కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో సంచలనం సృష్టించిన బీజేపీ సీనియర్ నేత సువేందు అధికారి త్వరలో కీలక నిర్ణయం తీసుకోనున్నారు. ముఖ్యమంత్రి మమతా బెనర్జీని భవానీపూర్‌లో 15 వేల ఓట్ల తేడాతో ఓడించి, నందిగ్రామ్‌లో ముచ్చటగా మూడోసారి అఖండ విజయం సాధించిన ఆయన.. ఈ రెండు స్థానాల్లో దేనిని వదులుకుంటారన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. తాజాగా నందిగ్రామ్‌లో నిర్వహించిన భారీ బహిరంగ సభలో ఆయన చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారాయి.
పార్టీ నిర్ణయమే శిరోధార్యం
ఎన్నికల ఫలితాల అనంతరం తొలిసారి నందిగ్రామ్‌లో అడుగుపెట్టిన సువేందు అధికారికి స్థానికులు బ్రహ్మరథం పట్టారు. ‘మీరు నందిగ్రామ్ ముద్దుబిడ్డ, మీరే మా సీఎం’ అంటూ భారీ ఎత్తున నినాదాలు చేశారు. ఈ నినాదాలపై స్పందించిన సువేందు.. అది తాను తీసుకునే నిర్ణయం కాదని, పార్టీ అధిష్ఠానానిదే తుది నిర్ణయమని స్పష్టం చేశారు. ‘నేను క్రమశిక్షణ గల కార్యకర్తను, అవసరమైతే నా అభిప్రాయం చెబుతాను.. కానీ సొంత నిర్ణయాలు తీసుకోను. మరో పది రోజుల్లో ఒక స్థానాన్ని వదులుకోవాల్సిందే. కానీ భవానీపూర్, నందిగ్రామ్ ప్రజల పట్ల నా బాధ్యతను ఎప్పటికీ విస్మరించను’ అని ఆయన పేర్కొన్నారు.
పాత కేసుల రీఓపెన్.. కఠిన చర్యలు
గత రెండు దశాబ్దాలుగా భూసేకరణ ఉద్యమాల నుండి నందిగ్రామ్‌తో తనకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్న ఆయన, తన కుటుంబం ఎదుర్కొన్న వేధింపులను సభలో ప్రస్తావించారు. ‘2011 మార్పులో నేను భాగమయ్యాను, ఇప్పుడు నిజమైన మార్పులో ఉన్నాను. మా 90 ఏళ్ల తండ్రిని సీఐడీ విచారణ పేరుతో వేధించారు. నా ఆఫీసుకు 150 మంది పోలీసులను పంపారు. గతంలో జరిగిన అకృత్యాలపై విచారణ కోసం ప్రత్యేక కమిషన్‌ను ఏర్పాటు చేసి, నేరస్థులపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకుంటాం’ అని సువేందు హెచ్చరించారు.
ఆరు నెలల్లో నందిగ్రామ్ రూపురేఖలు మార్చేస్తా
నందిగ్రామ్ అభివృద్ధికి తాను ఇచ్చిన హామీలన్నింటినీ నెరవేరుస్తానని సువేందు హామీ ఇచ్చారు. నందిగ్రామ్-I లో ఏడాదికి రెండు పంటలు పండేలా చూస్తానని, హల్దియా-నందిగ్రామ్ వంతెనను నిర్మిస్తానని తెలిపారు. గోకుల్‌నగర్‌లో పాఠశాల, సోనాచురాలో ఐటీఐ ఏర్పాటుతో పాటు వేరే ఆసుపత్రులకు రిఫర్ చేసే పరిస్థితి లేకుండా నందిగ్రామ్ ఆసుపత్రిని ఆధునికీకరిస్తామన్నారు. ఆరు నెలల్లో ప్రతి ఇంటికి నీటి కనెక్షన్ అందిస్తానని పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా కార్యకర్తలు శాంతియుతంగా ఉండాలని, ప్రధాని మోదీ ఇచ్చిన గ్యారంటీలను అమలు చేస్తూ, నూతన బెంగాల్‌ను నిర్మిస్తామని సువేందు అధికారి పేర్కొన్నారు.


