బీజేపీ అభ్యర్థి ఇంటివద్ద బాంబుల మోత | Bengal Poll Violence: CISF Jawan Shot Near BJP Candidates Home | Sakshi
Sakshi News home page

బీజేపీ అభ్యర్థి ఇంటివద్ద బాంబుల మోత

Apr 27 2026 12:53 PM | Updated on Apr 27 2026 1:03 PM

Bengal Poll Violence: CISF Jawan Shot Near BJP Candidates Home

భట్పారా: పశ్చిమ బెంగాల్‌లో ఎన్నికల వేడి తారాస్థాయికి చేరింది. ఏప్రిల్ 29న జరగనున్న రెండో విడత పోలింగ్‌ సమీపిస్తున్న తరుణంలో ఉత్తర 24 పరగణాల జిల్లాలోని భట్పారా ప్రాంతం నెత్తురోడింది. అధికార టీఎంసీ , ప్రతిపక్ష బీజేపీ వర్గాల మధ్య చెలరేగిన ఘర్షణలు చివరకు కాల్పులు, నాటు బాంబుల దాడులకు దారితీయడంతో ఓ సీఐఎస్ఎఫ్ జవాన్ తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనపై కేంద్ర ఎన్నికల సంఘం ఆగ్రహం వ్యక్తం చేస్తూ, సమగ్ర నివేదిక సమర్పించాలని అధికారులను ఆదేశించింది.

బీజేపీ అభ్యర్థి ఇంటి వద్ద కాల్పుల మోత
ఆదివారం అర్ధరాత్రి దాటిన తర్వాత బీజేపీ అభ్యర్థి పవన్ సింగ్ (సీనియర్ నేత అర్జున్ సింగ్ కుమారుడు) నివాసం వెలుపల భయానక వాతావరణం నెలకొంది. గుర్తుతెలియని వ్యక్తులు నాటు బాంబులు విసరడంతో పాటు తుపాకులతో కాల్పులకు తెగబడ్డారు. ఈ దాడుల్లో పవన్ సింగ్ భద్రతా బృందంలో విధుల్లో ఉన్న సీఐఎస్ఎఫ్ జవాన్ యోగేష్ శర్మ కాలికి తూటా తగిలింది. ఆయనను హుటాహుటిన ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అయితే ఈ కాల్పులు ఎవరు జరిపారన్నది ఇంకా స్పష్టం కాలేదు. ఘటనపై పోలీసులు ముమ్మర దర్యాప్తు చేస్తున్నారు.

పోలీస్ స్టేషన్ వద్దే ఘర్షణ, రాళ్లదాడి
ఆదివారం సాయంత్రం జగద్దల్ ప్రాంతంలోనూ తీవ్ర ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి. పార్టీ జెండాలు కడుతున్న ఓ తృణమూల్ కాంగ్రెస్ కార్యకర్తపై కొందరు వ్యక్తులు మూకుమ్మడిగా దాడి చేయడంతో వివాదం మొదలైంది. దీనిపై ఫిర్యాదు చేసేందుకు టీఎంసీ నేతలు స్థానిక పోలీస్ స్టేషన్‌కు చేరుకోగా, అప్పటికే అక్కడకు చేరుకున్న బీజేపీ మద్దతుదారులకు, వారికి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలో రెండు వర్గాలు ఒకరిపై ఒకరు రాళ్లు రువ్వుకోవడంతో పరిస్థితి పూర్తిగా అదుపు తప్పింది.

రాజకీయ ఆరోపణలు
ఈ దాడులపై అటు టీఎంసీ, ఇటు బీజేపీ నేతలు ఒకరిపై ఒకరు తీవ్ర ఆరోపణలు చేసుకుంటున్నారు. తమ కార్యకర్తలపై అకారణంగా దాడులు చేశారని టీఎంసీ ఆరోపిస్తుండగా, టీఎంసీకి చెందిన రౌడీ మూకలే కాల్పులు జరిపారని, వారి వల్లే జవాన్ గాయపడ్డారని బీజేపీ ప్రతివిమర్శలు చేస్తోంది. ఈ ఘటనల నేపథ్యంలో భట్పారా, జగద్దల్ ప్రాంతాల్లో భారీ ఎత్తున పోలీసు బలగాలను మోహరించారు. 

ఇది కూడా చదవండి: చద్దా టీ పార్టీకి సీచేవాల్ ‘షాక్’.. దిమ్మతిరిగే కౌంటర్‌తో..
 

Advertisement
 
Advertisement
Advertisement