బమాకో: పశ్చిమాఫ్రికా దేశమైన మాలిలో అనూహ్య పరిణామాలు చోటుచేసుకున్నాయి. మాలి రక్షణ మంత్రి జనరల్ సాడియో కమరా దారుణ హత్యకు గురయ్యారు. ఉగ్రవాదులు, తిరుగుబాటుదారుల కూటమి దేశవ్యాప్తంగా సృష్టించిన భీకర దాడులతో మాలి ప్రభుత్వం ఉక్కిరిబిక్కిరవుతోంది. రష్యా మద్దతుతో నడుస్తున్న సైన్యం వెనక్కి తగ్గడంతో, దేశ భద్రత ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది.
మంత్రి నివాసంపై కారు బాంబు దాడి
మాలి రాజధాని బమాకోలో జరిగిన కారు బాంబు, సాయుధ దాడిలో రక్షణ మంత్రి జనరల్ సాడియో కమరా ప్రాణాలు కోల్పోయారు. ఉగ్రవాదులు ఆయన నివాసాన్ని లక్ష్యంగా చేసుకుని ఈ ఆత్మాహుతి దాడికి పాల్పడ్డారు. జనరల్ కమరా వీరోచితంగా పోరాడి కొందరు దుండగులను మట్టుబెట్టినప్పటికీ, తీవ్ర గాయాలపాలై ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. ఈ దాడుల్లో 16 మందికి గాయాలయ్యాయి. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు ప్రభుత్వం రాజధానిలో మూడు రోజుల పాటు రాత్రిపూట కర్ఫ్యూ విధించింది.
అల్ ఖైదాతో చేతులు కలిపి..
మాలి ఉత్తర భాగంలో స్వతంత్రం కోసం పోరాడుతున్న అజావాద్ లిబరేషన్ ఫ్రంట్ (ఎఫ్‌ఎల్‌ఏ) సాయుధులు, అల్ ఖైదాతో సంబంధం ఉన్న జెఎన్ఐఎం (జెఎన్‌ఐఎం) ఉగ్రవాదులతో జట్టుకట్టారు. ఈ కూటమి వ్యూహాత్మకంగా వ్యవహరించి, మాలి సైన్యంపై విరుచుకుపడింది. ఈ భీకర దాడుల ధాటికి సైన్యం వెనక్కి తగ్గడంతో, కీలకమైన ఉత్తర నగరమైన కిడాల్ పూర్తిగా తిరుగుబాటుదారుల ఆధీనంలోకి వెళ్లిపోయింది. శాంతియుత ఒప్పందం ద్వారా ప్రభుత్వ బలగాలు కిడాల్‌ను ఖాళీ చేసి, వంద కిలోమీటర్ల దూరంలోని అనెఫిస్ కు చేరుకున్నాయని సైన్యాధికారులు తెలిపారు.
రష్యా సైనిక వ్యూహాలకు భారీ ఎదురుదెబ్బ
ఈ పరిణామాలు పశ్చిమాఫ్రికాలో రష్యా ఆధిపత్యానికి అతిపెద్ద సవాలుగా మారాయి. మాలి సైనిక ప్రభుత్వం పాశ్చాత్య దేశాలను కాదని, రష్యా బలగాల (ఆఫ్రికా కార్ప్స్) మద్దతు తీసుకోవడం ప్రారంభించినప్పటి నుండి ఇక్కడ హింస తీవ్రరూపం దాల్చింది. భిన్న సిద్ధాంతాలున్న రెండు సాయుధ వర్గాలు ఒకటై ఇంతటి భారీ కుట్రను అమలు చేశాయి. దీనిని పసిగట్టలేకపోవడం రష్యా సైనికుల వైఫల్యమేనని భద్రతా నిపుణులు విశ్లేషిస్తున్నారు.
ఇది కూడా చదవండి: జపాన్‌లో మళ్లీ భూకంపం.. సునామీ ముప్పు ఉందా?


