ప్రపంచకప్ హాకీ ‘డ్రా’ విడుదల
ఆగస్టులో మెగా టోర్నీకి నెదర్లాండ్స్–బెల్జియం ఆతిథ్యం
లుసానే (స్విట్జర్లాండ్): హాకీ వరల్డ్ కప్‌లో పాల్గొనే జట్ల గ్రూప్‌ల వివరాలను అంతర్జాతీయ హాకీ సమాఖ్య (ఎఫ్‌ఐహెచ్) వెల్లడించింది. రెండు ఒలింపిక్ స్వర్ణాలు, రెండు ప్రపంచకప్ విజయాల్లో భాగంగా ఉన్న డచ్ హాకీ క్రీడాకారిణి నవోమీ వాన్ ఆజ్ సహా పలువురు మాజీ ఆటగాళ్లు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. పురుషుల విభాగంలో, మహిళల విభాగంలో ఒకేసారి ప్రపంచకప్‌లను నిర్వహిస్తుండటం విశేషం.
బెల్జియం, నెదర్లాండ్స్‌లలో ఆగస్టు 14 నుంచి 30 వరకు పోటీలు జరుగుతాయి. రెండు మెగా టోరీ్నలకు సంబంధించిన వేర్వేరు మస్కట్‌లను కూడా ఎఫ్‌ఐహెచ్ విడుదల చేసింది. వరల్డ్ కప్‌లో మొత్తం 16 జట్ల చొప్పున పాల్గొంటున్నాయి. ఒక్కో పూల్ నుంచి టాప్–2 జట్లు ముందంజ వేస్తాయి. ఎనిమిది టీమ్‌లతో రెండో దశ నిర్వహిస్తారు. ఆ తర్వాత నాకౌట్ మ్యాచ్‌లు ఉంటాయి.
పురుషుల విభాగంలో పూల్ ‘డి’లో భారత్ బరిలోకి దిగుతోంది. ఈ పూల్‌లో భారత్‌తో పాటు పాకిస్తాన్, ఇంగ్లండ్, వేల్స్ జట్లు ఉన్నాయి. మహిళల విభాగంలో భారత్ పూల్ ‘డి’లో ఇంగ్లండ్, దక్షిణాఫ్రికా, చైనాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. టోర్నమెంట్ మ్యాచ్‌ల పూర్తిస్థాయి షెడ్యూల్‌ను నేడు ప్రకటిస్తారు. 2022లో జరిగిన వరల్డ్ కప్‌లో జర్మనీ, నెదర్లాండ్స్ పురుషుల, మహిళల విభాగాల్లో విజేతలుగా నిలిచాయి.
పూల్‌ల వివరాలు
పురుషుల విభాగం:
పూల్ ‘ఎ’: నెదర్లాండ్స్, అర్జెంటీనా, న్యూజిలాండ్, జపాన్; పూల్ ‘బి’: బెల్జియం, జర్మనీ, ఫ్రాన్స్, మలేసియా; పూల్ ‘సి’: ఆ్రస్టేలియా, స్పెయిన్, ఐర్లాండ్, దక్షిణాఫ్రికా; పూల్ ‘డి’: భారత్, పాకిస్తాన్, ఇంగ్లండ్, వేల్స్.
మహిళల విభాగం: పూల్ ‘ఎ’: నెదర్లాండ్స్, ఆ్రస్టేలియా, చిలీ, జపాన్; పూల్ ‘బి’: అర్జెంటీనా, జర్మనీ, అమెరికా, స్కాట్లాండ్; పూల్ ‘సి’: బెల్జియం, స్పెయిన్, న్యూజిలాండ్, ఐర్లాండ్; పూల్ ‘డి’: భారత్, ఇంగ్లండ్, చైనా, దక్షిణాఫ్రికా.


