న్యూఢిల్లీ: తరచూ దుందుడుకు చర్యలకు పాల్పడే చైనాకు భారత్ అడ్డుకట్ట వేస్తోంది. చైనా సరిహద్దు వెంబడి భారత్ మరో భారీ వ్యూహాత్మక అడుగు వేసింది. ఉత్తరాఖండ్‌లోని నీలపాణి నుండి ములింగ్ లా వరకు 16,134 అడుగుల అత్యంత ఎత్తైన ప్రాంతంలో 32 కిలోమీటర్ల మేర నిర్మితమవుతున్న‘మెగా రోడ్డు’ పనులను భారత్ ముమ్మరం చేసింది. అన్ని వాతావరణాలను తట్టుకునేలాంటి రహదారి నిర్మాణాన్ని చేపట్టింది. రూ. 104 కోట్ల వ్యయంతో బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ (బీఆర్‌ఓ) చేపడుతున్న ఈ ప్రాజెక్టు, వాస్తవ నియంత్రణ రేఖ (ఎల్‌ఏసీ)వద్ద భారత సైనిక సామర్థ్యాన్ని మరింత పెంచనున్నది.
ప్రస్తుతం ములింగ్ లా బేస్ క్యాంపు చేరుకోవాలంటే సైనికులు ఐదు రోజుల పాటు కఠినమైన కొండ మార్గాల్లో ట్రెక్కింగ్ చేయాల్సి వస్తున్నది. శీతాకాలంలో భారీ హిమపాతం కారణంగా ఈ మార్గం పూర్తిగా మూసుకుపోతుంటుంది. దీంతో కేవలం హెలికాప్టర్ల ద్వారానే ప్రయాణం చేయాల్సి వస్తుంది. అయితే ఈ నూతన రహదారి పూర్తయితే, ఐదు రోజుల ప్రయాణం కేవలం కొద్ది గంటల్లోనే ముగియనుంది. తద్వారా దళాల మోహరింపు, రేషన్, ఇంధనం, యుద్ధ సామగ్రిని ఏడాది పొడవునా ఎటువంటి ఆటంకం లేకుండా నేరుగా సరిహద్దుకు చేరవేసే అవకాశం కలుగుతుంది.
ఒకప్పుడు సరిహద్దుల్లో రహదారులు నిర్మిస్తే చైనా చొరబడుతుందని భారత్ భావించింది. ఇప్పుడు ఈ సిద్ధాంతాన్ని పక్కనపెట్టి,‘కనెక్టివిటీయే బలం’ అనే దిశగా అడుగులు వేస్తోంది. టిబెట్ ప్రాంతంలో చైనా ఇప్పటికే భారీగా రోడ్డు, రైలు నెట్‌వర్క్‌ను నిర్మించింది. ఈ నేపథ్యంలో భారత్ కూడా తన మౌలిక సదుపాయాలను వేగంగా అభివృద్ధి చేస్తోంది. 2020 తూర్పు లడఖ్ ప్రతిష్టంభన తర్వాత, సరిహద్దుల్లోని చివరి మైలు వరకు సైనిక కనెక్టివిటీని పెంచడమే లక్ష్యంగా మెగా రోడ్డు పనులు జరుగుతున్నాయి.
హిమాలయాల్లోని అత్యంత కఠినమైన భూభాగంలో సాగుతున్న ఈ రోడ్డు నిర్మాణం ఇంజనీరింగ్ పరంగా పెద్ద సవాలుతో కూడుకున్నది. ఈ రహదారి పూర్తయితే వాయు సేనపై ఆధారపడే అవసరం తగ్గి, రక్షణ వ్యయం గణనీయంగా ఆదా కానుంది. సరిహద్దుల్లో మౌలిక సదుపాయాలు పటిష్టంగా ఉంటేనే, వేగవంతమైన ప్రతిస్పందన సాధ్యమని భారత్ భావిస్తోంది. తద్వారా సరిహద్దు ప్రాంతాలు మరింత సుస్థిరంగా ఉంటాయని రక్షణ నిపుణులు అంటున్నారు. ఈ రోడ్డు నిర్మాణంతో చైనా చొరబాట్లకు భారత్ సమర్థవంతంగా అడ్డుకట్ట వేయగలదని చెబుతున్నారు.
ఇది కూడా చదవండి: liquor Scam: మాజీ సీఎం కుమారునికి రూ. 250 కోట్లు?


