సంభల్: ఉత్తరప్రదేశ్‌లోని సంభల్ జిల్లాలో వెలుగు చూసిన ఒక దారుణ హత్యోదంతం అందరినీ ఉలిక్కిపడేలా చేస్తోంది. తన అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్నాడని.. ఒక ఇల్లాలు తన ప్రియుడితో కలిసి కట్టుకున్న భర్తను అత్యంత కిరాతకంగా హత్యచేసింది. అంతటితో ఆగకుండా మృతదేహం ఆనవాళ్లు దొరకకూడదని దానిని ముక్కలు ముక్కలుగా నరికి, వేర్వేరు ప్రాంతాల్లో పారేసిన వైనం స్థానికంగా సంచలనంగా మారింది.
నవంబర్ 18న తన భర్త రాహుల్ అదృశ్యమయ్యాడంటూ భార్య రూబీ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ హైడ్రామా మొదలైంది. డిసెంబర్ 15న ఇక్కడి ఒక కాలువలో తల, కాళ్లు, చేతులు లేని మొండెం పోలీసులకు లభించింది. ఆ మొండెంపై ఉన్న ‘రాహుల్’ అనే పచ్చబొట్టు ఆధారంగా పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు. సాంకేతిక ఆధారాలు సేకరించిన పోలీసులకు రూబీపై అనుమానం కలగడంతో అసలు నిజం బయటపడింది.
పోలీసుల విచారణలో నిందితులు చెప్పిన వివరాలు ఒళ్లు గగుర్పొడిచేలా ఉన్నాయి. రూబీ, ఆమె ప్రియుడు గౌరవ్ కలిసి రాహుల్‌ను ఇనుప రాడ్డు, రోకలితో కొట్టి హత్య చేశారు. అనంతరం మృతదేహాన్ని మాయం చేసేందుకు ఒక చెక్కలు కోసే గ్రైండర్‌ను తీసుకువచ్చి, మృతదేహాన్ని ముక్కలుగా కోశారు. ఒక భాగాన్ని కాలువలో పడేయగా, మిగిలిన శరీర భాగాలను రాజ్‌ఘాట్‌కు తీసుకెళ్లి పవిత్ర గంగా నదిలో కలిపేసి ఏమీ తెలియనట్టు నాటకమాడారు.
నిందితులు హత్యకు ఉపయోగించిన గ్రైండర్, ఇనుప సుత్తి మరియు ఇతర పనిముట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితులు రూబీ, గౌరవ్‌లను అరెస్టు చేసి జైలుకు తరలించారు. మృతదేహం రాహుల్‌దేనని నిరూపించేందుకు అతని పిల్లల డీఎన్‌ఏ నమూనాలను సేకరించి, ఫోరెన్సిక్ పరీక్షలకు పంపి, కేసు దర్యాప్తు చేస్తున్నారు.
ఇది కూడా చదవండి: రాజ్యాంగం రద్దుకు బీజేపీ కుట్ర: రాహుల్ ఆరోపణ


