తుమకూరు: కర్ణాటకలోని తుమకూరు జిల్లాలో జాతీయ పక్షుల వరుస మరణాలు తీవ్ర కలకలం రేపుతున్నాయి. పచ్చని పొలాల్లో కనువిందు చేయాల్సిన అందమైన నెమళ్లు, ‘సైలెంట్ కిల్లర్’ దాటికి విగతజీవులుగా మారుతున్నాయి. 44 నెమళ్లు మృత్యువాత పడటానికి ‘H5N1 బర్డ్ ఫ్లూ’ మహమ్మారే కారణమని ల్యాబ్ రిపోర్టుల్లో నిర్ధారణ కావడం స్థానికులను, అధికారులను భయాందోళనలకు గురిచేస్తోంది.
పక్షుల మరణాల వెనుక..
ఏప్రిల్ 16న తొలిసారిగా వెలుగుచూసిన ఈ విషాదం, వారం రోజుల్లోనే తీవ్ర స్థాయికి చేరుకుంది. తుమకూరు తాలూకా పరిధిలోని కేసరమడు, హిరేహళ్లి, గులూరు గ్రామ పంచాయతీల్లోని వ్యవసాయ క్షేత్రాల్లో ఈ పక్షులు మృతిచెంది కనిపించాయి. అటవీ శాఖ అధికారుల గాలింపు చర్యల్లో ఈ దారుణం బయటపడింది. వెంటనే అప్రమత్తమైన అధికారులు, వాటి నమూనాలను భోపాల్‌లోని ఐసీఏఆర్-ఎన్ఐహెచ్ఎస్ఏడీ (ICAR-NIHSAD) ల్యాబ్‌కు పంపగా.. అత్యంత ప్రమాదకరమైన H5N1 బర్డ్ ఫ్లూ వైరస్ వల్లే ఈ నెమళ్లు చనిపోయినట్లు వెల్లడయ్యింది.
ల్యాబ్ రిపోర్టుల నిర్ధారణతో అటవీ, ఆరోగ్య, పశుసంవర్ధక శాఖలు యుద్ధప్రాతిపదికన సమన్వయంతో చర్యలు చేపట్టాయి. వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు, నెమళ్లు మరణించిన ప్రాంతాల చుట్టూ 10 కిలోమీటర్ల పరిధిని ‘కంటైన్‌మెంట్ జోన్’గా ప్రకటించారు. ఈ పరిధిలో ఉన్న కోళ్ల ఫారాల నిర్వాహకులకు అత్యవసర మార్గదర్శకాలు జారీ చేశారు. అయితే ఏప్రిల్ 23 తర్వాత కొత్తగా ఎలాంటి నెమళ్ల మరణాలు నమోదు కాకపోవడం కాస్త ఊరటనిచ్చే అంశం.
ఆరోగ్య శాఖ అప్రమత్తం
బర్డ్ ఫ్లూ నిర్ధారణ నేపథ్యంలో తుమకూరు జిల్లా అంతటా వైద్యారోగ్య శాఖ హై అలర్ట్ ప్రకటించింది. తీవ్రమైన శ్వాసకోశ వ్యాధులు, ఫ్లూ వంటి లక్షణాలతో వచ్చే రోగుల విషయంలో అత్యంత అప్రమత్తంగా ఉండాలని అన్ని ఆసుపత్రులను ఆదేశించింది. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా పీపీఈ కిట్లు, త్రిబుల్ లేయర్ మాస్క్‌లు, ఓసెల్టామివిర్ మందుల నిల్వలను తగినంతగా అందుబాటులో ఉంచినట్లు అధికారులు తెలిపారు.
ఇది కూడా చదవండి: Jammu: కూలిన వంతెన.. ముగ్గురు దుర్మరణం!


