ఉరేసుకుని సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ ఆత్మహత్య | - | Sakshi
Sakshi News home page

ఉరేసుకుని సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ ఆత్మహత్య

Jul 22 2026 11:29 AM | Updated on Jul 22 2026 11:29 AM

ఉరేసుకుని సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ ఆత్మహత్య ఇంటిపై నుంచి పడి యువకుడు దుర్మరణం సినీ ఫక్కీలో చోరీ ట్రాక్టర్‌ను ఢీకొన్న వ్యాన్‌ లాడ్జిలో కానిస్టేబుల్‌పై పోలీసుల సెర్చ్‌

జీడిమెట్ల: మానసిక వేదనతో ఓ వ్యక్తి ఉరివేసుకుని అత్మహత్య చేసుకున్న సంఘటన హైదరాబాద్‌లోని జీడిమెట్ల పీఎస్‌ పరిధిలో చోటు చేసుకుంది. సీఐ రవికుమార్‌ వివరాల ప్రకారం పెద్దపల్లి జిల్లా మంథనికి చెందిన శ్రీరామోజు దక్షిణమూర్తి కొడుకు చందు(34)కు 2017లో అదే ప్రాంతానికి చెందిన సంధ్యతో వివాహమైంది. చందు సంధ్యతో కలిసి చింతల్‌ గాంధీనగర్‌లో నివాసముంటూ సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం చేస్తున్నాడు. వారం క్రితం దంపతుల మధ్య గొడవ జరిగింది. సంధ్య ఇద్దరు కుమార్తెలను తీసుకుని పుట్టింటికి వెళ్లింది. చందు సోమవారం సాయంత్రం సంధ్యకు ఫోన్‌ చేసి అత్మహత్య చేసుకుంటున్నానని చెప్పాడు. అనంతరం సీలింగ్‌ ఫ్యాన్‌కు ఉరి వేసుకున్నాడు. సంధ్య హైదరాబాద్‌లో ఉండే బంధువులకు విషయాన్ని తెలపగా, వారువెళ్లి చూసేసరికి చందు మృతిచెంది ఉన్నాడు. దక్షిణమూర్తి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు.

మేడిపల్లి: ఇంటి నిర్మాణ పనులు చేస్తుండగా ప్రమాదవశాత్తు కాలుజారి కింద పడి ఓ యువకుడు అక్కడికక్కడే మృతి చెందిన ఘటన మండలంలోని కొండాపూర్‌లో చోటుచేసుకుంది. ఎస్త్సె శ్రీధర్‌రెడ్డి కథనం ప్రకారం.. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం ప్రకాశం జిల్లా పామూరు మండలం వగ్గంపల్లికి చెందిన బల్లారపు రవీంద్ర (31) ఉపాధి నిమిత్తం కొండాపూర్‌కు వచ్చి కొన్ని రోజులుగా భవన నిర్మాణ కార్మికుడిగా పనిచేస్తున్నాడు. మంగళవారం ఓ యజమాని ఇంటికి ఎలివేషన్‌ పనులు చేస్తుండగా ప్రమాదవశాత్తు కింద పడటంతో అక్కడికక్కడే మృతి చెందాడు. రవీంద్ర తండ్రి బల్లారపు నర్సయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

● ద్విచక్రవాహనం నుంచి రూ.లక్ష మాయం

● పోలీస్‌స్టేషన్‌లో బాధితుడి ఫిర్యాదు

కోరుట్ల: పట్టణంలోని ఇందిరారోడ్‌లో ఉన్న బ్యాంకులో రూ.లక్ష డ్రా చేసి.. ద్విచక్రవాహనంపై వెళ్తుండగా బస్టాండ్‌ వద్ద గుర్తు తెలియని దొంగలు డబ్బులు ఎత్తుకెళ్లిన ఘటన మంగళవారం చోటు చేసుకుంది. మేడిపల్లి మండలం దమ్మన్నపేటకు చెందిన కొక్కెర రాజం కోరుట్లలోని బ్యాంకు నుంచి రూ.లక్ష డ్రా చేశాడు. బస్టాండ్‌ వద్ద వాహనం ఆపి పక్కనే చాయ్‌ తాగేందుకు వెళ్లాడు. వచ్చి చూసే సరికి డబ్బులు కనిపించలేదు. దీంతో బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై చిరంజీవి తెలిపారు.

● వలస కూలీ అక్కడికక్కడే మృతి

మల్యాల: కట్టెల లోడుతో వెళ్తున్న ట్రాక్టర్‌ను వ్యాన్‌ వెనుక నుంచి ఢీకొన్న ఘటనలో ట్రాక్టర్‌పై కూర్చున్న కూలీ ఎగిరిపడి తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మృతి చెందిన ఘటన మండలంలోని కరీంనగర్‌ – జగిత్యాల రహదారిపై చోటుచేసుకుంది. బల్వంతాపూర్‌ నుంచి కట్టెల లోడుతో జగిత్యాల వైపు వెళ్తున్న ట్రాక్టర్‌ను మంగళవారం ఉదయం కరీంనగర్‌ నుంచి జగిత్యాల వైపు వెళ్తున్న వ్యాన్‌ వెనక నుంచి ఢీకొంది. ఈ సంఘటనలో ట్రాక్టర్‌పై కూర్చున్న కూలీ మానెపల్లి పోచయ్య (45) ఎగిరి రోడ్డుపై పడ్డాడు. వ్యాన్‌ అతడిపై నుంచి వెళ్లడంతో తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతి చెందాడు. వ్యాన్‌లో ఉన్న వెల్గటూర్‌కు చెందిన రాజ్‌ మహమ్మద్‌ గాయపడ్డాడు. అతడిని 108లో జగిత్యాల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

కట్టెలు అన్‌లోడింగ్‌ చేసేందుకు వెళ్తూ...

మంచిర్యాల జిల్లా భీమిని మండలకేంద్రానికి చెందిన పోచయ్య కుటుంబంతో సహా బల్వంతాపూర్‌కు పన్నెండేళ్ల క్రితం వలస వచ్చి కూలీగా పనిచేస్తున్నాడు. ట్రాక్టర్‌లో కట్టెలు వేసుకుని అన్‌లోడ్‌ చేసేందుకు వెళ్తుండగా రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. మృతుడికి భార్య విజయ, కూతురు స్రవంతి, కుమారుడు వినయ్‌ ఉన్నారు. విజయ ఫిర్యాదు మేరకు వ్యాన్‌ డ్రైవర్‌ కృష్ణశంకర్‌పై కేసు నమోదు చేశామని ఎస్సై సందీప్‌ తెలిపారు.

కాళేశ్వరం: పెద్దపల్లి జిల్లా గోదావరిఖనికి చెందిన ఓ కానిస్టేబుల్‌ ఓ గుర్తుతెలియని యువతితో కలిసి మహదేవపూర్‌ మండలం కాళేశ్వరంలోని ఓ ప్రైవేట్‌ లాడ్జిలో గది అద్దెకు ఉన్నట్లు అనుమానించిన భార్య, సోదరుడు కాళేశ్వరం పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. మంగళవారం సెల్‌ లొకేషన్‌ ఆధారంగా కాళేశ్వరంలోని ఓ లాడ్జిలో సెర్చింగ్‌ చేపట్టగా కానిస్టేబుల్‌ ఉన్నట్లు కనుగొన్నారు. దీంతో పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకొని ఠాణాకు తరలించి విచారించి పంపినట్లు తెలిపారు. ఈ విషయమై మహదేవపూర్‌ సీఐ వెంకటేశ్వర్లును ఫోన్‌లో సంప్రదించగా.. అతను లాడ్జి గదిలో ఒక్కడే ఉన్నాడని, యువతి ఎవరూ లేరని తెలిపారు. అతనికి కౌన్సెలింగ్‌ ఇచ్చి పంపించినట్లు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement