సాక్షి, హైదరాబాద్ : సొంతింటి కలను నిజం చేసుకుందామనే ఆశతో మీ సేవ కేంద్రాలకు వచ్చిన పేదలకు తొలిరోజే తీవ్ర నిరాశ ఎదురైంది. లో– ఇన్‌కమ్ గ్రూప్ (ఎల్‌ఐజీ) ఇందిరమ్మ ఇండ్ల కోసం దరఖాస్తుల స్వీకరణ ప్రారంభమైనప్పటికీ, కొన్నిచొట్ల సాంకేతిక ఇబ్బందులు తలెత్తడంతో గందరగోళం నెలకొంది. మీ సేవ కేంద్రాలకు తాకిడి పెరిగినప్పటికీ.. చాలావరకు కేంద్రాల్లో సైట్ ఓపెన్ కాలేదు.
దరఖాస్తు రుసుముతో పాటు ఏకంగా రూ.10,000 చెల్లించాల్సి రావడంతో లబ్ధిదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. చేతిలో నగదు పట్టుకుని మీ సేవ కేంద్రాలకు వచ్చిన దరఖాస్తుదారులు రద్దీతో డబ్బు ఎక్కడ పోతుందోనని ఆందోళన చెందారు. కొన్ని కేంద్రాల్లో ఆన్‌లైన్, డిజిటల్ పద్ధతులు అందుబాటులో లేకపోవడం, కేవలం నగదుకే ప్రాధాన్యమివ్వడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
‘ఒకవేళ ఇల్లు కేటాయించకపోతే మీరు చెల్లించిన డబ్బులు తిరిగి బ్యాంక్ ఖాతాలో జమ చేస్తాం‘ అని హౌసింగ్ శాఖ ప్రకటించినప్పటికీ, అసలు సమస్య ఇక్కడే మొదలైంది. మీ సేవ కేంద్రాల్లో ఇచ్చే దరఖాస్తు ఫారాల్లో దరఖాస్తుదారుడి బ్యాంక్ ఖాతా వివరాలు నమోదు చేసేందుకు ఎలాంటి స్థానం లేకపోవడం ఆశ్చర్యానికి గురి చేసింది. ఇల్లు రాకపోతే రీఫండ్ డబ్బులు ఏ ఖాతాలోకి వేస్తారు? అసలు తమ డబ్బులు తిరిగి వస్తాయా లేదా? అని ప్రశ్నిస్తున్నారు.


