పాకిస్తాన్‌కు భారీ షాకిచ్చిన ఇరాన్‌! | Iran MP Ebrahim Rezaei Says Pakistan not a suitable intermediary | Sakshi
Sakshi News home page

పాకిస్తాన్‌కు భారీ షాకిచ్చిన ఇరాన్‌!

Apr 27 2026 7:38 AM | Updated on Apr 27 2026 7:51 AM

Iran MP Ebrahim Rezaei Says Pakistan not a suitable intermediary

టెహ్రాన్‌: అమెరికా, ఇరాన్‌ మధ్య చర్చల నేపథ్యంలో దాయాది దేశం పాకిస్తాన్‌కు ఊహించని షాక్‌ తగిలింది. పాకిస్తాన్‌పై ఇరాన్‌ ఎంపీ ఇబ్రహీం రెజాయీ సంచలన వ్యాఖ్యలు చేశారు. శాంతి చర్చలకు పాకిస్తాన్‌ తగిన మధ్యవర్తి కాదంటూ బాంబు పేల్చారు. అమెరికాకు మాత్రమే పాకిస్తాన్‌ వత్తాసు పలుకుతోందని ఘాటు విమర్శలు గుప్పించారు. దీంతో, చర్చలపై కొత్త ట్విస్ట్‌ నెలకొంది.

అమెరికా, ఇరాన్​ మధ్య శాంతి చర్చల సందిగ్ధం నెలకొన్న వేళ ఊహించని పరిణామం చోటుచేసుకుంది. ఇరాన్‌ జాతీయ భద్రత మరియు విదేశాంగ విధాన కమిషన్ అధికార ప్రతినిధిగా పనిచేస్తున్న ఎంపీ ఇబ్రహీం రెజాయీ.. పాకిస్తాన్‌ మధ్యవర్తిత్వంపై తీవ్ర సందేహాలు వ్యక్తం చేశారు. ఈ సందర్బంగా ఇబ్రహీం ఎక్స్‌ వేదికగా..‘ఇరాన్‌కు పాకిస్తాన్‌ మంచి మిత్రుడే. కానీ, చర్చలకు సంబంధించి మధ్యవర్తిత్వానికి అవసరమైన విశ్వసనీయత పాకిస్తాన్‌కు లేదు. చర్చలకు పాకిస్తాన్‌ సరైన మధ్యవర్తి కాదు. ఒక మధ్యవర్తి నిష్పక్షపాతంగా ఉండాలి, ఎప్పుడూ ఒక పక్షానికే మొగ్గు చూపకూడదు. అమెరికా ప్రయోజనాలకు పాకిస్తాన్‌ అనుకూలంగా వ్యవహరిస్తుంది. ఇస్లామాబాద్ వాషింగ్టన్‌ను బహిరంగంగా విమర్శించకుండా ఉంటోంది అని సంచలన వ్యాఖ్యలు చేశారు.  

అయితే, ఇరాన్‌, అమెరికా మధ్య అనిశ్చితి ఉన్నప్పటికీ చర్చలను సజీవంగా ఉంచడానికి ఇరాన్‌ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరఘ్చి దౌత్యపరమైన ప్రయత్నాలను ముమ్మరం చేస్తున్న తరుణంలో ఆయన ఇలా వ్యాఖ్యలు చేయడం పాకిస్తాన్‌కు ఊహించని షాక్‌ ఇచ్చినట్టు అయ్యింది. కాగా, అరఘ్చి ఇటీవల మూడు రోజుల్లో రెండోసారి ఇస్లామాబాద్‌లో పర్యటించారు. అక్కడ ఆయన పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్‌తో సంఘర్షణ, భవిష్యత్ కార్యాచరణ మార్గాలపై చర్చలు జరిపారు.

ఫోన్‌లో చర్చలు: ట్రంప్‌ సూచన
ఇదిలా ఉండగా.. అమెరికా, ఇరాన్​ మధ్య శాంతి చర్చల సందిగ్ధం వేళ అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. శాంతి పరిష్కారం కోసం ఫోన్‌లో మాట్లాడుకోవచ్చని ట్రంప్ ఆదివారం సూచించారు. 17 గంటల విమాన ప్రయాణంలో ప్రతినిధి బృందాన్ని పంపే బదులు తానే ఆ నిర్ణయం తీసుకున్నానని చెప్పారు. ఓ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఈ మేరకు వ్యాఖ్యానించారు. "అన్ని అవకాశాలు మా చేతిలోనే ఉన్నాయి. వారు మాట్లాడాలనుకుంటే మా వద్దకు రావచ్చు, లేదా మాకు ఫోన్ చేయవచ్చు" అని ట్రంప్ అన్నారు. అయితే, ఆ ఫోన్ కాల్ ఎప్పుడు జరుగుతుందో మాత్రం సూచించలేదు.

ట్రంప్ వార్నింగ్
రెండో విడత శాంతి చర్చలపై అనిశ్చితిపై ఇరాన్‌కు డొనాల్డ్ ట్రంప్ మరోసారి హెచ్చరించారు. యుద్ధం ముగించటానికి, కాల్పుల విరమణకు అంగీకరించడానికి కేవలం 3 రోజుల సమయం మాత్రమే ఉందన్నారు. లేదంటే వారి చమురు పైపులైన్లు పేలిపోతాయని ట్రంప్ తెలిపారు. ఇరాన్ చమురు ఎగుమతులను కొనసాగించలేకపోతే, యాంత్రికంగా, భూమి సహజశక్తుల కారణంగా పైపులైన్లు విఫలమవుతాయన్నారు. ఇరాన్‌కు భారీ పరిమాణంలో చమురు సరఫరా వ్యవస్థ ఉందని, ఏదైన కారణం చేత అది మూసుకుపోతే అప్పుడు ఇంధనాన్ని కంటైనర్లు లేదా నౌకల్లో నింపడం సాధ్యం కాదన్నారు. ప్రస్తుతం ఇరాన్ అదే పరిస్థితి ఎదుర్కొటోందన్న ట్రంప్.. దిగ్బంధనం కారణంగా వారివద్ద నౌకలు కూడా లేవని తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement