‘ఇక ఏదీ మునుపటిలా ఉండదు’ | Former Meta executive warns nothing would ever be the same | Sakshi
Sakshi News home page

‘ఇక ఏదీ మునుపటిలా ఉండదు’

Apr 27 2026 11:49 AM | Updated on Apr 27 2026 12:44 PM

Former Meta executive warns nothing would ever be the same

లండన్‌: కృత్రిమ మేధస్సు (ఏఐ) రాకతో ప్రపంచవ్యాప్తంగా ఉద్యోగ రంగంలో  అలజడి చెలరేగుతోంది. గడిచిన 37 ఏళ్లలో ఎన్నడూ లేనంత దారుణమైన పరిస్థితిని ప్రస్తుత ఎంట్రీ-లెవల్ జాబ్ మార్కెట్ ఎదుర్కొంటోంది. ఏఐ దెబ్బకు అగ్రశ్రేణి యూనివర్సిటీల విద్యార్థులు సైతం ఉద్యోగాలు సాధించలేక నానా అవస్థలు పడుతున్నారు. ఈ విపత్కర పరిణామాలను గమనించిన మెటా మాజీ ఎగ్జిక్యూటివ్ క్లారా షిహ్.. ‘ఇకపై ఏదీ మునుపటిలా ఉండదు’ అని హెచ్చరిస్తూనే, యువత (Gen Z) ఉద్యోగ వేట కోసం సరికొత్త ఏఐ సాధనాలను ఆశ్రయించాలన్నారు.

టాపర్లనే దాటేసిన ఏఐ.. షాకింగ్ నిజాలు
మెటా, సేల్స్ ఫోర్స్ వంటి దిగ్గజ సంస్థల్లో పనిచేసిన క్లారా షిహ్.. ఏఐ టెక్నాలజీతో పొంచి ఉన్న ముప్పును ప్రత్యక్షంగా చూశారు. తమ సంస్థలోని అత్యుత్తమ ఉద్యోగుల కంటే ఏఐ ఏజెంట్లు అనేక పనుల్లో వేగంగా, అద్భుతంగా పనిచేయడం చూసి ఆమె విస్తుపోయారు. ఆ క్షణమే భవిష్యత్తు ఉద్యోగాలన్నీ ఏఐ మయం కాబోతున్నాయని ఆమె గ్రహించారు. ఏఐ ప్రభావంతో తన స్నేహితులు, బంధువుల పిల్లలు కనీసం ఎంట్రీ లెవెల్ ఉద్యోగాలు కూడా సాధించలేకపోవడం చూసి చలించిపోయారు. ఈ సంక్షోభం నుంచి యువతను గట్టెక్కించేందుకు ఆమె ‘న్యూ వర్క్ ఫౌండేషన్’ అనే లాభాపేక్షలేని సంస్థను స్థాపించారు.

ఏఐ దెబ్బకు ఏఐతోనే బదులు
ప్రస్తుతం వస్తున్న ఈ సాంకేతికతను చూసి భయపడటం కంటే, దానిని ఆయుధంగా మలచుకోవడమే ఏకైక మార్గమని క్లారా స్పష్టం చేస్తున్నారు. ఉద్యోగం సంపాదించాలన్నా, ఉన్న దాన్ని కాపాడుకోవాలన్నా ఏఐ ఏజెంట్లను సమర్థవంతంగా వాడుకోవడంలో యువత నైపుణ్యం సాధించడం తప్పనిసరి. ఇందుకోసం ‘డియర్ సీసీ’ పేరుతో యువత కోసం ప్రత్యేక ఏఐ టూల్స్ ను ఆమె అందుబాటులోకి తెచ్చారు. ఇందులో ‘ఫీల్డ్ రిపోర్ట్’ అనే టూల్.. విద్యార్థులు ఎంచుకున్న కెరీర్ లో ఉన్న ప్రస్తుత అవకాశాలు, అలాగే ఏఐ వల్ల ఆ రంగంలో పొంచి ఉన్న ఆటోమేషన్ ముప్పును విశ్లేషించి చెబుతుంది.

రెజ్యూమ్ అక్కర్లేదు.. ‘జాబ్‌క్లా’తో కొత్త రకం వేట
ఉద్యోగాన్వేషణను మరింత సులభతరం చేసేందుకు ‘జాబ్ క్లా’ (JobClaw) అనే మరో అద్భుతమైన టూల్‌ను కూడా ఈ ఫౌండేషన్ పరిచయం చేసింది. దీనికి ఎలాంటి రెజ్యూమ్ అవసరం లేదు. కేవలం ఐదు సాధారణ ప్రశ్నలకు సమాధానాలు ఇస్తే చాలు, అభ్యర్థి ఆసక్తులు, బలాలు ఆధారంగా సరిపోయే ఉద్యోగాలను ఇది వెతికి పెడుతుంది. మరోవైపు ఏఐ విషయంలో యువతలో ఆందోళన, కోపం పెరుగుతున్నాయని గాలప్ సర్వే వెల్లడించింది. 

ఇది కూడా చదవండి: నాడు రోమాలపై హేళన.. నేడు ఇంటర్లోనూ టాపర్!
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement