వాషింగ్టన్: అమెరికాలోని ప్రధాన విమానాశ్రయాల్లో తీవ్ర గందరగోళం నెలకొంది. వందలాది విమానాలు అనూహ్యంగా రద్దు కావడం, విపరీతమైన జాప్యం జరగడంతో వేలాది మంది ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దేశీయ, అంతర్జాతీయ ప్రయాణాలకు తీవ్ర ఆటంకం కలగడంతో ఎయిర్‌పోర్టులన్నీ ప్రయాణికులతో నిండిపోయి ఉత్కంఠ వాతావరణాన్ని తలపిస్తున్నాయి.
ప్రధాన నగరాలపై తీవ్ర ప్రభావం
అట్లాంటా, డల్లాస్, న్యూయార్క్, ఓర్లాండో, చికాగో వంటి అమెరికాలోని అత్యంత రద్దీ అయిన ప్రధాన కేంద్రాల నుండి నడిచే విమానాలపై ఈ ప్రభావం తీవ్రంగా పడింది. కనెక్టింగ్ విమానాలు మిస్ కావడం, బయలుదేరే సమయాలు పదేపదే మారిపోవడంతో ప్రయాణికులు దిక్కుతోచని స్థితిలో పడిపోయారు. ఎయిర్‌పోర్టులలో ప్రయాణికులు ప్రత్యామ్నాయ విమానాల కోసం గంటల తరబడి వేచి చూస్తున్నారు.
ఈ హఠాత్ పరిణామాలకు కారణమేంటి?
విమానయాన రంగంలో ఒక్కసారిగా ఈ ముప్పు ముంచుకురావడానికి ప్రధానంగా ప్రతికూల వాతావరణ పరిస్థితులే కారణమని తెలుస్తోంది. దీనికి తోడు విపరీతమైన ఎయిర్ ట్రాఫిక్ రద్దీ, సిబ్బంది కొరత, ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ (ఎఫ్‌ఏఏ) వ్యవస్థపై పెరుగుతున్న ఒత్తిడి ఈ విమానాల జాప్యాలకు కారణంగా నిలిచాయి. విమాన షెడ్యూల్స్ అన్నీ ఒకదానికొకటి అనుసంధానమై ఉండటం వల్ల, ఒక ఎయిర్‌పోర్టులో జరిగిన చిన్న అంతరాయం పలు మార్గాల్లోని విమానాల రాకపోకలను స్తంభింపజేస్తోంది.
పరిస్థితిని చక్కదిద్దే ప్రయత్నాల్లో..
ప్రయాణికుల అసౌకర్యాన్ని తగ్గించడానికి అమెరికన్ ఎయిర్‌లైన్స్, ఇతర సంస్థలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. రద్దయిన విమానాల ప్రయాణికులకు ప్రత్యామ్నాయ టిక్కెట్లు బుక్ చేయడం, షెడ్యూల్స్‌ను సర్దుబాటు చేయడం వంటి చర్యలను వెంటనే చేపడుతున్నాయి.
ఇది కూడా చదవండి: పాత ఫొటో.. పక్కా స్కెచ్.. 24 ఏళ్లకు హంతకుడు పట్టివేత


