అద్దంలాంటి కన్నూర్ రైల్వేస్టేషన్
సాధారణంగా మన ఊళ్లలో రైల్వే స్టేషన్ అంటే ఎలా ఉంటుంది? ప్లాట్‌ఫాం నిండా పల్లీల తొక్కలు, పాన్‌పరాగ్ ఉమ్ములు, పట్టా ల మీద ప్లాస్టిక్ కవర్లు, దుర్గంధం.. ప్రయాణికులకు అనుభవమే. కానీ, సోషల్ మీడియాలో ఇప్పుడు సంచలనం సృష్టిస్తున్న ఒక వీడియో చూస్తే.. ‘ఇది మన దేశంలోనేనా?’.. అని ముక్కున వేలేసుకోవడం ఖాయం!
మచ్చుకైనా కానరాని చెత్త
అస్సాంకు చెందిన రేజావుల్ అనే యువకుడు కేరళలోని కన్నూర్ రైల్వే స్టేషన్‌కు వెళ్లినప్పుడు అక్కడి దృశ్యాలు చూసి ఆశ్చర్యం నుంచి తేరుకోలేకపోయాడు. వెంటనే కెమెరా తీసి ప్లాట్‌ఫాం నుంచి రైలు పట్టాల వరకు మొత్తం వీడియో తీశాడు. ప్లాట్‌ఫాం మీద అద్దంలా మెరుస్తున్న పలకలు ఒకెత్తయితే, సాధారణంగా చెత్తాచెదారంతో నిండిపోయే పట్టాల మీద.. కనీసం చిన్న కాగితం ముక్క కూడా కనిపించకపోవడం విశేషం. ‘ఏక్ భీ కచ్రా నహీ మిలేగా’ (ఇక్కడ ఒక్కటంటే ఒక్క చెత్త ముక్క కూడా మీకు దొరకదు!)’అని ఆ కుర్రాడు తన వీడియోలో కొనియాడాడు.
మిలియన్ల వ్యూస్..
ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన ఈ వీడియో గంటల్లోనే వైరలై మిలియన్ల వ్యూస్‌ను కొల్లగొట్టింది. ఇది కేవలం రైల్వే అధికారుల ఘనత మాత్రమే కాదు, అక్కడి ప్రజల పౌర బాధ్యత (సివిక్ సెన్స్)కు నిదర్శనమని నెటిజన్లు నీరాజనాలు పడుతున్నారు. ప్రభుత్వం ఎన్ని చట్టాలు చేసి నా, ప్రజలు సహకరించకపోతే ఏ ప్రాంతం శుభ్రంగా ఉండదని ఈ వీడియో నిరూపించింది. శుభ్రత అనేది వనరుల మీద కాదు, మనుషుల ఆలోచనా విధానం మీద ఆధారపడి ఉంటుందని కేరళ ప్రజలు చాటిచెప్పారు. మిగతా రాష్ట్రాల వారు కూడా కన్నూర్ స్టేషన్‌ను ఆదర్శంగా తీసుకోవాలంటూ నెటిజన్లు వ్యాఖ్యలతో హోరెత్తిస్తున్నారు. పాలనా యంత్రాంగం పని కాదిది.. మన అందరి బా ధ్యతని కన్నూర్ స్టేషన్ గట్టిగా నినదిస్తోంది.
– సాక్షి, నేషనల్ డెస్క్


