అక్షయ తృతీయ దానాలు అంతులేనంతటి ఫలాలు | Akshaya Tritiya 2026 important Donattions To Fix Doshas | Sakshi
Sakshi News home page

అక్షయ తృతీయ దానాలు అంతులేనంతటి ఫలాలు

Apr 16 2026 2:50 PM | Updated on Apr 16 2026 3:11 PM

Akshaya Tritiya 2026 important Donattions To Fix Doshas

వైశాఖ మాస శుక్ల పక్ష తదియని అక్షయ తృతీయ (Akshaya Tritiya 2026) అంటారు.. ఇది హైందవ పండుగ లలో విశిష్టమైనది.. విశేషమైనది... ఈ రోజు ఏ పుణ్యకార్యం చేపట్టిన దానధర్మాలు చేసినా, దాని వలన ఫలితం క్షయం కాకుండా ఉంటుంది, అందుకే  ఈ పర్వం అక్షయ తృతీయగా ప్రసిద్ధికెక్కింది... 19, ఆదివారం అక్షయ తదియ సందర్భంగా ఆ విశేషాలు... 

ఒడిస్సాలో పూరి రధా యాత్ర నిర్మాణం ఈ రోజు మొదలు పెడుతారు. సింహచ లం అప్పన్న స్వామి నిజరూప దర్శనం మరియ చందనోత్సవం ఈ రోజే. భక్తులు తండోపతండాలుగా దర్శనంచేసే ఛార్‌ ధామ్‌ యాత్రలో కేదారేశ్వరుడు, బద్రీనాధ్, యమునోత్రి, గంగోత్రి ఆలయాలు తెరిచిన రోజు. భారతంలో పాండవులు అరణ్యవాసంలో వున్నపుడు, సూర్యదేవుడు ఇచ్చిన అక్షయపాత్ర మహిమలు విన్నాం. క్రోధపూరితం అయిన నరసింహస్వామిని శాంతింప చేయడానికి చందన పూత పూస్తారు. ఈ రోజు సింహాచలంలో చందనోత్సవం జరుగు తుంది.

దానధర్మాల మహిమ
ఈ రోజు ఏ వ్రతం అయినా జపం అయినా హోమం అయినా, దానధర్మాలు చేసినా, మరేమైనా పుణ్యకార్యం చేపట్టినా, ఫలితాలు క్షయం లేకుండా అంతం లేకుండా వుంటాయని విశ్వాసం. దానధర్మాలు చేస్తే చేసిన వారికీ నిరంతర  సంపద కలుగుతుందని నమ్మకం. వైశాఖ మాసంలో ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి వస్త్రాలు, గొడుగు, చెప్పులు, మంచి నీరు, ఆహారం, పళ్ళు ఇవ్వాలని అంటారు. అలా ఇచ్చినందుకు మన ఇంట్లో వాటి కొరత ఉండదని, అక్షయమవుతాయని పెద్దల మాట.   వీలైతే గోవు, భూమి, బంగారం వంటివి దానం చేస్తే ఎంతో ఫలం ఉంటుంది.

చివరగా....
ఈ రోజు ఏం చేసినా అక్షయంగా ఉంటుందనడానికి నిదర్శనాలు జీవనది గంగ. పంచమవేదంగా పరిగణించ బడి ప్రజలలో శాశ్వతంగా పదిలంగా వున్న మహా భారతం. ధనవంతులని కుబేర నామంతో వ్యవహరిస్తారు. అన్నపూర్ణ అవతరణతో అన్నం కొదవలేకుండా ఉండడం, మన తెలుగు రాష్ట్రాలని అన్నపూర్ణ అని అంటారు. ఈ రోజు  పాపం చేస్తే ఆ పాపం కూడా అక్షయంగా అంటుకుంటుంది. అందుచేత ఈ రోజు ఎట్టి పరిస్థితుల్లోనూ చెడ్డ పనులు చేయరాదు. 

పర్వాలకే పర్వం 
కృతయుగం వైశాఖ శుద్ధ తదియ అంటే అక్షయ తదియ నాడే ప్రారంభం అయినట్లు పురాణాలలో ప్రస్తావన... భగీరథుడు గంగకోసం తపస్సు చేసి మెప్పించి తరువాత ఆకాశం నుండి గంగ ఉగ్రరూపంతో ఉరికిన రోజు ఇదే. పరశురాముడు పుట్టినరోజు. వీరశైవ మత వ్యవస్థాపకుడు బసవేశ్వరుడు జన్మించిన రోజు. వేదవ్యాసుడు వినాయకుని చేత మహాభారతం వ్రాయడానికి పూనుకున్న రోజు.కుబేరుని శివుడు ధనాధిపతిగా నియమించిన రోజు. మహాలక్ష్మి విష్ణుమూర్తుల వివాహం జరిగిన రోజు. కుచేలుడిని కృష్ణుడు అను గ్రహించిన రోజు. బ్రహ్మ పుత్రుడు అక్షయడు జన్మించినరోజు.  పాండవులకు సూర్యభగవానుడు అక్షయపాత్ర అందించిన రోజు. అన్నపూర్ణాదేవి అవతరించిన రోజు. శంకరాచార్యులు కనక ధారా స్తోత్రం ద్వారా అమ్మవారిని మెప్పించి కటిక దరిద్రురాలైన భక్తురాలి ఇంట్లో కనకవర్షాన్ని కురిపించిన రోజు. 

– కె. అన్నపూర్ణ 

Advertisement
 
Advertisement
Advertisement