తొమ్మిదేళ్ల ప్రేమ.. పెళ్లి.. రెండు నెలలకే.. షాకింగ్‌ ట్విస్ట్‌ ఏంటంటే! | Bareilly Uttar Pradesh: Weeks After Marrying 9 Year Lover | Sakshi
Sakshi News home page

తొమ్మిదేళ్ల ప్రేమ.. పెళ్లి.. రెండు నెలలకే.. షాకింగ్‌ ట్విస్ట్‌ ఏంటంటే!

Feb 1 2026 7:33 PM | Updated on Feb 1 2026 7:38 PM

Bareilly Uttar Pradesh: Weeks After Marrying 9 Year Lover

బరేలీ: తొమ్మిదేళ్ల ప్రేమ.. తర్వాత పెళ్లి.. రెండు నెలలకే విషాదంగా మిగిలింది. ఉత్తరప్రదేశ్‌లోని బరేలీలో జితేంద్ర కుమార్ యాదవ్(33) తన అద్దె ఇంట్లో ఉరివేసుకుని కనిపించడం కలకలం రేపింది. మొదట ఆత్మహత్యగా అంతా భావించారు. కానీ పోస్టుమార్టం నివేదికలో అసలు విషయం బయటపడింది. జితేంద్రను భార్య జ్యోతి గొంతు నులిమి చంపినట్లు తేలిపింది. ఈ ఘటనలో మరో ట్విస్ట్‌ ఏంటంటే.. ఈ హత్యకు ఆమె తల్లిదండ్రులతో పాటు సోదరుడు కూడా సహకరించారు. ఆ సమయంలో వారు అతడిని గట్టిగా పట్టుకోగా.. జ్యోతి గొంతు నులిమి చంపేసినట్లు పోలీసులు వెల్లడించారు.

అసలేం ఏం జరిగిందంటే..
మృతుడు జితేంద్ర, జ్యోతి తొమ్మిదేళ్లుగా ప్రేమించుకున్నారు. గతేడాది నవంబర్ 25న ఇరు కుటుంబాల అంగీకారంతో వివాహం చేసుకున్నారు. అయితే, పెళ్లయిన కొద్ది వారాలకే వీరి మధ్య గొడవలు మొదలయ్యాయి. జ్యోతి బ్యాంకు ఖాతా నుండి జితేంద్ర రూ.20 వేలు డ్రా చేసి ఆన్‌లైన్ జూదంలో పోగొట్టడమే వారి మధ్య వివాదాలకు ప్రధాన కారణంగా పోలీసులు తెలిపారు. జనవరి 26న ఈ డబ్బు విషయంలో ఇద్దరి మధ్య గొడవ.. దాడికి దారితీసింది. ఆ సమయంలో జ్యోతి తన తండ్రి కాళీచరణ్, తల్లి చమేలి, సోదరుడు దీపక్‌లను ఇంటికి పిలిచింది.

కాళ్లు, చేతులు కదలకుండా..
వారందరూ కలిసి జితేంద్ర కాళ్లు, చేతులు కదలకుండా గట్టిగా పట్టుకోగా, జ్యోతి అతని గొంతు నులిమి హత్య చేసింది. జితేంద్ర చనిపోయాడని నిర్ధారించుకున్న తర్వాత.. ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు మఫ్లర్‌తో కిటికీ గ్రిల్‌కు మృతదేహాన్ని వేలాడదీశారు. అనంతరం తమ అల్లుడు ఆత్మహత్య చేసుకున్నాడంటూ ఇరుగుపొరుగు వారిని నమ్మించే ప్రయత్నం చేశారు.

పోలీసులు మొదట ఆత్మహత్యగా భావించినా, జితేంద్ర సోదరుడు అజయ్‌ కుమార్ ఫిర్యాదుతో అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. పోస్టుమార్టం నివేదికలో అది ఉరి వల్ల జరిగిన మరణం కాదని.. గొంతు నులిమి హత్య చేసినట్లుగా తేలింది. దీంతో పోలీసులు సెక్షన్లు మార్చి దర్యాప్తు వేగవంతం చేశారు. ఇప్పటికే జ్యోతితో పాటు ఆమె తల్లిదండ్రులను అరెస్టు చేయగా, పరారీలో ఉన్న ఆమె సోదరుడు దీపక్ కోసం పోలీసులు గాలిస్తున్నారు. పోలీసు విచారణలో జ్యోతి తన నేరాన్ని అంగీకరించింది. జితేంద్ర ఐవీఆర్ఐలో కాంట్రాక్ట్ ఉద్యోగిగా, జ్యోతి రోడ్డు రవాణా సంస్థలో కాంట్రాక్ట్ బస్ కండక్టర్‌గా పనిచేస్తోంది. ఆర్థిక వివాదాలు కారణంగానే హత్యకు ఒడిగట్టినట్లు ఆమె పేర్కొంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement