ములుగులో భారీ వర్షానికి కొట్టుకుపోయిన రోడ్డు
వాజేడు: ములుగు జిల్లా వాజేడు మండల పరిధిలోని చీకుపల్లి, పెద్దగొళ్లగూడెం గ్రామాల మధ్య ఇసుకవాగు బ్రిడ్జి వద్ద ఏర్పాటు చేసిన డైవెర్షన్ రోడ్డు సోమవారం రాత్రి కురిసిన భారీ వర్షానికి కొట్టుకు పోయింది. దీంతో మంగళవారం వాగు అవతలి వైపున ఉన్న 25 గ్రామాల ప్రజలతో పాటు ఛత్తీస్‌గఢ్ నుంచి తెలంగాణకు రాకపోకలు నిలిచిపోయాయి.
రహదారి తెగక ముందు గర్భిణులను పరీక్షల నిమిత్తం వైద్యశాలకు తీసుకురావడానికి వాగు దాటి వెళ్లిన 102 అంబులెన్స్ తిరిగి వారిని తీసుకొస్తున్న సమయంలో రహదారి కొట్టుకుపోవడంతో కొద్దిసేపు అక్కడే ఉంది. తర్వాత వారిని పేరూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. కాగా, అయ్యవారిపేట గ్రామానికి చెందిన కావిరి వసంత (అనూష) 5వ కాన్పు కోసం పేరూరు వైద్యశాలకు వెళ్లగా.. నొప్పులు వస్తుండటంతో ఏటూరునాగారం తరలించాలని సిబ్బంది భావించారు. నొప్పులు ఎక్కువ కావడంతో ఉన్నతాధికారుల సలహా మేరకు కాన్పు చేశారు.
తల్లికి రక్తం తక్కువగా ఉండటంతో తప్పనిసరి పరిస్థితుల్లో ఏటూరునాగారం రిఫర్ చేశారు. అయితే చీకుపల్లి–పెద్దగొళ్లగూడెం గ్రామాల మధ్య రహదారి తెగిపోవడంతో ఎలా పంపించాలో అర్థంకాని ఆస్పత్రి సిబ్బంది.. తహసీల్దార్, ఎంపీడీఓ, ఎస్సైలకు విషయం తెలిపారు. స్పందించిన వారు ట్రాక్టర్ ఏర్పాటు చేసి వాగు ఉధృతి తక్కువగా ఉన్నచోట నుంచి కోయవీరాపురం గ్రామం వరకు వచ్చేలా ఏర్పాటు చేశారు. ఈలోగా సిద్ధంగా ఉన్న 108 అంబులెన్స్‌లో ఏటూరునాగారం ప్రభుత్వ వైద్యశాలకు పంపించారు.


