ఎంట్రీ అదిరింది | Entry Level Jobs For Engineering Students | Sakshi
Sakshi News home page

ఎంట్రీ అదిరింది

Dec 18 2019 1:20 AM | Updated on Dec 18 2019 4:42 AM

Entry Level Jobs For Engineering Students - Sakshi

సాక్షి ప్రత్యేక ప్రతినిధి: ఇంజనీరింగ్‌ గ్రాడ్యుయేట్స్‌కు ఈ ఏడాది ఉద్యోగాల పంట పండుతోంది. ప్రముఖ ఐటీ కంపెనీలు ఎంట్రీ లెవెల్‌ ఉద్యోగాల కోసం నిర్వహించే క్యాంపస్‌ సెలక్షన్స్‌ ద్వారా ఇంజనీరింగ్‌ విద్యార్థులకు భారీ స్థాయిలో ఉద్యోగావకాశాలు కల్పించాయి. ఈ ఆర్థిక సంవత్సరం చివరి నాటికి 1.80 లక్షల మందికి ప్లేస్‌మెంట్స్‌ ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్న కంపెనీలు ఇప్పటికే 1.54 లక్షల మంది బీటెక్‌ విద్యార్థులను తమ కంపెనీల్లో ఉద్యోగులుగా చేర్చుకున్నాయి. అయితే ఈ ఎంట్రీలెవెల్‌ ఉద్యోగాల్లో 94 శాతం మంది ఇంజనీరింగ్‌ విద్యార్థులు చేరుతుండగా, 6 శాతం మంది బీఎస్సీ (కంప్యూటర్స్‌) విద్యార్థులున్నారు. ఈ రెండు కోర్సులకు ప్రాధాన్యం ఇస్తున్న ఐటీ కంపెనీలు ఎంటెక్‌ చదువుతున్న వారికి ఉద్యోగం ఇచ్చేందుకు మాత్రం ఆసక్తి చూపకపోవటం గమనార్హం.

ఈ ఏడాది టయర్‌–1, టయర్‌–2కే పరిమితం  
టీసీఎల్, ఇన్ఫోసిస్, కాగ్నిజెంట్, ఆక్సెంచర్, విప్రోలాంటి టాప్‌ కంపెనీలు దేశవ్యాప్తంగా డిసెంబర్‌ 10 నాటికి 65 వేల మందికి ఉద్యోగాలు కల్పించాయి. ఈ ఏడాది ఇప్పటివరకు హైదరాబాద్‌లోని టయర్‌–1, టయర్‌–2 ఇంజనీరింగ్‌ కాలేజీల్లో దాదాపు 8 వేల మందిని 5 టాప్‌ ఐటీ కంపెనీలు ఉద్యోగులుగా నియమించుకున్నాయి. మైక్రోసాఫ్ట్, బ్యాంక్‌ అఫ్‌ అమెరికా, ఒరాకిల్, అమెజాన్, డెలాయిట్‌ వంటి ప్రతిష్టాత్మక కంపెనీలు టయర్‌–1 కాలేజీలకు మాత్రమే పరిమితమయ్యాయి.

హైదరాబాద్‌లో టయర్‌–1 కేటగిరీకి చెందిన 12 ఇంజనీరింగ్‌ కళాశాలల మొత్తం విద్యార్థుల్లో 92 శాతం మందికి ఉద్యోగాలు లభించాయి. అలాగే ఐఐటీ హైదరాబాద్, నిట్‌ వరంగల్, బిట్స్‌ శామీర్‌పేట కళాశాలల నుంచి ప్లేస్‌మెంట్‌కు హాజరైన ప్రతి విద్యార్థికి ఉద్యోగం లభించగా, ఐఐటీ, నిట్‌ విద్యార్థులకు విదేశీ సంస్థలు భారీగా ఆఫర్లు ఇచ్చాయి. అయితే, వచ్చే ఏడాది హైదరాబాద్‌లోని టయర్‌–3 కళాశాలల్లో నియామకాలు చేపడతామని టీసీఎస్, ఇన్ఫోసిస్, ఆక్సెంచర్‌ లాంటి కంపెనీలు ప్రకటించడం మంచి పరిణామంగా కనిపిస్తోంది. అదే జరిగితే దాదాపు 60 ఇంజనీరింగ్‌ కాలేజీల్లో క్యాంపస్‌ ప్లేస్‌మెంట్లకు అవకాశం ఉంటుంది.  

వచ్చే ఏడాది 2 లక్షల ఉద్యోగాలు 
నాస్కామ్‌ అంచనా ప్రకారం వచ్చే ఏడాది ఎంట్రీ లెవెల్‌లో 2 లక్షల ఉద్యోగావకాశాలు లభిస్తాయి. అదే జరిగితే తెలంగాణ, ఏపీలోని టయర్‌–1, 2, 3 కాలేజీల్లో దాదాపు 25 వేల మంది బీటెక్‌ విద్యార్థులకు ఉద్యోగావకాశాలు లభిస్తాయని ఓ ప్రముఖ ఇంజనీరింగ్‌ కాలేజీ ప్లేస్‌మెంట్‌ అధికారి చెప్పారు.

ఈ ఏడాది ముందుగా అనుకున్న దానికంటే ఎక్కువ మందికి ఉద్యోగావకాశాలు లభించాయని, వచ్చే ఏడాదికి ఇప్పటినుంచే కంపెనీల నుంచి లేఖలు అందుతున్నాయని ఆ అధికారి వెల్లడించారు. హైదరాబాద్, విశాఖపట్నంలో ఐటీ కంపెనీల కార్యకలాపాలు పెరుగుతున్న దృష్ట్యా ఉద్యోగావకాశాలు పెరుగుతాయని ఐటీ విశ్లేషకులు అంటున్నారు.  

విదేశాల నుంచి భారీగా ఆర్డర్లు..
ఇప్పటివరకు దేశీయ సాఫ్ట్‌వేర్‌ కంపెనీలకు ఉత్తర అమెరికా నుంచి భారీగా ఆర్డర్లు వచ్చేవి. ఇప్పుడు యూరప్, దక్షిణాఫ్రికా, దక్షిణ కొరియాతో పాటు గల్ఫ్‌ దేశాలు, దక్షిణ అమెరికా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌ వంటి దేశాల నుంచి భారీగా ఆర్డర్లు వచ్చిపడుతున్నాయి. ఇక గడచిన ఆరు మాసాల్లో 100 బిలియన్‌ డాలర్ల మేర ఆర్డర్లు వచ్చాయని నాస్కామ్‌ ప్రతినిధి ఒకరు తెలిపారు. గడచిన ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే ఈ ఏడాది చివరి నాటికి టీసీఎస్, ఇన్ఫోసిస్, విప్రో భారీగా ఆదాయాన్ని సమకూర్చుకునే అవకాశం ఉంది. కాగ్నిజెంట్, ఆక్సెంచర్‌ వంటి విదేశీ కంపెనీలు ఇక్కడ ఉద్యోగులను నియమించుకుని శిక్షణ అనంతరం ఆస్ట్రేలియా, అమెరికా, కెనడా, బ్రిటన్, ఐర్లాండ్‌ వంటి దేశాలకు బదిలీ చేస్తున్నాయి. హెచ్‌1బీ వీసాల కారణంగా అమెరికా బదులు కెనడా, యూరప్‌ దేశాల్లోని కార్యాలయాల్లో ఎక్కువగా ఉద్యోగులను నియమించుకుంటున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement