వరుసగా రెండోసారి టీ20 ప్రపంచకప్ గెలిచిన తొలి జట్టుగా నిలిచి టీమిండియా సరికొత్త రికార్డు సాధించింది. మొత్తంగా మూడోసారి, సొంతగడ్డపై తొలిసారి పొట్టి క్రికెట్ కప్ ట్రోఫీని ముద్దాడిన మొదటి జట్టుగా చరిత్ర సృష్టించింది.
ఇక ఈ విజయంతో భారత్‌కు ఐసీసీ ట్రోఫీ అందించిన కెప్టెన్ల జాబితాలో చేరాడు సూర్యకుమార్ యాదవ్. అయితే, ఈ టోర్నీ అనంతరం అతడు సారథ్య బాధ్యతల నుంచి వైదొలుగుతాడని.. ఆటకు వీడ్కోలు పలికే అవకాశాలు ఉన్నాయని ఊహాగానాలు వచ్చాయి.
ఒలింపిక్స్-2028లో ఆడటమే లక్ష్యం
అయితే, న్యూజిలాండ్‌పై ఫైనల్లో విజయం తర్వాత ఒలింపిక్స్-2028లో ఆడటమే తన లక్ష్యమని చెబుతూ సూర్య.. ఈ రూమర్లకు చెక్ పెట్టాడు. ఈ నేపథ్యంలో భారత జట్టు మాజీ ఓపెనర్, కామెంటేటర్ ఆకాశ్ చోప్రా చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. టీమిండియా టీ20 కెప్టెన్‌గా ఎవరూ ఊహించని పేరును అతడు ప్రతిపాదించాడు. జట్టులో చోటే లేని ఆటగాడు సారథి కాగలడని ఆకాశ్ చోప్రా అభిప్రాయపడటం గమనార్హం.
ఐపీఎల్‌లో సారథిగా సత్తా
కాగా ఐపీఎల్-2024లో కోల్‌కతా నైట్ రైడర్స్‌కు టైటిల్ అందించిన కెప్టెన్ శ్రేయస్ అయ్యర్. గతేడాది పంజాబ్ కింగ్స్‌కు మారిన ఈ ముంబైకర్.. ఆ జట్టును ఫైనల్‌కు చేర్చాడు. సారథిగా, బ్యాటర్ అదరగొట్టి ప్రశంసలు అందుకున్నాడు. అయినప్పటికీ శ్రేయస్ అయ్యర్‌ను సెలక్టర్లు కనికరించలేదు.
శ్రేయస్ అయ్యర్ ఫామ్‌లో ఉన్నప్పటికీ... జట్టులో స్థానం లేనందునే అతడికి చోటు ఇవ్వలేకపోతున్నామని చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ స్వయంగా వెల్లడించాడు. ఆసియా టీ20 కప్-2025 టోర్నీకి జట్టు ప్రకటించిన సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేశాడు. ఇక టీ20 ప్రపంచకప్-2026 జట్టులోనూ శ్రేయస్‌కు స్థానం దక్కలేదు.
టీ20 కెప్టెన్ ఎందుకు కాకూడదు?
దేశీ టీ20 క్రికెట్, ఐపీఎల్‌లో సత్తా చాటినప్పటికీ శ్రేయస్ అయ్యర్ వేచిచూడాల్సిన పరిస్థితి. ఇలాంటి తరుణంలో ఆకాశ్ చోప్రా మాత్రం అయ్యర్ టీమిండియా టీ20 కెప్టెన్ ఎందుకు కాకూడదంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
‘‘ఐపీఎల్-2026లో పంజాబ్ కింగ్స్ కెప్టెన్‌గా, బ్యాటర్‌గా రాణిస్తే శ్రేయస్‌కు మరో అవకాశం దక్కుతుంది. అతడు టీ20 ప్రపంచకప్ జట్టులో ఉంటాడని నేను భావించాను. మిడిలార్డర్‌లో ఒకవేళ చోటు ఖాళీ అయితే కచ్చితంగా అది అతడికే దక్కుతుంది.
కాబట్టి త్వరలోనే శ్రేయస్ భారత టీ20 జట్టులోకి వచ్చే అవకాశం ఉంటుంది. ఇక కెప్టెన్సీ విషయానికొస్తే.. టీమిండియా తదుపరి కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్ ఎందుకు ఉండకూడదు? అందుకు అవకాశం ఉంది’’ అని ఆకాశ్ చోప్రా చెప్పుకొచ్చాడు.


