న్యూఢిల్లీ: పార్లమెంట్ మార్చ్ సందర్భంగా నిరసన తెలియజేస్తున్న ఓ మహిళపై చేయి చేసుకున్న ఢిల్లీ పోలీసు అదనపు డీసీపీ సందీప్ లాంబాపై వేటు పడింది. జంతర్ మంతర్ వద్ద జరుగుతున్న ఆందోళన ప్రాంతం నుంచి ఆయనను తక్షణమే తొలగిస్తూ ఢిల్లీ పోలీసులు ఆదేశాలు జారీ చేశారు. జులై 20వ తేదీన ‘కాక్రోచ్ జనతా పార్టీ’ (సీజేపీ) ఆధ్వర్యంలో పార్లమెంట్ ముట్టడికి భారీగా నిరసనకారులు తరలివచ్చారు. ఈ క్రమంలో జరిగిన తోపులాట, ఉద్రిక్త పరిస్థితుల నడుమ నూఢిల్లీలోని పార్లమెంట్ కాంప్లెక్స్ సమీపంలో పరుగెత్తుతున్న ఓ మహిళపై అదనపు డీసీపీ సందీప్ లాంబా చేయి చేసుకున్నారు. ఈ ఘటనకు సంబంధించిన 36 సెకండ్ల వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో తీవ్ర విమర్శలు వ్యక్తమయ్యాయి.
ఈ ఘటనపై ఢిల్లీ హైకోర్టులోనూ విచారణ జరిగింది. నిరసనకారుల తరపున వాదించిన సీనియర్ న్యాయవాది గోపాల్ శంకరనారాయణన్ యూనిఫామ్‌లో ఉన్న వ్యక్తుల దౌర్జన్యాలను ఉపేక్షించకూడదని, ఆ అధికారిని కోర్టుకు పిలిపించి బాధ్యత వహించేలా చేయాలని న్యాయస్థానాన్ని కోరారు. మరోవైపు, తృణమూల్ కాంగ్రెస్ మాజీ ఎంపీ సాకేత్ గోఖలే కూడా ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసు వర్గాల సమాచారం ప్రకారం.. ఆ మహిళ చేతిలో మేకులు లాంటి వస్తువు ఉందని, ఎంత చెప్పినా అక్కడి నుంచి వెళ్లకుండా పోలీసులతో వాగ్వాదానికి దిగిందని, దీంతో ఆగ్రహం కట్టలు తెంచుకోవడంతోనే ఆ అధికారి ఆ విధంగా ప్రవర్తించారని ఒక డీసీపీ స్థాయి అధికారి తెలిపారు. మహిళా నిరసనకారులతో వ్యవహరించేటప్పుడు సంయమనం పాటించాలని ఆయనకు సూచించినట్లు పేర్కొన్నారు. మరోవైపు జూలై 20 నాటి ఆందోళనల్లో భారీగా జనం గుమికూడటంతో పోలీసులు లాఠీచార్జి చేసి, బాష్పవాయువు ప్రయోగించారు. ఈ నిరసనలకు సంబంధించి రాజకీయ నాయకుల నిరసనలు, అరెస్టుల పర్వం కూడా కొనసాగుతోంది.


