Hyderabad: హైస్పీడ్‌ హబ్‌.. ‘ట్రయాంగిల్‌ డైమండ్‌’ | hyderabad to Get 350 kmph High-Speed Rail | Sakshi
Sakshi News home page

Hyderabad: హైస్పీడ్‌ హబ్‌.. ‘ట్రయాంగిల్‌ డైమండ్‌’

Feb 3 2026 11:56 AM | Updated on Feb 3 2026 12:34 PM

hyderabad to Get 350 kmph High-Speed Rail

సాక్షి, హైదరాబాద్‌: నేలపై విమానాలు దూసుకెళ్తున్నాయా.. అనుకునేంత హైస్పీడ్‌తో నడిచే రైళ్లు హైదరాబాద్‌ నుంచి రాకపోకలు సాగించనున్నాయి. వేగం గంటకు సుమారు 350 కి.మీ. ఉండనుంది. మహానగర కీర్తికిరీటంలో మరో కలికితురాయిగా ‘ట్రయాంగిల్‌ డైమండ్‌’ వచ్చి చేరనుంది. నగరం నుంచి చెన్నై, బెంగళూర్, పుణెలకు హైస్పీడ్‌ రైల్‌ కనెక్టివిటీ అందుబాటులోకి రానుంది. ఈ మూడు కారిడార్‌లను కలిపేవిధంగా దక్షిణ మధ్య రైల్వే భారీ టెర్మినల్‌ను నిర్మించనుంది. 

రాష్ట్ర ప్రభుత్వం స్థలమిస్తే శంషాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయానికి సమీపంలోగానీ, ఫ్యూచర్‌ సిటీలోగానీ (Future City) టెర్మినల్‌ రూపుదాల్చనుంది. పుణె నుంచి ముంబై వరకు కూడా హైస్పీడ్‌ కారిడార్‌ విస్తరించనున్న దృష్ట్యా హైదరాబాద్‌ నుంచి పుణె మీదుగా ముంబైకి రాకపోకలకు అవకాశం లభించనుంది. ఈ డైమండ్‌ ట్రయాంగిల్‌ కారిడార్‌లు దక్షిణాది రాష్ట్రాల మధ్య మరింత సమన్వయానికి దోహదం చేస్తాయి. ఫలితంగా విద్య, వైద్య, పర్యాటక రంగాల్లో అభివృద్ధికి అవకాశం లభిస్తుంది.  

ఎయిర్‌పోర్టును తలపించేలా.. 
ఎయిర్‌పోర్టు తరహాలోనే హైస్పీడ్‌ రైల్వే టెర్మినల్‌ నిర్మించనున్నట్లు రైల్వే అధికారులు చెబుతున్నారు. సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌ను కూడా విమానాశ్రయం తరహాలోనే పునరాభివృద్ధి చేస్తున్న సంగతి తెలిసిందే. అంతకంటే అత్యాధునిక సాంకేతిక హంగులతో హైస్పీడ్‌ రైల్‌ టెర్మినల్‌ నిర్మించనున్నారు. దీనికోసం ఎన్ని వందల ఎకరాల భూమి అవసరమవుతుందనే అంశంతోపాటు విధివిధానాలపై త్వరలో కసరత్తు చేపట్టే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. అంతర్జాతీయ విమానాశ్రయానికి హైస్పీడ్‌ రైల్వే టెర్మినల్‌ (High Speed Train Terminal) అందుబాటులో ఉంటే ప్రయాణికులకు రెండు రకాల ప్రయాణ సదుపాయాలు సమాంతరంగా లభించే అవకాశం ఉంటుంది.  

రెండున్నర గంటల్లో ముంబైకి..  
కారిడార్‌ల సామర్ధ్యం గరిష్టంగా 350 కి.మీ. వరకు ఉన్నప్పటికీ హాల్టింగ్‌ స్టేషన్‌లు, మలుపులు, తదితర సాంకేతిక అవసరాల దృష్ట్యా రైళ్ల వేగం కొంతవరకు తగ్గనుంది. ఇప్పుడు హైదరాబాద్‌ నుంచి చెన్నైకి 12 నుంచి 13 గంటల సమయం పడుతుండగా హైస్పీడ్‌ రైల్‌లో 2.55 గంటల్లో చేరుకోవచ్చు. బెంగళూరుకు 2 గంటలు, పుణెకు 1.55 గంటల్లో చేరుకొనే అవకాశం ఉంటుంది. హైదరాబాద్‌ నుంచి పుణె మీదుగా ముంబైకి హైస్పీడ్‌ రైలులో రెండున్నర గంటల్లో చేరుకోవచ్చని అధికారులు భావిస్తున్నారు. ప్రస్తుతం హైదరాబాద్‌ నుంచి బెంగళూరుకు ప్రతిరోజు 5 వేల మంది రాకపోకలు సాగిస్తున్నారు. చెన్నై, ముంబైకి కూడా రోజుకు సుమారు 2,500 నుంచి 3 వేలకుపైగా మంది రాకపోకలు సాగిస్తున్నట్లు అంచనా. బస్సులు, విమానాలు, సొంత వాహనాల్లో వెళ్లేవారిని కలిపితే ఈ సంఖ్య ఎక్కువగానే ఉంటుంది. ప్రస్తుతం రైళ్లు, విమానాల్లో ఎక్కువగా ప్రయాణించేవారు భవిష్యత్తులో హైస్పీడ్‌ రైళ్లను ఎంపిక చేసుకొనే అవకాశం ఉంటుంది.  

పునరాభివృద్ధికి మరో ఏడాది... 
సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌ (Secunderabad Railway Station) పునరాభివృద్ధి ప్రాజెక్టు పూర్తయ్యేందుకు మరో ఏడాది పట్టనుంది. వచ్చే మార్చి నాటికి స్టేషన్‌ పదో నెంబర్‌ వైపు పనులు పూర్తవుతాయని, ఒకటో నెంబర్‌ వైపు పూర్తి చేసేందుకు మరింత సమయం పడుతుందని దక్షిణ మధ్య రైల్వే జనరల్‌ మేనేజర్‌ సంజయ్‌కుమార్‌ శ్రీవాస్తవ తెలిపారు. అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా సుమారు రూ.750 కోట్లతో సికింద్రాబాద్‌ స్టేషన్‌ పునరాభివృద్ధి పనులు చేట్టిన సంగతి తెలిసిందే. నగరంలో ఎంఎంటీఎస్‌ సర్వీసులను త్వరలోనే క్రమబద్ధీకరించనున్నట్లు జీఎం పేర్కొన్నారు. ప్రయాణికులకు పారదర్శకమైన సదుపాయం లభించేవిధంగా చర్యలు చేపట్టనున్నట్లు చెప్పారు.  

Advertisement
 
Advertisement
Advertisement