టూర్‌కని వెళ్లి.. అస్థి పంజరమై ఇంటికి.. | - | Sakshi
Sakshi News home page

టూర్‌కని వెళ్లి.. అస్థి పంజరమై ఇంటికి..

Jul 22 2026 11:29 AM | Updated on Jul 22 2026 11:29 AM

రాహుల్‌ విషాదాంతంపై మిన్నంటిన రోదనలు గుండెలు పగిలేలా రోదించిన తల్లిదండ్రులు రెండు రాష్ట్రాలను కుదిపేసిన బీటెక్‌ విద్యార్థి విషాదాంతం రాహుల్‌ మరణం వెనుక అసలు కథేంటి?

కోరుట్ల మండలం అయిలాపూర్‌కు చెందిన అంకం రాజేశ్వర్‌, వనిత దంపతుల కుమారుడు రాహుల్‌ (23) హైదాబాద్‌లో బీటెక్‌ నాలుగో సంవత్సరం చదువుతున్నాడు. ఈ ఏడాది మే 27న స్నేహితులతో కలిసి టూర్‌కు వెళ్తున్నానని తల్లికి ఫోన్‌లో చెప్పాడు. అప్పటినుంచి సమాచారం లేకపోవడంతో తల్లిదండ్రులు కళాశాల యాజమాన్యం, స్నేహితులు, బంధువులను ఆరా తీశారు. చివరకు పోలీసులను ఆశ్రయించారు. మే 30న ఆంధ్రప్రదేశ్‌లోని సింగరాయకొండ పోలీసులు ఓ యువకుడి మృతదేహాన్ని బావిలో గుర్తించారు. బండ కట్టి ఉండటంతో అనుమానాస్పద మృతిగా భావించి ఖననం చేశారు. వారంరోజులకు రాహుల్‌ మృతదేహం ఫొటోలు తెలంగాణ పోలీసుల ద్వారా తల్లిదండ్రులకు చేరడంతో ఒక్కసారిగా కుప్పు కూలిపోయారు. తమ కొడుకును కళాశాలలో గొడవలతో ఎవరో కావాలనే చంపేశారని, పూర్తిస్థాయి విచారణ చేసి న్యాయం చేయాలని ఆంధ్ర, తెలంగాణ పోలీసులపై ఒత్తిడి తెచ్చారు. రాహుల్‌ తరఫున విద్యార్థి, కులసంఘాలు ఉద్యమాలు చేపట్టాయి. ఆంధ్ర పోలీసులు కేసు విచారణ, మృతదేహం అప్పగింతలో నిర్లక్ష్యం చూపుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

హైకోర్టు ఆదేశాలతో..

రాహుల్‌ మృతిపై విచారణ జరిపి మృతదేహం అప్పగించాలని కోరుతూ 20 రోజుల క్రితం ఆయన తల్లిదండ్రులు హైకోర్టును ఆశ్రయించారు. వారం రోజుల్లో కేసు విచారణ పూర్తి చేసి మృతదేహాన్ని త్వరితగతిన తల్లిదండ్రులకు అప్పగించాలని కోర్టు ఆదేశించింది. అప్పటిదాకా పట్టింపులేనట్లు ఉన్న ఆంధ్ర పోలీసులు ఖననం చేసిన మృతదేహాన్ని వెలికి తీసి డీఎన్‌ఏ టెస్టుకు పంపి రాహుల్‌గా గుర్తించారు. మృతదేహాన్ని అప్పగిస్తామని తల్లిదండ్రులకు రెండురోజుల క్రితం సమాచారం ఇచ్చారు. దీంతో తల్లిదండ్రులు సింగరాయకొండకు వెళ్లగా ఎముకల గూడును అప్పగించారు. ఇంత జరిగినప్పటికీ రాహుల్‌ మృతి వెనక కారణాలు ఇప్పటికీ స్పష్టంగా వెల్లడి కాకపోవడం గమనార్హం.

కోరుట్ల: ‘అమ్మా నేను టూర్‌ వెళ్తున్నా..’ అని చెప్పిన కొడుకు రెండు నెలలకు ఎముకల గూడుగా ఇంటికి చేరిన వైనం కలచివేస్తోంది. చేతికందిన కొడుకు చేయూతగా నిలుస్తాడని ఆశించిన ఆ తల్లిదండ్రుల ఆశలు కల్లలయ్యాయి. తెలంగాణ, ఆంధ్రరాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన కోరుట్లకు చెందిన బీటెక్‌ విద్యార్థి అంకం రాహుల్‌ మృతిపై లెక్కలేని అనుమానాలు రేకెత్తుతున్నాయి. అస్తి పంజరమై ఇంటికి చేరిన అతడి మృతదేహానికి మంగళవారం బంధువులు, కుటుంబ సభ్యులు శోకసంద్రం మధ్య అంత్యక్రియలు నిర్వహించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement