రాయ్‌పూర్: ఛత్తీస్‌గఢ్ మాజీ ముఖ్యమంత్రి, సీనియర్ కాంగ్రెస్ నేత భూపేష్ బఘేల్ కుమారుడు చైతన్య బఘేల్‌పై అవినీతి నిరోధక బ్యూరో (ఏసీబీ) తీవ్ర ఆరోపణలు చేసింది. రాష్ట్రంలో జరిగిన రూ. మూడువేల కోట్ల మద్యం కుంభకోణంలో చైతన్యకు వాటా మొత్తంగా రూ. 200 కోట్ల నుండి రూ. 250 కోట్ల వరకూ అందినట్లు ఏసీబీ తన ఏడవ అనుబంధ చార్జిషీట్‌లో పేర్కొంది. తండ్రి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో చైతన్య ఎక్సైజ్ శాఖలో వసూళ్ల రాకెట్‌ను (సిండికేట్) ఏర్పాటు చేయడంలో చైతన్య కీలక పాత్ర పోషించాడని దర్యాప్తు సంస్థ వెల్లడించింది.
సుమారు 3,800 పేజీల ఈ సమగ్ర చార్జిషీట్‌లోని వివరాల ప్రకారం నిందితుడు అన్వర్ ధేబర్ బృందం ద్వారా వచ్చిన అక్రమ ఆదాయాన్ని తరలించడానికి చైతన్య తన వ్యక్తిగత నెట్‌వర్క్‌ను ఉపయోగించినట్లు సమాచారం. ఈ క్రమంలో మద్యం వ్యాపారి త్రిలోక్ సింగ్ ధిల్లాన్‌కు చెందిన వివిధ సంస్థల ద్వారా నిధులు మళ్లించినట్లు అధికారులు గుర్తించారు. ఈ భారీ మొత్తాన్ని బ్యాంకింగ్ మార్గాల ద్వారా తన కుటుంబ వ్యాపారాలకు తరలించడంతో పాటు, రియల్ ఎస్టేట్ వెంచర్లలో పెట్టుబడి పెట్టినట్లు చార్జిషీట్‌లో వివరించారు.
ఈ కుంభకోణం కారణంగా రాష్ట్ర ఖజానాకు భారీ నష్టం వాటిల్లగా, మద్యం సిండికేట్ సభ్యులు మాత్రం అక్రమంగా సంపన్నులయ్యారని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)స్పష్టం చేసింది. చైతన్య తన కుటుంబ సభ్యులు, సన్నిహితుల సహకారంతో ఈ నల్లధనాన్ని వైట్ మనీగా మార్చేందుకు ప్రయత్నించారని ఏజెన్సీ పేర్కొంది. ఈ కేసు దర్యాప్తులో భాగంగా జూలై 18న జరిగిన సోదాల అనంతరం.. చైతన్యను ఈడీ అధికారులు అదుపులోనికి తీసుకున్నారు.
ప్రస్తుతం కస్టడీలో ఉన్న నిందితుల నుంచి సేకరించిన డిజిటల్ ఆధారాలు, విచారణలో వెల్లడైన కీలక అంశాలను తాజా చార్జిషీట్‌లో పొందుపరిచారు. ఈ కేసులో ఇప్పటివరకు మొత్తం ఎనిమిది చార్జిషీట్లు దాఖలయ్యాయి. ఈ తాజా పరిణామాలు రాష్ట్ర రాజకీయాల్లో కలకలం రేపుతున్నాయి. ఉన్నత స్థాయి వ్యక్తుల ప్రమేయంపై మరిన్ని ఆధారాలను సేకరిస్తున్నామని, దర్యాప్తు కొనసాగుతోందని ఏసీబీ వర్గాలు మీడియాకు వెల్లడించాయి.
ఇది కూడా చదవండి: కాలువలో మొండెం.. వెలుగులోకి భార్య కిరాతకం


