‘మెట్రో’లో చిల్లర చేష్టలు.. లక్షకు పైగా ఫిర్యాదులు | Zero Civic Sense Bengaluru Metro Records 1 Lakh Violations | Sakshi
Sakshi News home page

‘మెట్రో’లో చిల్లర చేష్టలు.. లక్షకు పైగా ఫిర్యాదులు

Feb 2 2026 12:24 PM | Updated on Feb 2 2026 12:31 PM

Zero Civic Sense Bengaluru Metro Records 1 Lakh Violations

బెంగళూరు: రైలు, బస్సు, విమాన ప్రయాణాల్లో తోటి ప్రయాణికులకు ఇబ్బంది కలిగించకుండా మెలగడమనేది కనీస బాధ్యత అని చెబుతుంటారు. అయితే బెంగళూరు ‘నమ్మ మెట్రో’లో ఇందుకు భిన్నమైన వాతావరణం కనిపిస్తూ, కలవర పెడుతోంది. ప్రయాణికుల పౌర స్పృహ (Civic Sense) ప్రశ్నార్థకంగా మారుతోంది.

హెడ్‌ఫోన్లు లేకుండా బిగ్గరగా సంగీతం వినడం, రిజర్వ్ చేసిన సీట్లను ఆక్రమించుకోవడం, రైలులో ఆహారం తీసుకోవడం తదితర సుమారు లక్షకు పైగా ఉల్లంఘనల కేసులు గత ఏడాది కాలంలో బెంగళూరు ‘నమ్మ మెట్రో’ నమోదయ్యాయి. ప్రయాణికుల నుంచి నిత్యం వస్తున్న ఫిర్యాదులను పరిగణనలోకి తీసుకున్న మెట్రో అధికారులు, ఈ గణాంకాలను చూసి ఆశ్చర్యపోతున్నారు. క్రమశిక్షణ లేని ప్రయాణికుల వల్ల తోటి వారికి కలుగుతున్న ఇబ్బందులను అరికట్టేందుకు భారీ ఎత్తున జరిమానాలు విధించేందుకు బెంగళూరు మెట్రో రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ (బీఎంఆర్పీఎల్)సిద్ధమైంది.

​నివేదికల ప్రకారం సుమారు 57,538 మంది ప్రయాణికులు హెడ్‌ఫోన్లు లేకుండా బిగ్గరగా పాటలు పెట్టి ఇతరులకు ఇబ్బంది కలిగించారు. అలాగే, తమకు కేటాయించని రిజర్వ్డ్ సీట్లను 37,038 మంది ఆక్రమించుకోగా, 1,907 మంది రైలులో భోజనం చేస్తూ పట్టుబడ్డారు. వీటితో పాటు, 1,677 మంది నిబంధనలకు విరుద్ధంగా గుట్కా, పాన్ వంటి పొగాకు ఉత్పత్తులను తీసుకున్నట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ఇటువంటి చర్యలు ప్రయాణికుల మధ్య వాగ్వాదాలకు, ఘర్షణలకు దారితీస్తున్నాయని, కొన్ని సందర్భాల్లో భద్రతా సిబ్బంది జోక్యం చేసుకోవాల్సి వచ్చిందని అధికారులు తెలిపారు.

​మెట్రో రైల్వే (ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్) యాక్ట్, 2002 ప్రకారం ప్రయాణికులకు అసౌకర్యం కలిగించే ఏ చర్య అయినా శిక్షార్హమని బీఎంఆర్సీఎల్ స్పష్టం చేసింది. ముఖ్యంగా గర్భిణులు, వృద్ధులు, దివ్యాంగుల కోసం కేటాయించిన సీట్లను ఇతరులు ఆక్రమించుకుని, అడిగినా ఖాళీ చేయనివారిపై కఠినంగా వ్యవహరించనున్నట్లు అధికారులు తెలిపారు. మెట్రో అనేది సామాజిక బాధ్యతతో కూడిన పబ్లిక్ స్పేస్ అని, ఇక్కడ తోటి ప్రయాణికులకు గౌరవం ఇవ్వడం ప్రతీ ఒక్కరి కనీస ధర్మమని ‘నమ్మ మెట్రో’ యాజమాన్యం ఒక ప్రకటనలో పేర్కొంది.

​బాధ్యతాయుతమైన ప్రయాణ సంస్కృతిని ప్రోత్సహించేందుకు బీఎంఆర్సీఎల్ ఒక ప్రత్యేక అవగాహన డ్రైవ్‌ను ప్రారంభించింది. ఇందులో భాగంగా, ప్రతి మెట్రో రైలులో ఇద్దరు హోంగార్డులతో కూడిన ప్రత్యేక బృందాలను నియమించింది. వీరు నిరంతరం రైలులో తిరుగుతూ, నిబంధనలపై ప్రయాణికులకు అవగాహన కల్పిస్తారు. నిబంధనలు అతిక్రమించే వారికి హెచ్చరికలు జారీ చేయడంతో పాటు, అవసరమైతే అక్కడికక్కడే జరిమానాలు విధించేలా చర్యలు చేపట్టనున్నారు.

ఇది కూడా చదవండి: ఏఐ ‘దొంగ’ ఫొటోలు.. కంగుతిన్న పర్యాటకులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement