చద్దా టీ పార్టీకి సీచేవాల్ ‘షాక్’.. దిమ్మతిరిగే కౌంటర్‌తో.. | AAP Rajya Sabha Crisis, Lone AAP MP Seechewal Exposes Raghav Chadhas Defection Plot, Reveals Pressure Tactics By Rebel MPs | Sakshi
Sakshi News home page

చద్దా టీ పార్టీకి సీచేవాల్ ‘షాక్’.. దిమ్మతిరిగే కౌంటర్‌తో..

Apr 27 2026 12:13 PM | Updated on Apr 27 2026 12:36 PM

Lone AAP MP Seechewal Exposes Raghav Chadhas Defection Plot

న్యూఢిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్‌)లో తీవ్ర సంక్షోభం రేగుతున్న వేళ, ఏడుగురు రాజ్యసభ సభ్యులు అనూహ్యంగా బీజేపీలో చేరడం దేశ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టించింది. ముఖ్యంగా పంజాబ్ నుండి ఆరుగురు ఎంపీలు పార్టీ మారగా, ఒకే ఒక్క రాజ్యసభ ఎంపీ, పద్మశ్రీ అవార్డు గ్రహీత, పర్యావరణవేత్త బల్బీర్ సింగ్ సీచేవాల్ మాత్రం ‘ఆప్‌’లోనే కొనసాగాలని నిర్ణయించుకున్నారు. తనను కూడా రెబల్ గ్రూప్‌లో చేరాలని రాఘవ్ చద్దా వర్గం ఎలా ప్రలోభపెట్టిందో, తాను ఎందుకు నిర్మొహమాటంగా వారి ఆఫర్‌కు ‘నో’ చెప్పానో ఆయన స్వయంగా వెల్లడించారు.

విక్రమ్ సాహ్నీ ఫోన్.. సీచేవాల్ స్ట్రాంగ్ వార్నింగ్
పార్టీ ఫిరాయింపులకు ముందు విక్రమ్ సాహ్నీ తనకు నేరుగా ఫోన్ చేశారని సీచేవాల్ స్థానిక మీడియాకు తెలిపారు. తామంతా కలిసి ఒక స్వతంత్ర వర్గంగా ఏర్పడుతున్నామని, పలువురు ఇప్పటికే సంతకాలు చేశారని, తాను కూడా ఆ పత్రాలపై సంతకం చేయాలని సాహ్నీ కోరినట్లు ఆయన వివరించారు. అయితే తనకు అలాంటి ఉద్దేశం ఏదీ లేదని స్పష్టం చేస్తూ, సాహ్నీ ప్రతిపాదనను తాను నిర్ద్వంద్వంగా తిరస్కరించినట్లు వెల్లడించారు. ఈ ఫిరాయింపుదారుల జాబితాలో రాఘవ్ చద్దా, సందీప్ పాఠక్‌లతో పాటు లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ వ్యవస్థాపకుడు అశోక్ కుమార్ మిట్టల్ కూడా ఉన్నారని సాహ్నీ చెప్పినట్లు సీచేవాల్ గుర్తుచేసుకున్నారు.

చద్దా ‘టీ’ పార్టీకి దిమ్మతిరిగే కౌంటర్
ఏప్రిల్ 16-18 మధ్య జరిగిన పార్లమెంట్ సమావేశాల సమయంలో జరిగిన ఒక ఆసక్తికర సంఘటనను సీచేవాల్ పంచుకున్నారు. రాఘవ్ చద్దా వర్గం తనను టీ తాగడానికి ఆహ్వానించిందని, ‘బాబా జీ, కూర్చుని టీ తాగుదాం రండి’ అని పిలిచారని చెప్పారు. అయితే వారి ఉద్దేశాన్ని పసిగట్టిన సీచేవాల్.. ‘మీరే తాగండి’ అని బదులిచ్చి వారి ఆహ్వానాన్ని సున్నితంగా తిరస్కరించారు.

వాళ్లకు నేను నచ్చలేదు.. అందుకే ఈ దూరం
పార్టీ మారిన ఎంపీల ఇళ్లపై ‘గద్దర్’ (ద్రోహి) అని రాసి ఉండటంపై స్పందించిన ఆయన, గురువాణిని ఉటంకిస్తూ కఠినమైన పదాలు మాట్లాడటం తనకు ఇష్టం లేదని అన్నారు. బీజేపీ నుండి తనకు ఎలాంటి ఒత్తిడి రాలేదని స్పష్టం చేశారు. పార్టీ మారిన వారు తనను ఎన్నడూ సహోద్యోగిగా పరిగణించలేదని, రాజ్యసభలో తన పనితీరు, పంజాబ్ సమస్యలపై తాను వేసే ప్రశ్నలు వారికి నచ్చేవి కావని సీచేవాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజ్యసభలో బిల్లులపై మాట్లాడే అవకాశం కూడా తనకు ఇవ్వకుండా అప్పటి ఆప్ డిప్యూటీ లీడర్ (రాఘవ్ చద్దాను ఉద్దేశిస్తూ) అడ్డుకున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

ఇది కూడా చదవండి: ‘ఇక ఏదీ మునుపటిలా ఉండదు’

Advertisement
 
Advertisement
Advertisement