న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా తీవ్ర ఉత్కంఠ రేపుతున్న ఎన్నికల ఫలితాల్లో భారతీయ జనతా పార్టీ సరికొత్త చరిత్ర సృష్టించే దిశగా దూసుకెళ్తోంది. పశ్చిమ బెంగాల్, అస్సాం రాష్ట్రాల్లో వెలువడుతున్న తొలి రౌండ్ల కౌంటింగ్ ట్రెండ్స్‌లో కమలం పార్టీ అద్భుతమైన ఆధిక్యాన్ని ప్రదర్శిస్తోంది. ఈ చారిత్రక విజయాల నేపథ్యంలో, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు సాయంత్రం 6:30 గంటలకు ఢిల్లీలోని బీజేపీ కేంద్ర కార్యాలయానికి చేరుకుని, పార్టీ శ్రేణులను ఉద్దేశించి ప్రసంగించనున్నారు.
బెంగాల్‌లో టీఎంసీకి భారీ షాక్
పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో పెను మార్పు కనిపిస్తోంది. హోరాహోరీగా సాగిన ఈ ఎన్నికల్లో అధికార తృణమూల్ కాంగ్రెస్ వెనుకబడగా, బీజేపీ స్పష్టమైన ఆధిక్యంలో దూసుకెళ్తోంది. తాజా ట్రెండ్స్ ప్రకారం బీజేపీ ఏకంగా 111 స్థానాల్లో ముందంజలో ఉండగా, టీఎంసీ కేవలం 69 స్థానాలకే పరిమితమైంది. ముఖ్యమంత్రి మమతా బెనర్జీ భవానీపూర్ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి సువేందు అధికారిపై తొలి రౌండ్ ముగిసేసరికి కేవలం 898 ఓట్ల స్వల్ప ఆధిక్యంలో ఉన్నారు. అదే సమయంలో ప్రతిష్టాత్మక నందిగ్రామ్‌లో సువేందు అధికారి.. టీఎంసీ అభ్యర్థిపై 3,100కు పైగా ఓట్ల ఆధిక్యంతో సంచలనం సృష్టిస్తున్నారు.
అస్సాంలో మళ్లీ ఎన్డీఏ హవా
అస్సాం రాష్ట్రంలో అధికార ఎన్డీఏ కూటమి మరోసారి తన సత్తా చాటుతూ రెండోసారి అధికారం దిశగా పయనిస్తోంది. మొత్తం 126 అసెంబ్లీ స్థానాలకు గాను ఎన్డీఏ కూటమి 98 చోట్ల లీడ్‌లో ఉండగా, కాంగ్రెస్ కేవలం 25 స్థానాలకే పరిమితమైంది. బీజేపీ ఒంటరిగా 78 స్థానాల్లో, మిత్రపక్షాలైన ఏజీపీ, బీపీఎఫ్ చెరో 10 స్థానాల్లో ముందంజలో ఉన్నాయి. జాలుక్‌బారి నుంచి ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ భారీ ఆధిక్యంలో కొనసాగుతుండగా, ప్రతిపక్ష కాంగ్రెస్ చీఫ్ గౌరవ్ గొగోయ్ జోర్హాట్ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి చేతిలో వెనుకంజలో ఉండటం గమనార్హం.
కీలక నేతల ఆధిక్యం.. ఉత్సాహంలో శ్రేణులు
ఉదయం 8 గంటలకు పోస్టల్ బ్యాలెట్లతో ప్రారంభమైన కౌంటింగ్.. అస్సాంలోని 35 జిల్లాల్లోని 40 కేంద్రాల్లో ఉత్కంఠభరితంగా కొనసాగుతోంది. బీజేపీకి చెందిన పలువురు కీలక మంత్రులు రణోజ్ పెగు, పీజుష్ హజారికా, అశోక్ సింఘాల్ తొలి రౌండ్ల నుంచే స్పష్టమైన ఆధిక్యాన్ని కనబరుస్తున్నారు. కాంగ్రెస్ నుంచి ఎన్నికల ముందు బీజేపీలో చేరిన ప్రద్యుత్ బొర్దొలోయ్, భూపెన్ బోరా కూడా తమ నియోజకవర్గాల్లో లీడ్‌లో ఉన్నారు. బెంగాల్, అస్సాం రాష్ట్రాల్లో కాషాయ గాలి బలంగా వీస్తుండటంతో బీజేపీ శ్రేణుల్లో సంబరాలు మిన్నంటుతున్నాయి.


