌రాజు. అమ్మ, నాన్న ఇద్దరు ప్రభుత్వ టీచర్లు. చిన్నప్పటి నుంచి మమ్మల్ని క్రమశిక్షణగా పెంచారు. మా తల్లిదండ్రులకు మేము ముగ్గురు సంతానం. నేను చివరి వాడిని. మా ముగ్గురినీ ప్రయోజకుల్ని చేయాలని అమ్మా, నాన్న బాగా తపన పడ్డారు. చిన్నప్పుడు బడిలో అమ్మ, నాన్న వద్దనే మేము చదువుకున్నా, అందరి పిల్లల్లానే మమ్మల్ని చూసేవారు. చదవకుంటే కొట్టేవారు. అప్పట్లో అమ్మ, నాన్నకు తక్కువ జీతాలు అయినా మాలో ఎవరికీ చిన్నలోటు కూడా చేయలేదు. పెద్దన్నయ్య చక్రధర్‌రాజు ప్రభుత్వ ఉపాధ్యాయుడు, రెండో అన్నయ్య శశిధర్‌రాజు విద్యుత్‌శాఖలో సబ్‌ఇంజనీర్, నేను రాష్ట్ర వ్యాయామ విద్య తనిఖీ అధికారిగా పనిచేస్తున్నాను. ఇప్పుడు ముగ్గురం అన్నదమ్ములం రాజంపేటలో ఒకేచోట నివాసముంటున్నాం. నాన్న కొన్నేళ్ల క్రితం చనిపోయారు. మా ఉన్నతిని చేసిన ఆయన ఎంతో సంతోషించారు. అమ్మకు ఏలోటు రానివ్వకుండా కంటికి రెప్పాలా చూసుకుంటున్నాం.   -ఈ.భానుమూర్తిరాజు, రాష్ట్ర వ్యాయామ విద్య తనిఖీ అధికారి

ప్రతి అడుగులోనూ వారి శ్రమే.. 
నాపేరు రాచకుంట నాగరాజు. నేను కోడూరులోని అనంతరాజుపేట వైఎస్సార్‌ ఉద్యాన పరిశోధనస్థానంలో హెడ్‌గా విధులు నిర్వస్తిన్నా. సొంతూరు పులివెందుల. నాన్న ఇడుపులపాయ ఎస్టేట్‌లో మేనేజర్‌గా పనిచేసేవారు. మాది చిన్న వ్యవసాయ కుటుంబం. నా ప్రతి అడుగులోనూ తల్లిదండ్రులు రాచకుంట నారాయణ, లక్ష్మీదేవి శ్రమనే కనపడుతుంది. మూడునెలలక్రితం అమ్మ కాలం చేశారు. ఇప్పటికీ వారు పడిన కష్టం, త్యాగం గుర్తుచేసుకుంటూ ఉంటాను.

మార్గదర్శకులు 
మా అమ్మానాన్నలే నా జీవిత ఔన్నత్యానికి మార్గదర్శకులు. నాన్న చిత్తూరు జిల్లాలోని మా గ్రామానికి సర్పంచ్‌గా ప్రజల ఆదరాభిమానాలు పొందారు. అమ్మ గృహిణిగానేగాక నాన్నకు రాజకీయాల్లో స్నేహితురాలిగా ఉంటూ ప్రోత్సహించారు. బిడ్డల బాగోగుల కోసం ఎంత శ్రద్ధ చూపారో గ్రామం అభివృద్దికి కూడా అదే స్థాయిలో కృషి చేశారు. మా గ్రామంలో పాఠశాల ఏర్పాటు చేయించి నన్ను అందులోనే చదివించారు. చదువుకు మించిన ఆస్తి లేదని బోధించారు. కష్టాలు వచ్చినపుడు సవాలుగా స్వీకరించి విజయం సాధించేవారు పట్టువదలవద్దని నూరిపోశారు. చదువు వరకు పాఠశాల గురువులు మార్గదర్శకులైతే నా జీవితానికి ఉపయుక్తమైన మార్గదర్శనం చేసింది అమ్మా నాన్నలే! నాన్న ముగ్గురు ముఖ్యమంత్రుల నుంచి ఉత్తమ సర్పంచ్‌గా అవార్డును స్వీకరించారు. మా దంపతులం కూడా అమ్మనాన్నను ఆదర్శంగా తీసుకున్నాం. – శంకర్‌ బాలాజీ, అసిస్టెంట్‌కమిషనర్, జిల్లా దేవదాయశాఖ

తల్లిదండ్రుల ప్రోత్సాహం వల్లే... 
తమ పిల్లలు ఉన్నత స్థితిలో ఉండాలని తల్లిదండ్రులు ఎన్నో కలలు కంటారు. వారి కలలను సాకారం చేసినప్పుడే మన జన్మకు సార్థకత లభిస్తుంది. మానాన్న ఎస్‌ఐగా పనిచేసి రిటైర్డ్‌ అయ్యారు. నన్ను పోలీస్‌ డిపార్ట్‌మెంట్‌లో అధికారిగా చూడాలన్నది వారి ఆశ. ఈక్రమంలో చదివించేందుకు ప్రోత్సహించారు. నేను కూడా చిన్నప్పటి నుంచి బాగా చదువుకున్నా. మాసొంతూరు నందలూరు. విద్యాభ్యాసం రాజంపేటలోనే సాగింది. ఎంబీఏ హైదరాబాద్‌లో చేశా. ఆ తరువాత గ్రూప్స్‌ రాసి డీఎస్పీ అయ్యాను. ఇప్పుడు గుంటూరు డీఎస్పీగా పనిచేస్తున్నా. అమ్మా, నాన్నల కోరిక వల్లే నేను ఉజ్వల భవిష్యత్తుకు బాటలు వేసుకున్నా. యూత్‌కి నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నా.. ‘‘ఫస్ట్‌ తల్లిదండ్రులను ప్రేమించండి, వారిని గౌరవించండి. వారు ఇచ్చే సలహాలు, సూచనలను  పెడచెవిన పెట్టవద్దు’’.  నిజమైన శ్రేయోభిలాషులు, ఆత్మీయులు తల్లిదండ్రులే.    – సుప్రజ, డీఎస్పీ, గుంటూరు –(రాజంపేట టౌన్‌) 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top