కోరుట్ల/మెట్‌పల్లి: జగిత్యాల జిల్లా కోరుట్ల ఆర్టీసీ బస్టాండ్‌లో మంగళవారం ఆగి ఉన్న బస్సును మద్యం మత్తులో ఓ వ్యక్తి ఎత్తుకెళ్లి అడ్డదిడ్డంగా నడిపి బీభత్సం సృష్టించాడు. సుమారు 15 కి.మీ. మేర హైవేపై బస్సును తీసుకెళ్లిన వ్యక్తిని పోలీసులు వెంబడించి పట్టుకున్నారు. కోరుట్ల బస్టాండ్‌లో డ్రైవర్ ప్రవీణ్ బస్సును నిలిపి టీ తాగుదామని కండక్టర్‌తో కలిసి వెళ్లాడు. ఇంతలో ధర్మపురి మండలం నాగారం గ్రామానికి చెందిన సాంబయ్య (40) మద్యం మత్తులో బస్సు ఎక్కి ఇన్‌గేట్ నుంచి బస్సును తీసుకెళ్లి హైవేపైకి మళ్లించాడు. గమనించిన ప్రవీణ్ పోలీసులకు సమాచారం ఇచ్చాడు.
వెంటనే కోరుట్ల, కథలాపూర్ పోలీసులు అప్రమత్తమై బస్సును వెంబడించారు. మెట్‌పల్లికి వెళ్లేలోపు సాంబయ్య కోరుట్ల శివారులో ఓ బైక్‌ను, ఆరపేట వద్ద మరో బైక్‌ను ఢీకొట్టడంతో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. తర్వాత సాంబయ్య కథలాపూర్ పోలీసుల వాహనాన్నీ ఢీకొట్టాడు. గండిహనుమాన్ చెక్ పోస్టు సమీపంలో పోలీసులు లారీ, ట్రాక్టర్లను రోడ్డుపై అడ్డంగా ఉంచడంతో సాంబయ్య బస్సును పక్కకు మళ్లించే క్రమంలో బస్సు రోడ్డు దిగి ఆగింది. ఆ వెంటనే పోలీసులు సాంబయ్యను అదుపులోకి తీసుకున్నారు.


