‘ఎముకలు విరిగిపోతాయి’.. సీఎం విజయ్‌పై ఎమ్మెల్యే అనుచిత వ్యాఖ్యలు | DMK MLA Arrested Over Threatening Remarks Against cm Vijay | Sakshi
Sakshi News home page

‘ఎముకలు విరిగిపోతాయి’.. సీఎం విజయ్‌పై ఎమ్మెల్యే అనుచిత వ్యాఖ్యలు

Jul 20 2026 5:01 PM | Updated on Jul 20 2026 5:55 PM

DMK MLA Arrested Over Threatening Remarks Against cm Vijay

సాక్షి చెన్నై: తమిళనాడు సీఎం విజయ్‌ను ఉద్దేశించి బహిరంగ సభలో అభ్యంతరకరమైన, బెదిరింపు వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలపై విలాతికుళం నియోజకవర్గానికి చెందిన డీఎంకే  ఎమ్మెల్యే జి.వి. మార్కండేయన్‌ను పోలీసులు అరెస్టు చేశారు.  సోమవారం (జూలై 20, 2026) తెల్లవారుజామున అరెస్ట్ చేశారు. ఆయనను తూత్తుకుడి ఎస్పీ కార్యాలయానికి తరలించి విచారిస్తున్నారు. ఈ అరెస్టును నిరసిస్తూ డీఎంకే మద్దతుదారులు భారీ ఎత్తున ఆందోళన చేపట్టారు.

ఇటీవల జరిగిన తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్ కొలత్తూరు నియోజకవర్గంలో ఓటమి చవిచూశారు. దీనిని ఉద్దేశించి అసెంబ్లీలో సీఎం విజయ్ ‘మీ నాన్న ఎక్కడ?’ అంటూ సెటైర్లు వేశారు. దీనికి కౌంటర్‌గా జూలై 18న కొవిల్‌పట్టిలో జరిగిన డీఎంకే కృతజ్ఞతా సభలో ఎమ్మెల్యే మార్కండేయన్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.

అసెంబ్లీలో ముఖ్యమంత్రి తాను ఒకరి తండ్రి కోసం వెతుకుతున్నానని మాట్లాడుతున్నారు. ఆయనొక సిగ్గులేని ముఖ్యమంత్రి. అసెంబ్లీలో మిమ్మల్ని ఎలా చూసుకోవాలో మాకు తెలుసు. అసెంబ్లీ తలుపులు మూసివేస్తానని ఆయన అంటున్నారు. ఒకవేళ ఆయన గనుక వాటిని మూసివేస్తే, ఆయన ఎముకలు విరిగిపోతాయి. దమ్ముంటే అసెంబ్లీని మూసి చూడమనండి’అంటూ మార్కండేయన్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

ఈ ప్రసంగం తాలూకు వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. ఎమ్మెల్యే వ్యాఖ్యలపై టీవీకే ఉత్తర జిల్లా కార్యదర్శి బాలసుబ్రమణియన్ తూత్తుకుడి క్రైమ్ బ్రాంచ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు మార్కండేయన్‌పై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. విలాతికుళంలోని ఆయన నివాసంలో అదుపులోకి తీసుకున్నారు.

మార్కండేయన్ అరెస్టును డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్, ఎంపీ కనిమొళి తీవ్రంగా ఖండించారు. విమర్శలను తట్టుకోలేక అధికార టీవీకే ప్రభుత్వం పోలీసు యంత్రాంగాన్ని దుర్వినియోగం చేస్తూ ప్రతిపక్ష నేతలను టార్గెట్ చేస్తోందని, ఇది కేవలం రాజకీయ కక్షసాధింపు చర్యేనని వారు మండిపడ్డారు. కాగా, ముఖ్యమంత్రి విజయ్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు ఈ నెల ప్రారంభంలోనే తిరుచెందూర్ డీఎంకే ఎమ్మెల్యే, మాజీ మంత్రి అనితా రాధాకృష్ణన్‌ను కూడా పోలీసులు అరెస్ట్ చేయగా, ఆయన అదే రోజు బెయిల్‌పై విడుదలయ్యారు. తాజా అరెస్టుతో తమిళనాడులో డీఎంకే, టీవీకే పార్టీల మధ్య రాజకీయ యుద్ధం మరింత ముదిరింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement