యావత్ దేశాన్ని దిగ్భ్రాంతికి గురి చేసిన పుణె లోహగఢ్ కోట హత్య కేసు దర్యాప్తులో మరిన్ని సంచలనాలు బయటకు వస్తున్నాయి. యువ వ్యాపారవేత్త కేతన్ అగర్వాల్‌తో వివాహం ఇష్టం లేకనే సియా గోయల్, చేతన్ చౌదరి కలిసి హత్య చేసినట్లు అభియోగాలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. అయితే ఈ కేసులో ఇప్పుడో షాకింగ్ విషయం బయటపడింది. ప్లాన్ ఏకు భయపడి.. ప్లాన్ బీను అమలు చేసి సియా ఈ ఘాతుకానికి పాల్పడినట్లు పోలీసులు నిర్ధారించుకున్నారు.
కేతన్, సియాలకు ఈ ఏడాది ఫిబ్రవరిలో నిశ్చితార్థం జరిగింది. నవంబర్‌లో రాజస్థాన్‌లోని జైపూర్‌లో ఘనంగా వివాహం జరిపేందుకు ఇరు కుటుంబాలు ఏర్పాట్లలో తలమునకలై ఉన్నాయి. అయితే చేతన్‌తో ప్రేమలో ఉన్న సియా మాత్రం ఈ పెళ్లి ఎలాగైనా ఆపాలని తీవ్ర ప్రయత్నాలు చేసింది. ఓవైపు కేతన్‌తో సన్నిహితంగా ఉంటూనే.. మరోవైపు ప్రియుడితో దారుణమైన స్కెచ్‌లు గీసింది. ఇందుకోసం వెబ్ సిరీస్‌లు, క్రైమ్ సినిమాలు చూస్తూ గంటల తరబడి గడిపింది. చివరకు.. చేతన్‌తో కలిసి ఈ పెళ్లి ఆపడానికి రెండు ప్లాన్‌లు గీసింది. అందులో..
మొదటిది కేతన్‌కు యాక్సిడెంట్ చేయడం!. అతడిని గాయపరిచి పెళ్లిని వాయిదా వేయాలని.. ఆ తర్వాత కలిసి పారిపోవడమో లేదంటే ఈ గ్యాప్‌లో మరేదైనా ప్లాన్ అమలు చేయాలని భావించింది. అయితే ఆ ప్లాన్‌లో రిస్క్ ఎక్కువగా ఉందని భావించి డ్రాప్ అయ్యారు. కేతన్‌ను ఈ విషయం తెలిసిపోతే తమ పని అయిపోయినట్లేనని భయపడ్డారు. ఒకవేళ ప్లాన్ బెడిసి కొట్టి బలవంతంగా పెళ్లి జరిగితే ఆ తర్వాత తమ బంధం కొనసాగదని భావించారు. అందుకే ప్లాన్ బీ అమలు చేయాలని ఫిక్స్ అయ్యారు. పక్కా ప్లాన్ గీసి కేతన్‌ను అంతమొందించారు.
సస్పెన్స్ సినిమాలు.. ఆన్‌లైన్ సెర్చ్‌లు
హత్యను ప్రమాదంగా చిత్రీకరించేందుకు నిందితులు పక్కా ప్రణాళిక వేసినట్లు పోలీసులు చెబుతున్నారు. ఇందుకోసం సస్పెన్స్ సినిమాలు చూసారని, హత్య తర్వాత ఆధారాలు దొరకకుండా ఉండేందుకు ఇంటర్నెట్‌లో సమాచారం వెతికారని తెలిపారు. సియా ఫోన్ హిస్టరీలో ఈ విషయం బయటపడిందని తెలిపారు. అంతేకాదు.. కేతన్‌ను ఎక్కడ హత్య చేస్తే అది ప్రమాదంలా కనిపిస్తుందో తెలుసుకునేందుకు పలు ప్రాంతాలను పరిశీలించినట్లు వెల్లడించారు. లోనావాలాలోని టైగర్ పాయింట్, విశాపూర్ కోట తదితర ప్రాంతాలను పరిశీలించిన తర్వాత లోహగఢ్ కోటను ఎంచుకున్నారని చెప్పారు.
ముందుగానే రెక్కీ చేసిన సియా?
దర్యాప్తులో భాగంగా సియా మే 31న కేతన్‌తో కలిసి లోహగఢ్ కోటకు వెళ్లినట్లు పోలీసులు గుర్తించారు. ఆ పర్యటన హత్యకు ముందు చేసిన రెక్కీ అయి ఉండొచ్చని అనుమానిస్తున్నారు. అక్కడ ఎక్కడ నుంచి తోసేస్తే కేతన్ మృతి చెందుతాడు.. ఆధారాలు దొరకకుండా ఎలా చేయాలనే విషయాలను పరిశీలించినట్లు పోలీసులు చెబుతున్నారు. ఆ తర్వాత జూన్ 3న మరోసారి అక్కడికి వెళ్లేందుకు కేతన్‌ను ఒప్పించే ప్రయత్నం చేసినట్లు తెలిపారు.
బాలి ట్రిప్ కూడా కుట్రలో భాగమేనా?
సియా, కేతన్‌లు జూన్ 6న ఇండోనేషియాలోని బాలి పర్యటనకు వెళ్లాల్సి ఉంది. ఎనిమిది రోజుల పాటు అక్కడ గడపాలని ప్లాన్ చేసుకున్నారు. అయితే ఆ ప్రయాణం తమ కుట్రకు అడ్డుగా మారుతుందని భావించిన నిందితులు.. ఎలాగైనా ఆ పర్యటనను ఆపాలని ప్రయత్నించారు. ముంబై పర్యటన సమయంలో సియా కేతన్ పాస్‌పోర్ట్‌ను దొంగిలించిందని.. దీంతో బాలి ప్రయాణం రద్దయిందని పోలీసులు తెలిపారు.
ముందే ఒకసారి హత్యాయత్నం?
లోహగఢ్ కోట వద్ద జూన్ 14న సియా కేతన్‌ను తోసేసేందుకు ప్రయత్నించినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. అయితే కేతన్ ఓ పొదను పట్టుకుని ప్రాణాలతో బయటపడ్డాడని తెలిపారు. ఆ సమయంలో అనుమానం రాకుండా.. పాము నుంచి కాపాడేందుకు తానే తోశానని సియా చెప్పినట్లు పోలీసులు పేర్కొన్నారు. తర్వాత జూన్ 18న మరోసారి లోహగఢ్ కోటకు తీసుకెళ్లి.. చేతన్‌తో కలిసి కేతన్‌ను లోయలోకి తోసి చంపినట్లు పోలీసులు నిర్ధారించుకున్నారు. ఈ కేసులో దర్యాప్తు ముందుకు సాగే కొద్దీ మరిన్ని కొత్త విషయాలు బయటపడే అవకాశం కనిపిస్తోంది.


