బెంగళూరు: ప్రపంచవ్యాప్తంగా 182 దేశాల్లో 10 వేలకు పైగా కేంద్రాలతో ఏకంగా కోట్ల మంది జీవితాల్లో వెలుగులు నింపిన ‘ఆర్ట్ ఆఫ్ లివింగ్’ 45వ వసంతంలోకి అడుగుపెడుతోంది. సంస్థ వ్యవస్థాపకులు గురుదేవ్ రవిశంకర్ 70వ జన్మదిన వేడుకలు కూడా దీనికి తోడవడంతో బెంగళూరు ఒక చరిత్రక ఘట్టానికి వేదిక కాబోతోంది. ఈ మహా వేడుకలకు భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ముఖ్య అతిథిగా హాజరుకానుండటంతో ఈ ఉత్సవాలకు అంతర్జాతీయ స్థాయిలో ప్రాధాన్యత సంతరించుకుంది.
ప్రధాని మోదీ రాక.. ‘ధ్యాన్ మందిర్’ ప్రారంభం
మే 10న ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఇంటర్నేషనల్ సెంటర్‌లో జరిగే ఫౌండేషన్ డే కార్యక్రమానికి ప్రధాని మోదీ హాజరై ప్రసంగించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా ఆయన నూతనంగా నిర్మించిన అత్యద్భుత ధ్యాన మందిరాన్ని ప్రారంభించి, జాతికి అంకితం చేస్తారు. అలాగే మానసిక ఆరోగ్యం, గ్రామీణాభివృద్ధి, పర్యావరణ పరిరక్షణ, సామాజిక మార్పు లక్ష్యంగా దేశవ్యాప్తంగా చేపట్టనున్న పలు బృహత్తర సేవా కార్యక్రమాలకు ప్రధాని శ్రీకారం చుట్టనున్నారు.
182 దేశాల భాగస్వామ్యం
మే 10 నుంచి 26 వరకు అత్యంత వైభవంగా జరిగే ఈ ఉత్సవాలకు 182 దేశాల నుంచి ప్రతినిధులు ప్రత్యక్షంగా, వర్చువల్ విధానంలో హాజరుకానున్నారు. మే 13న రవిశంకర్ జన్మదినం సందర్భంగా ‘ప్రపంచ శాంతి కోసం గ్లోబల్ మెడిటేషన్’ నిర్వహిస్తారు. ఇది ప్రపంచవ్యాప్తంగా ప్రత్యక్ష ప్రసారం కానుంది. ఇదే వేదికపై 182 దేశాల సంస్కృతులను ప్రతిబింబించేలా కళా ప్రదర్శనలు, భారతదేశంలోని 450కి పైగా జిల్లాల్లో నిస్వార్థ సేవ చేస్తున్న రియల్ హీరోలకు ప్రత్యేక సత్కారాలు జరగనున్నాయి.
ఖైదీల సంస్కరణలు..
ఈ ఉత్సవాల్లో కేవలం వేడుకలే కాకుండా సామాజిక మార్పుపై ప్రత్యేక దృష్టి సారించారు. మే 25-26 తేదీల్లో ‘ఖైదీల సంక్షేమం - విధానపరమైన సంస్కరణలు’ అనే అంశంపై ప్రత్యేక రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించనున్నారు. 1981లో ప్రారంభమైన ఆర్ట్ ఆఫ్ లివింగ్ ‘సుదర్శన క్రియ’ లాంటి విధానాల ద్వారా గ్లోబల్ ఎడ్యుకేషనల్, హ్యుమానిటేరియన్ సంస్థగా పేరొందింది.
ఇది కూడా చదవండి: సీఎన్‌ఎన్ వ్యవస్థాపకుడు టెడ్ టర్నర్ కన్నుమూత


