జగిత్యాలరూరల్: రాష్ట్ర ఏర్పాటు ఉద్యమంలో గిరిజనులు ప్రధాన పాత్ర పోషించారని బీఆర్‌ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీమంత్రి జీవన్‌రెడ్డి అన్నారు. మంగళవారం సారంగాపూర్ మండలం లక్ష్మీదేవిపల్లిలో విలేకరులతో మాట్లాడారు. రా జ్యాంగం ప్రకారం దళితులు, గిరిజనులకు జనాభా ప్రతిపాదికన రిజర్వేషన్లు కల్పించాల్సి ఉండగా.. ఆరు శాతం మాత్రమే అమలయ్యాయని, రాష్ట్రం ఏర్పడ్డాక కేసీఆర్ పది శాతానికి పెంచి గిరిజనులకు అండగా నిలిచారన్నారు. తండాలు మెరుగుపడాలనే ఉద్దేశంతో పంచాయతీలుగా ఏర్పాటు చేశారని పేర్కొన్నారు. గిరిజనుల హక్కులు పూర్తిస్థాయిలో అమలు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. ముందుగా శీత్లాభవాని ఆలయంలో పూజలు చేశారు. కార్యక్రమంలో నాయకులు తేలు రాజు, సర్పంచ్ ఆకుల రమేశ్, సర్పంచ్ భూక్య సంతోష్, ఉపసర్పంచ్ చిరంజీవి, నాయకులు రాంచందర్‌రెడ్డి, తిరుపతి, గంగాధర్, సుధాకర్, మహిపాల్‌రెడ్డి, శేఖర్, రాజు, శ్రీధర్ పాల్గొన్నారు.
సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలి
పెగడపల్లి: సీజనల్ వ్యాధుల నివారణకు వైద్య సిబ్బంది శ్రద్ధ తీసుకుంటూ.. ప్రజలను అప్రమత్తం చేయాలని జాతీయ క్రీమివ్యాధి కారక నిర్మూలన అధికారి అర్చన అన్నారు. మండలకేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంతోపాటు ఎల్లాపూర్ సబ్ సెంటర్‌ను వైద్యాధికారి నరేశ్‌తో కలిసి సందర్శించారు. మందుల నిల్వలను పరిశీలించారు. అనంతరం ఇంటింటా చేపడుతున్న సర్వేలో పాల్గొన్నారు. వ్యాధులు, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించారు. ప్రతివారం డ్రైడే పాటించాలన్నారు. సూపర్‌వైజర్ జయశీల, ఏఎన్‌ఎంలు, ఆశవర్కర్లు పాల్గొన్నారు.
ఉద్యాన సాగు పెంచాలి
జగిత్యాలఅగ్రికల్చర్: ఎల్‌నినో పరిస్థితుల నేపథ్యంలో వరి సాగు తగ్గించి ఆయిల్ పాం, పండ్లతోటల వంటి ఉద్యాన పంటలు సాగు చేయాలని జగిత్యాల నియోజకవర్గ ఉద్యానశాఖాధికారి ఐలయ్య అన్నారు. జగిత్యాల రూరల్ మండలం పొలాస, అనంతారం గ్రామాల్లో రైతులకు మంగళవారం అవగాహన కల్పించారు. ఈ ఏడాది ఎల్‌నినోతో వర్షాభావ పరిస్థితులు ఏర్పడుతున్నాయని, తక్కువ నీటితో పండే పంటలను సాగు చేయాలని సూచించారు. మండల ఉద్యాన విస్తీర్ణాధికారి అనిల్‌కుమార్, సర్పంచ్ మిల్కూరి శంకర్, అనంతారం సర్పంచ్ బత్తిని రవీనా, లోహియా కంపెనీ ప్రతినిధి విక్రం పాల్గొన్నారు.
విద్యార్థులతో బీజేపీ చెలగాటం
జగిత్యాలటౌన్: విద్యార్థుల భవిష్యత్తుతో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం చెలగాటం ఆడుతోందని, ఢిల్లీలో రబ్బర్ బుల్లెట్లు, టియర్ గ్యాస్, లాఠీచార్జీలతో విరుచుకుపడడం సరికాదని వామపక్షాలు పేర్కొన్నాయి. జిల్లాకేంద్రంలోని తహసీల్ చౌరస్తాలో వామపక్షాలు, అభ్యుదయ సంఘాల ఆధ్వర్యంలో మంగళవారం నిరసన చేపట్టారు. సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యులు లెల్లెల బాలకృష్ణ, సీపీఐ జిల్లా కార్యదర్శి చెన్న విశ్వనాఽథం, సీపీఐ (ఎంఎల్) న్యూడెమొక్రసీ నాయకులు చింత భూమేశ్వర్, సీపీఐ (ఎం) సీనియర్ నాయకుడు భూతం సారంగపాణి మాట్లాడుతూ.. నీట్ పేపర్ లీకేజీ మానవ హక్కుల ఉల్లంఘన అన్నారు. పరీక్ష పేపర్ లీకేజీకి బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్రప్రధాన్ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. చలో పార్లమెంట్ సందర్భంగా యువతపై లాఠీచార్జి చేయడం ప్రజాస్వామ్యాన్ని కాలరాయడమేనన్నారు. సుతారి రాములు పాల్గొన్నారు.


