సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం : ‘ఎనిమిది సెమిస్టర్లు ఉంటావ్.. నీతో నేను ట్రావెల్ చేయాలనుకుంటున్నాను. నువ్వు మా ఇంటికి వస్తావా.. గోడలకు చెవులు ఉంటాయి.. ఇంటికి వస్తే పూర్తిగా మాట్లాడుతా.. నీతో పరీక్షలు బాగా రాయించాలని.. రూమ్‌కి ఇన్విజలేటర్‌గా వచ్చా... నేను నీకు చూపించినా రాయచ్చు కదా.. రాసుకునేలా అవకాశం ఇచ్చా.. ఆ మాత్రం సైకాలజీ కూడా తెలియపోతే ఎలాగే.. నువ్వు వేస్ట్ చేశావ్. నువ్వంటే ఇష్టం.. ఐ వాంట్ యూ. రేపు శ్రీకాకుళం వస్తావా. రేపు ఎన్ని గంటలకు బయల్దేరుతున్నావు. ఆర్టీసీ కాంప్లెక్స్‌లో రిసీవ్ చేసుకుంటా. నీఫోన్ కోసం వెయిట్ చేస్తా.. నువ్వంటే నాకిష్టం.. నువ్వు వస్తే చెప్తాను. మనమిద్దరం కలిసి ట్రావెల్ చేద్దామని. శ్రీకాకుళం వచ్చాక ఇంటికి తీసుకెళ్తా. అక్కడ ఫేస్ టూ ఫేస్ చెబుతా. జర్నీలో ట్రావెల్‌ను బట్టి ఇలా ఉండాలి. అలా ఉండాలి అని చెప్పగలను. అది ప్రపోర్షనల్‌గా కావ చ్చు. పర్సనల్‌గా కావచ్చు. ఏదైనా కావచ్చు. నన్ను సార్ అని పిలవకే...అండి అని పిలు...’ పాఠాలు చెప్పాల్సిన ఓ అధ్యాపకుడు తన స్టూడెంట్‌తో జరిపిన సంభాషణ ఇది. అంబేడ్కర్ యూనివర్సిటీలో ఇంజినీరింగ్ కాలేజీ విద్యార్థినికి ఎదురైన చేదు అనుభవమిది.
ఎచ్చెర్లలోని బీఆర్‌ఏయూ ప్రతిష్ట మంటగలిసిపోతోంది. కొందరు అధ్యాపకుల తీరు వల్ల మొత్తం వర్సిటీకే చెడ్డ పేరు వస్తోంది. తల్లిదండ్రుల స్థానంలో ఉండి విద్యాబుద్ధులు నేర్పించాల్సిన కొందరు ఆ వృత్తికే చెడ్డ పేరు తీసుకొస్తున్నారు. విద్యార్థినులను వేధిస్తూ, ప్రలోభ పెడుతూ, బెదిరింపులకు సైతం దిగుతున్నారు. తాజాగా అంబేడ్కర్ యూనివర్సిటీ ఇంజినీరింగ్ కళాశాలలో పనిచేస్తున్న ఓ అధ్యాపకుడు అక్కడ చదువుతున్న ఓ విద్యార్థినితో జరిపిన ఫోన్ సంభాషణ సోషల్ మీడియా వేదికగా వెలుగు చూసింది. ఈ వర్సిటీలో గతంలోనూ లైబ్రరీ సైన్సులో, లా విభాగంలో, గణిత, తెలుగు విభాగాల్లో ఇలాంటి ఘటనలు చోటు చేసుకున్నాయన్న ఆరోపణలు ఉన్నాయి.
ప్రలోభాలు.. ఆపై వేధింపులు
అంబేడ్కర్ యూనివర్సిటీలోని కొన్ని విభాగాల్లో కాంట్రాక్ట్ అధ్యాపకులు ఉత్తీర్ణత అయ్యేలా చూస్తామని ప్రలోభాలకు గురి చేసి, లోబర్చుకునే విధంగా వ్యవహరిస్తున్నారు. తాజాగా ఇంజినీరింగ్ కళాశాలలో కమ్యూనికేషన్ ఇంగ్లిష్ (సాఫ్ట్ స్కిల్స్) బోధించే రామారావు అనే అసిస్టెంట్ కాంట్రాక్ట్ ప్రొఫెసర్ ఇంజినీరింగ్ ప్రథమ సంవత్సరం చదువుతున్న ఓ విద్యార్థినితో అసభ్యంగా మాట్లాడిన ఆడియో లీకై ంది. ఈ విషయాన్ని వర్సిటీ పెద్దలు రాజీ చేశారు. అయినా ఆ అధ్యాపకుడి తీరు మారలేదు. తప్పని పరిస్థితుల్లో ఆ విద్యార్థిని విషయాన్ని తన తల్లిదండ్రుల దృష్టికి తీసుకెళ్లడంతో ఆ తల్లిదండ్రులు వర్సిటీ వర్గాలకు తెలిసిన వారి ద్వారా తెలియజేశారు. ఈ పరిస్థితుల్లో ఈ ఆడియో క్లిప్ బయటకు వచ్చింది.
గతంలోనూ..
వర్సిటీలో తెలుగు, గణితం, న్యాయ, ఇంజినీరింగ్ విభాగాల్లో ఈ తరహా ఘటనలు గతంలో కూడా చోటు చేసుకున్నాయన్న వాదనలు ఉన్నాయి. ఉత్తీర్ణత కోసం, మార్కుల కోసం ట్రాప్ చేయడం, వేధింపులకు గురి చేయడం వంటివి జరిగాయన్న విమర్శలు ఉన్నాయి. ఇలాంటి ఆడియో రికార్డులు గతంలో కూడా వచ్చినప్పటికీ బయటకు రా కుండా జాగ్రత్త పడ్డారనే వాదనలు ఉ న్నాయి. వర్సిటీలో అధ్యాపకుల మధ్య విభేదాలు ఉండడం వల్ల ఇవి బయటకు వచ్చాయని లేదంటే ఈ ఆడి యో క్లిప్ కూడా బయటకు రాదనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి. ఆ అధ్యాపకుడితో ఫోన్ మాట్లాడిన విద్యార్థి పక్కన మరికొందరు ఉన్నట్టు, వారిచ్చే సూచనతో సంభాషణ జరిపినట్టు ఆ ఆడియోలో రికార్డు కావడం గమనార్హం. ఆ అధ్యాపకుడు తాను మాట్లాడింది కొంత అయితే మిగతాది కలిపారని ఆరోపిస్తున్నారు.
వర్సిటీలో తెలుగు, ఆంగ్లం, ఎంసీఈ, గణితం, లా విద్యార్థినులు ఇలాంటి వేధింపులకు ఎప్పటికప్పుడు గురవుతున్నారు. రెండు నెలల క్రితం ట్రిపుల్ ఐటీలో వేధింపులపై అమ్మాయిలు చేసిన ఫిర్యాదుకు ప్రత్యేక కమిటీలను వేసి వేధించిన వారిని సస్పెండ్ చేశారు. ఇప్పుడు కూడా ఇక్కడ ఇలాంటి కమిటీలను వేసి వేధింపులకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలన్న డిమాండ్ వ్యక్తమవుతోంది. ఫోన్ సంభాషణ చేసిన అధ్యాపకుడిది శ్రీకాకుళం మండలంలోని ఓ గ్రామం. ప్రస్తుతం బలగ వద్ద ఉంటున్నాడు. ఓ ఆల యం ట్రస్టు మెంబర్‌గా కూడా కొనసాగుతున్నాడు.
మాట తెచ్చిన చేటు.. బోధకుడిపై సస్పెన్షన్ వేటు
సాక్షి కథనంతో కదిలిన అధికారులు
విద్యార్థినితో జరిపిన అసభ్యకర ఫోన్
సంభాషణపై ప్రత్యేక కమిటీ విచారణ
కళంకిత అసిస్టెంట్ ప్రొఫెసర్ సస్పెన్షన్
సస్పెన్షన్ చర్యలను ధ్రువీకరించడానికి వెనకడుగు
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం : అంబేడ్కర్ యూనివర్సిటీ ఇంజినీరింగ్ కళాశాల విద్యార్థినితో ఫోన్‌లో అసభ్యకరంగా సంభాషణ చేసిన కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్ మజ్జి రామారావుపై సస్పెన్షన్ వేటు పడింది. ఆయన బాగోతంపై విచారణ జరపాలని కూడా యూనివర్సిటీ నిర్ణయం తీసుకుంది. ‘సాక్షి’లో సోమవారం ప్రచురితమైన కథనంపై యూనివర్సిటీ అధికారులు స్పందించారు. ‘ప్రలోభాలు...బెదిరింపులు’ శీర్షికన ప్రచురితమైన కథనంతో అధికారులు కదిలారు. ఇంజినీరింగ్ కళాశాలలో కమ్యూనికేషన్ ఇంగ్లిష్ (సాఫ్ట్ స్కిల్స్) బోధిస్తున్న మజ్జి రామారావు అనే అసిస్టెంట్ కాంట్రాక్ట్ ప్రొఫెసర్‌ను సస్పెండ్ చేశారు. ఫోన్ సంభాషణ బయటకు రావడంతో పాటు పత్రికల్లో ప్రచురితం కావడంతో వీసీ కె.ఆర్ రజని ఆధ్వర్యంలో రిజిస్ట్రార్ బి.అడ్డయ్యతో పాటు ఇంజినీరింగ్ కళాశాల ప్రిన్సిపాల్ సీహెచ్ రాజశేఖర్, సైన్స్ కళాశాల ప్రిన్సిపాల్ స్వప్నవాహిణి, ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపాల్ అనురాధలతో కూడిన కమిటీ ప్రత్యేక సమావేశమై సస్పెండ్ చేయాలని వీసీకి రిపోర్టు అందజేశారు. దీంతో వీసీ ఆయనను సస్పెండ్ చేయడంతో విచారణకు ఆదేశించినట్టు ఉన్నత విద్యా మండలి ముఖ్య కార్యదర్శికి నివేదిక పంపిచారు. ఈ చర్యలతోనైనా అంబేడ్కర్ యూనివర్సిటీలో విద్యార్థినులపై వేధింపులు ఆగుతాయేమో చూడాలి.
అంతా గుట్టుగానే..
అసిస్టెంట్ ప్రొఫెసర్‌పై చర్యలు తీసుకున్న విషయాన్ని యూనివర్సిటీ అధికారులు గుట్టుగా ఉంచారు. సోషల్ మీడియా వేదికగా ఆడియో సంభాషణ హల్‌చల్ చేసి, యూనివర్సిటీ ప్రతిష్టకు భంగం కలిగించిన విషయంపై తీసుకున్న చర్యలను బయటకు వెల్లడించకుండా మౌనంగా వ్యవహరించారు. యూనివర్సిటీ అధికారులకు ఫోన్ చేసినా స్పందించలేదు. సస్పెన్షన్ నిర్ణయాన్ని అధికారికంగా వెల్లడించలేదు. వాస్తవంగా తాజాగా ఘటనలో బాధ్యులైన విద్యార్థిని ఈ వ్యవహారాన్ని గతంలోనే అధికారుల దృష్టికి వచ్చింది. రాజీ కుదిర్చే ప్రయత్నం చేశారే తప్ప చర్యలు తీసుకోవడానికి వెనుకంజ వేశారు. అధ్యాపకుడిపై ఉన్న మమకారం ఏంటో తెలియదు గానీ అప్పట్లో తేలికగా తీసుకున్నారు. ఆ రోజే చర్యలు తీసుకుని ఉంటే యూనివర్సిటీ ప్రతిష్ట మంట గలిసేది కాదు. ఏం జరిగినా గుట్టుగా ఉంచడం ఇక్కడ పరిపాటిగా మారింది.


