తమిళనాడు: కన్యాకుమారి జిల్లా తక్కలై సమీపంలో స్నానం చేస్తున్న ఉపాధ్యాయురాలిని రహస్యంగా వీడియో తీసి, బెదిరించి బలవంతంగా శారీరక సంబంధం పెట్టుకున్న యువకుడు దానిని రికార్డ్ చేశాడు. ఆ తర్వాత అతని స్నేహితుడు కూడా సదరు టీచర్‌ను బెదిరించి అత్యాచారానికి పాల్పడ్డాడు. దీనిపై వచ్చిన ఫిర్యాదు మేరకు కోర్టు ఆదేశాల ప్రకారం పోలీసులు కేసు నమోదు చేసి, ఇద్దరు యువకుల కోసం గాలిస్తున్నారు.
తమిళనాడు కన్యాకుమారి జిల్లా తక్కలై సమీప ప్రాంతానికి చెందిన 36 ఏళ్ల ఉపాధ్యాయురాలు మదురై హైకోర్టు బెంచ్‌లో ఓ పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్‌లో ‘‘నేను ఒక పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా పని చేస్తున్నాను. నా భర్త టెంపో డ్రైవర్. నేను నా ఇంటి బాత్‌రూమ్‌లో స్నానం చేస్తుండగా, అదే ప్రాంతానికి చెందిన జయకాంతన్ అనే వ్యక్తి రహస్యంగా తన సెల్‌ఫోన్‌లో వీడియో తీశాడు. ఆ తర్వాత సదరు వ్యక్తి ఆ వీడియోను అడ్డం పెట్టుకుని తనను బ్లాక్‌మెయిల్ చేస్తూ, నిరంతరం వేధింపులకు గురిచేశాడు’’ అని ఆ పేర్కొన్నారు. నిందితుడు తనను భయపెట్టి డబ్బులు వసూలు చేయడమే కాకుండా, అతని స్నేహితుడు కూడా ఈ విషయం తెలుసుకుని తనను వేధించాడని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ ఫిర్యాదును తీవ్రంగా పరిగణించిన కోర్టు ఆదేశాల మేరకు తక్కలై పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితులపై సమాచార సాంకేతిక పరిజ్ఞాన దుర్వినియోగం, బలవంతపు వేధింపులు ఇతర తీవ్రమైన సెక్షన్ల కింద విచారణ చేపడుతున్నారు. ప్రస్తుతం పరారీలో ఉన్న నిందితుల కోసం పోలీసులు ప్రత్యేక బృందాలతో గాలిస్తున్నారు.


