
కడప: ఒంటిమిట్టలో యధేచ్ఛగా ఎన్నికల కోడ్ ఉల్లంఘన జరుగుతున్నా అధికారులు మాత్రం పత్తా లేకుండా ఉన్నారు. హరిత హోటల్ వేదికగా తిష్ట వేసిన మంత్రులు.. ఎల్లో పాలిటిక్స్‌కు తెరలేపారు. హరిత హోటల్‌ను కూటమి కార్యాలయంగా మార్చేశారు మంత్రులు, టీడీపీ నేతలు. హరిత హోటల్‌లో మకాం వేసి మంత్రులు.. పచ్చదండు కార్యకర్తలతో బహిరంగ సమావేశాలు నిర్వహిస్తున్నారు.
మంత్రులు మంత్రులుగా వ్యవహరిస్తున్న తీరుపై విస్మయం వ్యక్తమవుతోంది. ప్రభుత్వంలో భాగస్వామ్యమైన మంత్రులు, ప్రజా ప్రతినిధులు పార్టీ కోసం ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘించడమే కాకుండా, అదే సమయంలో ప్రభుత్వ వాహనాలను సైతం ఉపయోగిస్తున్నారు. మంత్రులకు, ప్రజా ప్రతినిధులకు ఎన్నికల కోడ్ వర్తించకపోవడం ఇక్కడ గమనార్హం, ఇంత జరుగుతున్నా ఎన్నికల అధికారులు మాత్రం పత్తాలేకుండా ఉన్నారు.
ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఉప ఎన్నిక వైఎస్సార్‌సీపీకి అనుకూలమనే సంకేతాలతో టీడీపీ అధిష్టానం రాష్ట్ర కేబినెట్‌ను ఇక్కడికి పంపుతోంది . రోజుకొక మంత్రి వస్తున్నారు. ఒక్క జెడ్పీటీసీ స్థానం కోసం కేబినెట్ కదిలిరావడం చూసి ఓటర్లు ఆశ్చర్యచకితులవుతున్నారు. కులాలవారీగా మంత్రులను రంగంలోకి దింపుతున్నారు. శుక్రవారం రాష్ట్ర మంత్రులు మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి, జనార్ధన్‌రెడ్డి, ఫరూఖ్‌లు ఒంటిమిట్టలో వివిధ ప్రాంతాల్లో వేర్వేరుగా ఓటర్లను ప్రసన్నం చేసుకున్నారు. పోలింగ్ నాటికి ఎంతమంది మంత్రులు దిగుతారో చెప్పలేని పరిస్థితి. తమవంతుగా జనసేన నుంచి కదిరి ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్,ఎమ్మెల్సీ అనురాధలు ఉన్నారు.
కాగా, ప్రభుత్వంలో ఉన్న మంత్రులు ఎన్నికల కోడ్ అమలులో ఉన్న సమయంలో పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనడం కొన్ని పరిమితులతో కూడిన అంశం. ఇది ఎన్నికల ప్రవర్తనా నియమావళి కింద ఉల్లంఘనగా పరిగణించే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా తమ అధికారాన్ని, ప్రభుత్వ వనరులను దుర్వినియోగం చేయకూడదు. మరి మంత్రులు తమ హోదాలో ఇంత చేస్తున్నా ఎన్నికల అధికారులు చూసీ చూడనట్లుగా వ్యవహరించడం విమర్శలకు తావిస్తోంది.