breaking news
Entry-level jobs
-
ఎంట్రీలెవల్ ఉద్యోగాల్లో మహిళలు అంతంతే!
ముంబై: ప్రైవేటు రంగంలో ఎంట్రీలెవల్ (ఆరంభ స్థాయి) ఉద్యోగాలు, మేనేజర్ స్థాయి ఉద్యోగాల్లో మహిళలకు సముచిత స్థానం దక్కడం లేదు. ప్రతి మూడు ఎంట్రీలెవల్ ఉద్యోగాల్లో ఒకే మహిళ ఉంటుంటే.. నిర్వహణ బాధ్యతల్లో మహిళల స్థానం 24 శాతంగా ఉన్నట్టు మెకిన్సే అండ్ కంపెనీ విడుదల చేసిన తాజా నివేదిక వెల్లడించింది. పట్టభద్రుల్లో సగం మంది మహిళలు ఉంటుంటే.. ప్రైవేటు సంఘటిత రంగంలో ఉద్యోగం పొందడం, ఉన్నత పదవులను అధిరోహించడం, వాటిని నిలుపుకునే విషయంలో వారు వ్యవస్థీకృత అడ్డంకులను ఎదుర్కొంటున్నారని పేర్కొంది. ఆరంభ స్థాయి, మేనేజర్ ఉద్యోగాల్లో స్త్రీ–పురుష ఉద్యోగుల మధ్య ఉన్న అంతరాన్ని ఈ నివేదిక ప్రస్తావించింది. భారత్, నైజీరియా, కెన్యా వ్యాప్తంగా 324 సంస్థల ఉద్యోగ డేటాను మెకిన్సే అండ్ కంపెనీ విశ్లేషించింది. ఇందులో భారత్ నుంచి 77 ప్రైవేటు సంస్థల డేటా కూడా ఉంది. ఇక భారత్‌లో ఎంట్రీలెవల్ ఉద్యోగాల విషయంలో స్త్రీ–పురుషుల మధ్య వయసులోనూ అంతరం నెలకొన్నట్టు ఈ నివేదిక వెల్లడించింది. మహిళల సగటు వయసు 39 ఏళ్లుగా ఉంటే, పురుషుల వయసు 32 ఏళ్లుగా ఉంది. మెకిన్సే విశ్లేíÙంచిన అన్ని దేశాల్లోనూ ఈ వయసు అంతరం భారత్‌లోనే ఎక్కువగా ఉంది. దీని ఆధారంగా భారత్‌లో ఎక్కువ మంది మహిళలు ప్రైవేటు రంగంలో ఉపాధిని ఆలస్యంగా ప్రారంభిస్తున్నట్టు తెలుస్తోందని ఈ నివేదిక పేర్కొంది. పదోన్నతులూ తక్కువే..పురుషులతో పోల్చి చూస్తే ఎంట్రీలెవల్ ఉద్యోగాల్లోని మహిళలకు పదోన్నతులు తక్కువగానే దక్కుతున్నాయి. స్త్రీలతో పోల్చి చూసినప్పుడు 2.4 రెట్లు అధికంగా పురుషులకు మేనేజర్ పదవులను అలంకరిస్తున్నారు. అంతేకాదు పురుషులతో పోల్చి చూస్తే మహిళలు 1.3 రెట్లు అధికంగా ఈ ఉద్యో గాలను వీడుతున్నారు. పెద్దగా పదోన్నతులు ఇవ్వకుండా, మహిళలను ఎంట్రీ లెవల్ ఉద్యోగాల్లోనే అట్టిపెట్టుకోవడం అన్నది వారి కెరీర్ పురోగతికి అవరోధమని ఈ నివేదిక పేర్కొంది. ‘‘పని ప్రదేశాల్లో లింగ సమానత్వం అన్నది నైతిక లేదా సామాజిక అవసరమే కాదు. ఇదొక వ్యూహాత్మకం కూడా. 2035 నాటికి భారత్ 8 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా అవతరించాలన్న లక్ష్యం నేపథ్యంలో మహిళలను సంఘటిత రంగంలో పూర్తి స్థాయిలో మమేకం చేయడం అన్నది అభివృద్ధికి పు నాది అవుతుంది. చాలా సంస్థలు వైవిధ్యమైన నిర్వహణ, బృందాల ఆవశ్యకతను గుర్తించినప్పటికీ పురోగతి ఆశించిన మేర లేదు’’అని మెకిన్సే అండ్ కంపెనీ సీనియర్ పార్ట్నర్ వివేక్ పండిట్ తెలిపారు. -
ఎంట్రీ అదిరింది
సాక్షి ప్రత్యేక ప్రతినిధి: ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్‌కు ఈ ఏడాది ఉద్యోగాల పంట పండుతోంది. ప్రముఖ ఐటీ కంపెనీలు ఎంట్రీ లెవెల్ ఉద్యోగాల కోసం నిర్వహించే క్యాంపస్ సెలక్షన్స్ ద్వారా ఇంజనీరింగ్ విద్యార్థులకు భారీ స్థాయిలో ఉద్యోగావకాశాలు కల్పించాయి. ఈ ఆర్థిక సంవత్సరం చివరి నాటికి 1.80 లక్షల మందికి ప్లేస్‌మెంట్స్ ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్న కంపెనీలు ఇప్పటికే 1.54 లక్షల మంది బీటెక్ విద్యార్థులను తమ కంపెనీల్లో ఉద్యోగులుగా చేర్చుకున్నాయి. అయితే ఈ ఎంట్రీలెవెల్ ఉద్యోగాల్లో 94 శాతం మంది ఇంజనీరింగ్ విద్యార్థులు చేరుతుండగా, 6 శాతం మంది బీఎస్సీ (కంప్యూటర్స్) విద్యార్థులున్నారు. ఈ రెండు కోర్సులకు ప్రాధాన్యం ఇస్తున్న ఐటీ కంపెనీలు ఎంటెక్ చదువుతున్న వారికి ఉద్యోగం ఇచ్చేందుకు మాత్రం ఆసక్తి చూపకపోవటం గమనార్హం. ఈ ఏడాది టయర్–1, టయర్–2కే పరిమితం టీసీఎల్, ఇన్ఫోసిస్, కాగ్నిజెంట్, ఆక్సెంచర్, విప్రోలాంటి టాప్ కంపెనీలు దేశవ్యాప్తంగా డిసెంబర్ 10 నాటికి 65 వేల మందికి ఉద్యోగాలు కల్పించాయి. ఈ ఏడాది ఇప్పటివరకు హైదరాబాద్‌లోని టయర్–1, టయర్–2 ఇంజనీరింగ్ కాలేజీల్లో దాదాపు 8 వేల మందిని 5 టాప్ ఐటీ కంపెనీలు ఉద్యోగులుగా నియమించుకున్నాయి. మైక్రోసాఫ్ట్, బ్యాంక్ అఫ్ అమెరికా, ఒరాకిల్, అమెజాన్, డెలాయిట్ వంటి ప్రతిష్టాత్మక కంపెనీలు టయర్–1 కాలేజీలకు మాత్రమే పరిమితమయ్యాయి. హైదరాబాద్‌లో టయర్–1 కేటగిరీకి చెందిన 12 ఇంజనీరింగ్ కళాశాలల మొత్తం విద్యార్థుల్లో 92 శాతం మందికి ఉద్యోగాలు లభించాయి. అలాగే ఐఐటీ హైదరాబాద్, నిట్ వరంగల్, బిట్స్ శామీర్‌పేట కళాశాలల నుంచి ప్లేస్‌మెంట్‌కు హాజరైన ప్రతి విద్యార్థికి ఉద్యోగం లభించగా, ఐఐటీ, నిట్ విద్యార్థులకు విదేశీ సంస్థలు భారీగా ఆఫర్లు ఇచ్చాయి. అయితే, వచ్చే ఏడాది హైదరాబాద్‌లోని టయర్–3 కళాశాలల్లో నియామకాలు చేపడతామని టీసీఎస్, ఇన్ఫోసిస్, ఆక్సెంచర్ లాంటి కంపెనీలు ప్రకటించడం మంచి పరిణామంగా కనిపిస్తోంది. అదే జరిగితే దాదాపు 60 ఇంజనీరింగ్ కాలేజీల్లో క్యాంపస్ ప్లేస్మెంట్లకు అవకాశం ఉంటుంది. వచ్చే ఏడాది 2 లక్షల ఉద్యోగాలు నాస్కామ్ అంచనా ప్రకారం వచ్చే ఏడాది ఎంట్రీ లెవెల్లో 2 లక్షల ఉద్యోగావకాశాలు లభిస్తాయి. అదే జరిగితే తెలంగాణ, ఏపీలోని టయర్–1, 2, 3 కాలేజీల్లో దాదాపు 25 వేల మంది బీటెక్ విద్యార్థులకు ఉద్యోగావకాశాలు లభిస్తాయని ఓ ప్రముఖ ఇంజనీరింగ్ కాలేజీ ప్లేస్మెంట్ అధికారి చెప్పారు. ఈ ఏడాది ముందుగా అనుకున్న దానికంటే ఎక్కువ మందికి ఉద్యోగావకాశాలు లభించాయని, వచ్చే ఏడాదికి ఇప్పటినుంచే కంపెనీల నుంచి లేఖలు అందుతున్నాయని ఆ అధికారి వెల్లడించారు. హైదరాబాద్, విశాఖపట్నంలో ఐటీ కంపెనీల కార్యకలాపాలు పెరుగుతున్న దృష్ట్యా ఉద్యోగావకాశాలు పెరుగుతాయని ఐటీ విశ్లేషకులు అంటున్నారు. విదేశాల నుంచి భారీగా ఆర్డర్లు.. ఇప్పటివరకు దేశీయ సాఫ్ట్వేర్ కంపెనీలకు ఉత్తర అమెరికా నుంచి భారీగా ఆర్డర్లు వచ్చేవి. ఇప్పుడు యూరప్, దక్షిణాఫ్రికా, దక్షిణ కొరియాతో పాటు గల్ఫ్ దేశాలు, దక్షిణ అమెరికా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ వంటి దేశాల నుంచి భారీగా ఆర్డర్లు వచ్చిపడుతున్నాయి. ఇక గడచిన ఆరు మాసాల్లో 100 బిలియన్ డాలర్ల మేర ఆర్డర్లు వచ్చాయని నాస్కామ్ ప్రతినిధి ఒకరు తెలిపారు. గడచిన ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే ఈ ఏడాది చివరి నాటికి టీసీఎస్, ఇన్ఫోసిస్, విప్రో భారీగా ఆదాయాన్ని సమకూర్చుకునే అవకాశం ఉంది. కాగ్నిజెంట్, ఆక్సెంచర్ వంటి విదేశీ కంపెనీలు ఇక్కడ ఉద్యోగులను నియమించుకుని శిక్షణ అనంతరం ఆస్ట్రేలియా, అమెరికా, కెనడా, బ్రిటన్, ఐర్లాండ్ వంటి దేశాలకు బదిలీ చేస్తున్నాయి. హెచ్1బీ వీసాల కారణంగా అమెరికా బదులు కెనడా, యూరప్ దేశాల్లోని కార్యాలయాల్లో ఎక్కువగా ఉద్యోగులను నియమించుకుంటున్నాయి. -
ప్రవేశ స్థాయి జాబ్స్‌కు డిమాండ్
న్యూఢిల్లీ: ఎంట్రీ లెవెల్ ఉద్యోగాలకు గతేడాది డిమాండ్ 6.7% పెరిగిందని అసోచామ్ అధ్యయనంలో వెల్లడైంది. ఇదే ఏడాది మిడిల్, సీనియర్ స్థాయి ఉద్యోగాలు 5.1% క్షీణించడం గమనార్హం. కంపెనీల ఉద్యోగ ప్రకటనలతో పాటు వివిధ జాబ్ పోర్టల్స్ ద్వారా 4,500కు పైగా కంపెనీల్లో ఖాళీలను విశ్లేషించినట్లు అసోచామ్ సెక్రటరీ జనరల్ డీఎస్ రావత్ తెలిపారు. వివరాల్లోకి వెళితే... 2012లో వివిధ కంపెనీల్లో 5.52 లక్షల ఉద్యోగావకాశాలు రాగా, 2013లో ఆ సంఖ్య 5.50 లక్షలకు తగ్గింది. ఢిల్లీ, నేషనల్ క్యాపిటల్ రీజియన్(ఎన్సీఆర్)లో ఎంట్రీ లెవెల్ ఉద్యోగాలు గతేడాది అత్యధికంగా 26.8% పెరిగాయి. హైదరాబాద్‌లో ఈ ఉద్యోగాలు 15.2% వృద్ధి చెందగా కోల్‌కతాలో 12.7%, బెంగళూరులో 6.6%, అహ్మదాబాద్‌లో 0.5% వృద్ధి రేటు నమోదైంది. ఎంట్రీ లెవెల్ ఉద్యోగాలు క్షీణించిన ప్రథమ శ్రేణి నగరాల్లో ముంబై, చెన్నై ఉన్నాయి. 2013లో ఈ తరహా ఉద్యోగాలు పెరిగిన ద్వితీయ శ్రేణి నగరాల్లో నాగపూర్ (64.7%), లక్నో (39.1%), కొచ్చిన్ (35.3%), విశాఖపట్నం (22.7%), విజయవాడ (15.9%), జైపూర్ (9.5%), మీరట్ (6.9%), చండీగఢ్ (6.8%) ఉన్నాయి.