తమిళ రాజకీయం.. టీవీకే ఎమ్మెల్యే Vs మేయర్‌ | Political row between TVK MLA Pallavi and Chennai mayor Priya | Sakshi
Sakshi News home page

తమిళ రాజకీయం.. టీవీకే ఎమ్మెల్యే Vs మేయర్‌

Jun 5 2026 7:11 AM | Updated on Jun 5 2026 8:49 AM

Political row between TVK MLA Pallavi and Chennai mayor Priya

సాక్షి, చైన్నె: ‘ మీరా? నేనా? చైన్నెలో అంటూ మేయర్‌ ప్రియ, టీవీకే ఎమ్మెల్యే పల్లవి మధ్య ప్రోటోకాల్‌ అధికార పోరు గురువారం చోటు చేసుకుంది. తమిళనాడులో ప్రభుత్వం మారిన తర్వాత చైన్నె కార్పొరేషన్‌లో ఇద్దరు ప్రజాప్రతినిధుల మధ్య తీవ్రమైన ఈగో క్లాష్‌ (అధికార పోరు) మొదలైంది. తిరు.వి.కె. నగర్‌ నియోజకవర్గ పరిధిలోని పులియంతోపులో కొత్తగా నిర్మించిన పాఠశాల భవన ప్రారంభోత్సవంలో చైన్నె మేయర్‌ ప్రియ (డీఎంకే), స్థానిక మహిళా ఎమ్మెల్యే పల్లవి (టీవీకే) ల మధ్య జరిగిన ఘర్షణ హాట్‌ టాపిక్‌గా మారింది. 

రాష్ట్రంలో డీఎంకే అధికారం కోల్పోయినప్పటి నుండి మేయర్‌ ప్రియ బహిరంగ కార్యక్రమాలకు పెద్దగా హాజరుకావడం లేదు. ఈ నేపథ్యంలో పులియంతోపు స్కూల్‌ బిల్డింగ్‌ ప్రారంభోత్సవానికి ఆమె ముఖ్య అతిథిగా వచ్చారు. స్థానిక ఎమ్మెల్యే పల్లవి ట్రాఫిక్‌ జామ్‌ కారణంగా కొద్దిగా ఆలస్యంగా రావడం వివాదానికి కారణమైంది. ఎమ్మెల్యే పల్లవి లోపలికి వచ్చే సమయానికి మేయర్‌ ప్రియ ప్రోటోకాల్‌ను పక్కనబెట్టి ఒంటరిగా తానే రిబ్బన్‌ కట్‌ చేసి భవనాన్ని ప్రారంభించారు. దీంతో ఎమ్మెల్యే పల్లవి ముఖం దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆ తర్వాత లోపల సాంప్రదాయ కుతువిళక్కు (జ్యోతి ప్రజ్వలన) వెలిగించే సమయంలో, మేయర్‌ ప్రియ మొదటి దీపం వెలిగించారు. పక్కనే ఉన్న ఎమ్మెల్యే పల్లవికి దీపం వెలిగించే అవకాశం ఇవ్వ కుండా అధికారులు నిర్లక్ష్యం వహించారు. 

పల్లవి దీపం వెలిగించడానికి కొద్దిగా కదలగా, అక్కడి అధికారి ఆమెను వెనక్కి జరగమన్నట్లు మాట్లాడటంతో పల్లవి తీవ్ర అసంతృప్తికి లోనయ్యారు. తనకు జరిగిన అవమానానికి నిరసనగా ఎమ్మెల్యే పల్లవి కార్యక్రమాన్ని మధ్యలోనే బహిష్కరించి వెళ్లిపోయారు. ఆ తర్వాత జరిగిన 75వ వార్డు చిన్నబాబు వీధి పాఠశాల ప్రారంభోత్సవంలో కూడా ఆమె మేయర్‌తో కలిసి దీపం వెలిగించడానికి నిరాకరించి, ‘మీరే వెలిగించుకోండి‘ అని ఖరాఖండీగా చెప్పేశారు.

అవమానించారు: ఎమ్మెల్యే పల్లవి ఆవేదన
ఈ ఘటనపై ఎమ్మెల్యే పల్లవి స్పందిస్తూ.. ‘తాను బిడ్డకు జన్మనిచ్చి కేవలం 10 రోజులే అయిందన్నారు. కనీసం మూడు నెలలు విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు చెప్పారని, అయినా ప్రజా సమస్యల కోసం, తన నియోజకవర్గ అభివృద్ధి కార్యక్రమం అని వచ్చాననని, అయితే, ఈ విధంగా అవమానించడం దారుణం అని కన్నీటి పర్యంతమయ్యారు. అయితే మేయర్‌ ప్రియ స్పందిస్తూ చిన్న విషయాన్ని పెద్దది చేస్తూ, వివాదం సృష్టిస్తున్నారని వివరణ ఇచ్చారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement