ప్రమాదంలా చిత్రీకరించి, విఫలం
సాంకేతిక ఆధారాలతో నిజాలు వెలికితీసిన పోలీసులు
వివరాలు వెల్లడించిన డీఎస్పీ విఠల్‌రెడ్డి
నిజామాబాద్, బాన్సువాడ: చిన్నారిపై హత్యాయత్నం చేసిన ఘటనలో తండ్రి, సవతి తల్లిని పోలీసులు రిమాండ్‌కు తరలించారు. సోమవారం బాన్సువాడలో ఏర్పాటు చేసిన సమావేశంలో డీఎస్పీ విఠల్‌రెడ్డి వివరాలు వెల్లడించారు. బీర్కూర్‌కు చెందిన టేకు సతీశ్‌కు ఇద్దరు భార్యలు. సతీశ్ మొదట శైలజను పెళ్లి చేసుకున్నాడు. ఆమెకు ముగ్గురు కుమార్తెలు. ఆ తర్వాత శైలజ చెల్లి సంధ్యను ప్రేమించి పెళ్లి చేసుకోవడంతో వైష్ణవి జన్మించింది. వైష్ణవి పుట్టినప్పటి నుంచి సతీశ్, శైలజతో గొడవలు జరగడంతో సంధ్య పుట్టింటికి వెళ్లిపోయింది. వైష్ణవిని మాత్రం సతీశ్ తన వద్దనే పెంచుకుంటున్నాడు.
ఈ నెల 15న ఉదయం చిన్నారి వైష్ణవి పొదల్లో రక్తమడుగుల్లో కొట్టుమిట్టాడుతూ కనిపించింది. చిన్నారి పరిస్థితి విషమంగా ఉండటంతో నిజామాబాద్ ఆస్పత్రికి అక్కడి నుంచి హైదరాబాద్ నిలోఫర్ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం చిన్నారి ఆరోగ్యం విషమంగానే ఉంది. అయితే, అక్క శైలజ తన కుమార్తెను హత్య చేయాలనే ఉద్దేశంతో బ్లేడ్‌తో దాడికి పాల్పడినట్లు సంధ్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో బాన్సువాడ రూరల్ సీఐ తిరుపయ్య, బీర్కూర్, పిట్లం ఎస్సైలు రాములు, ఆంజనేయులు ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి శాస్త్రీయ దర్యాప్తు చేపట్టినట్లు డీఎస్పీ పేర్కొన్నారు. నిందితులను అదుపులోకి తీసుకొని విచారించినట్లు తెలిపారు.
వైష్ణవిని పోశించడం భారంగా మారడంతోపాటు కుటుంబంలో విభేదాల నేపథ్యంలో చిన్నారిని అడ్డు తొలగించాలని సతీశ్, శైలజ కుట్ర పన్నారు. 14న రాత్రి నిద్రిస్తున్న చిన్నారి వైష్ణవిని ఇద్దరూ కలిసి సీసీ రోడ్డుపై ఈడ్చుకుంటూ కొంతదూరం తీసుకెళ్లి గడ్డి ఉన్న ప్రదేశంలో పడుకోబెట్టి వెంట తెచ్చుకున్న బ్లేడ్‌తో గాయపర్చారు. చిన్నారి ఏడుపు ఆగిపోవడంతో చనిపోయిందని భావించి అక్కడే వదిలేసి తిరిగి ఇంటికి వెళ్లారు. మరుసటి రోజు ఉదయం చిన్నారి కనిపించడం లేదని, గ్రామపెద్దలకు సమాచారం ఇచ్చి వారితో కలిసి వెతుకుతున్నట్లు నటించారు. చిన్నారి ఉన్న ప్రదేశం ముందుగానే తెలిసి కూడా అక్కడికి వెళ్లి కనిపించినట్లు చెప్పి ఎలాంటి అనుమానం రాకుండా బంధువులతో కలిసి చిన్నారిని ఆస్పత్రికి తరలించారు.
చిన్నారిని కుక్కలు ఎత్తుకెళ్లి గాయపరిచినట్లు గ్రామస్తులు, బంధువులు, పోలీసులను నమ్మించే ప్రయత్నం చేశారు. సాంకేతిక ఆధారాలు, శాస్త్రీయ పరిశీలన, సాక్షుల వాంగ్మూలాల ఆధారంగా నిందితులు విచారించగా నేరాన్ని అంగీకరించినట్లు డీఎస్పీ వెల్లడించారు. నిందితులు సతీశ్, శైలజ వద్ద రెండ్లు సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. కేసును ఛేదించిన బాన్సువాడ రూరల్ సీఐ తిరుపయ్య, బీర్కూర్, పిట్లం ఎస్సైలు రాములు, ఆంజనేయులులను ఎస్పీ అభినందించారని ఆయన పేర్కొన్నారు.


