‘నీట్’ కోసం ‘ఎన్ఆర్ఐ’లుగా మారి.. మరో బాగోతం | 811 Students Falsely Claimed NRI Status To Secure Medical PG Seats, MCC Report Reveals | Sakshi
Sakshi News home page

‘నీట్’ కోసం ‘ఎన్ఆర్ఐ’లుగా మారి.. మరో బాగోతం

Feb 1 2026 9:19 AM | Updated on Feb 1 2026 10:32 AM

Neet PG Aspirants Converted from Indian to NRI

న్యూఢిల్లీ: దేశంలో వైద్య విద్యను అభ్యసించేందుకు పలువురు విద్యార్థులు అక్రమ మార్గాలను అవలంబిస్తున్న ఉదంతాలు వెలుగు చూస్తున్నాయి. తాజాగా వైద్య విద్య పీజీ సీట్ల కేటాయింపును పర్యవేక్షించే మెడికల్ కౌన్సెలింగ్ కమిటీ (ఎంసీసీ) ఒక సంచలన జాబితాను విడుదల చేసింది. 2025-26 విద్యాసంవత్సరానికి గాను మూడో విడత కౌన్సెలింగ్‌లో సీట్లు పొందేందుకు ఏకంగా 811 మంది అభ్యర్థులు తమ జాతీయతను ‘భారతీయులు’ నుండి ‘ఎన్ఆర్ఐ’గా మార్చుకున్నారు.

నీట్‌ పీజీలో తక్కువ మార్కులు వచ్చి, ఆర్థికంగా బలంగా ఉన్న విద్యార్థులు క్లినికల్ విభాగాల్లో సీట్లు దక్కించుకునేందుకు ఈ మార్గాన్ని ఎంచుకుంటున్నట్లు తెలుస్తోంది. ఎన్ఆర్ఐ కోటాలో ఫీజులు భారీగా ఉన్నప్పటికీ, పోటీ తక్కువగా ఉండటం, కట్-ఆఫ్ మార్కులు మేనేజ్‌మెంట్‌ కోటా కంటే తక్కువగా ఉండటం వీరికి కలిసి వస్తోంది. ఈ విధంగా ఎన్ఆర్ఐ కోటాకు అర్హత సాధించిన 811 మంది అభ్యర్థులను రెండు వర్గాలుగా విభజించారు. మొదటి వర్గంలో నేరుగా ఎన్ఆర్ఐలు లేదా ఎన్ఆర్ఐల పిల్లలు ఉండగా, వీరి సంఖ్య కేవలం 113 మాత్రమే ఉంది.

రెండో వర్గంలో ఏకంగా 698 మంది అభ్యర్థులు ఉండటం గమనార్హం. నిబంధనల సడలింపు వల్ల రక్తసంబంధీకులు కాకపోయినా, దూరపు బంధువులు స్పాన్సర్ చేసే అవకాశం ఉండటంతో ఈ సంఖ్య భారీగా పెరిగింది. ఈ అభ్యర్థుల స్కోర్లను పరిశీలిస్తే విస్తుపోయే నిజాలు బయటపడుతున్నాయి. మొదటి కేటగిరీలో అత్యల్ప స్కోరు 800 మార్కులకు గాను కేవలం 82 (10%) మాత్రమే కాగా, రెండో కేటగిరీలో ఇది మరీ దారుణంగా 28 (3.5%) మార్కులుగా ఉంది. మొదటి వర్గంలో 66శాతం మంది అభ్యర్థులు 1.5 లక్షల కంటే తక్కువ ర్యాంకు పొందినవారే కావడం గమనార్హం. అయినప్పటికీ, ఏడాదికి రూ. 45 లక్షల నుండి రూ. 95 లక్షల వరకు వెచ్చించగలిగే స్తోమత ఉండటంతో, వీరు అత్యంత డిమాండ్ ఉన్న మెడికల్ సీట్లను సులువుగా సొంతం చేసుకుంటున్నారు.

కళాశాల స్థాయి,  కోర్సును అనుసరించి ఈ ఫీజులు మారుతుంటాయి. సాధారణంగా ఎన్ఆర్ఐ సీట్లు ఖాళీగా మిగిలిపోతుంటాయి. అటువంటప్పుడు వాటిని మేనేజ్‌మెంట్‌ కోటాలోకి మార్చాల్సి ఉంటుంది. దీంతో  ఫీజులు భారీగా తగ్గుతాయి. ఈ నేపధ్యంలో ప్రైవేట్ వైద్య కళాశాలలు ఈ ఆర్థిక నష్టాన్ని భరించలేవనే వాదనను కోర్టులు పరిగణనలోకి తీసుకున్నాయి. దీంతో ఎన్ఆర్ఐ నిర్వచనాన్ని విస్తృతం చేశారు. ఫలితంగా తల్లిదండ్రులు విదేశాల్లో లేకపోయినా,  ఎన్‌ఆర్‌ఐ బంధువుల ఆధారంతో వైద్య విద్యార్థులు పీజీ సీట్లను దక్కించుకుంటున్నారు. 

ఇది కూడా చదవండి: తక్కువ వ్యయం.. లోటు లేని జీవితం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement