ప్రత్యామ్నాయ పంటలే సాగు చేయాలి | - | Sakshi
Sakshi News home page

ప్రత్యామ్నాయ పంటలే సాగు చేయాలి

Jul 22 2026 11:29 AM | Updated on Jul 22 2026 11:29 AM

ఎల్‌నినోను కరోనా తరహాలో ఎదుర్కొందాం ప్రతి నీటిబొట్టును పొదుపుగా వినియోగించాలి కోరుట్ల నియోజకవర్గ స్థాయి సమీక్షలో మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌ కుమార్‌

మెట్‌పల్లి: ఎల్‌నినో ప్రభావాన్ని కరోనా తరహాలో ఎదుర్కోవాలని, రైతులు వరి తగ్గించి ఆరుతడి పంటలు సాగు చేయాలని మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌ కుమార్‌ అన్నారు. మంగళవారం మెట్‌పల్లిలో కోరుట్ల నియోజకవర్గస్థాయి సమీక్షలో కోరుట్ల ఎమ్మెల్యే సంజయ్‌, కలెక్టర్‌ సత్యప్రసాద్‌, ఎస్పీ అశోక్‌ కుమార్‌తో కలిసి మాట్లాడారు. ఎల్‌నినో ప్రభావం తీవ్ర ఆందోళన కలిగిస్తోందని, రాష్ట్రంలో ఇప్పటికే 35 శాతం లోటు వర్షపాతం నమోదైందని, భూగర్భజలాలు రోజురోజుకూ తగ్గిపోతున్నాయని తెలిపారు. వాతావరణ శాస్త్రవేత్తల అంచనాల ప్రకారం ఆగస్టు, సెప్టెంబర్‌, అక్టోబర్‌ నెలల్లో కూడా సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నారు. రైతులు చిరు ధాన్యాలు, పొద్దుతిరుగుడు, కందులు, పెసలు, మినుములు, ఇతర పప్పుధాన్యాలు, కూరగాయలు, ఉద్యానపంటలు సాగు చేయాలన్నారు. ఆయిల్‌ పాంకు తక్కువ నీటి వినియోగం అవుతుందన్నారు. 15రోజులకోసారి భూగర్భజలాల పరిస్థితిపై అధ్యయనం చేసి వాస్తవ పరిస్థితిని రైతులకు తెలియజేయాలని అధికారులను ఆదేశించారు. ప్రస్తుతం బోర్లలో నీరు ఉన్నా.. పంట చివరిదశకు ఉండే అవకాశం తక్కువన్నారు. తాగునీటి సరఫరాను నిరంతరంగా కొనసాగించడమే ప్రభుత్వ తొలి ప్రాధాన్యత కలెక్టర్‌ సత్యప్రసాద్‌ అన్నారు. ఈ సీజన్‌లో కాలువల ద్వారా సాగునీరు అందించే పరిస్థితి లేదని స్పష్టం చేశారు. ఎమ్మెల్యే సంజయ్‌ మాట్లాడుతూ మెట్‌పల్లి మున్సిపల్‌ పరిధిలో నీటి ఎద్దడి అధికంగా ఉందని, ప్రత్యామ్నాయ మార్గాలు చూపాలని కోరారు. స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌ బి.రాజాగౌడ్‌, మెట్‌పల్లి ఆర్డీవో నరసింహరావు, మున్సిపల్‌ కమిషనర్లు, ఇరిగేషన్‌, మిషన్‌ భగీరథ అధికారులు, వ్యవసాయ శాఖ అధికారులు, వ్యవసాయ శాస్త్రవేత్తలు, ఏఈఓలు, మున్సిపల్‌ చైర్మన్లు, స్థానిక ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

బాధిత కుటుంబానికి అండగా ఉంటాం

మెట్‌పల్లిరూరల్‌: హత్యకు గురైన మహిళ కుటుంబానికి అండగా ఉంటామని మంత్రి తెలిపారు. మెట్‌పల్లి మండలం చింతలపేటకు చెందిన కర్రె సునీత ఇటీవల హత్యకు గురికాగా ఆమె కుటుంబాన్ని మంగళవారం పరామర్శించారు. కుటుంబానికి ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రభుత్వం నుంచి రూ.4,12,500 చెక్కు అందించారు. మృతురాలి కుమారుల చదువు పూర్తయ్యే వరకు ప్రభుత్వమే బాధ్యత తీసుకుంటుందన్నారు. కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ గోవర్ధన్‌, కాంగ్రెస్‌ మండల అధ్యక్షుడు రాజేందర్‌, దళిత సంఘాల ప్రతినిధులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.

వసతుల కల్పనే లక్ష్యం

వెల్గటూర్‌: ప్రభుత్వ పాఠశాలల్లో వసతుల కల్పనే లక్ష్యమని మంత్రి అన్నారు. వెల్గటూర్‌ మండలం కుమ్మరిపల్లె మోడల్‌ స్కూల్‌ విద్యార్థులు తాగునీటి సమస్యతో ఇబ్బంది పడుతున్నారని ఉపాధ్యాయులు మంత్రి దృష్టికి తీసుకెళ్లగా స్పందించిన ఆయన బోర్‌వెల్‌కు భూమిపూజ చేశారు. రూ.10లక్షలతో నిర్మించిన కిచెన్‌ షెడ్‌ను ప్రారంభించారు. పాఠశాలలో క్రీడా మైదానం ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. కాంగ్రెస్‌ మండల అధ్యక్షుడు శైలేందర్‌రెడ్డి, ఏఎంసీ చైర్మన్‌ తిరుపతి, స్థానిక నాయకులు మురళి, ప్రతాప్‌రావు, ఉదయ్‌, తహసీల్దార్‌ శేఖర్‌, ఎంపీడీవో వెంకట్‌ ప్రసాద్‌, ప్రిన్సిపాల్‌ సందీప్‌రాజు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement